ఇప్పుడు టాలీవుడ్ లో లేటెస్ట్ డిస్కషన్ పాయింట్ జనతా గ్యారేజ్ ఎలా వుంటుంది? ఎలా వచ్చింది? ఇదే. మరో పది రోజుల్లో ఈ సినిమా జనం ముందుకు రాబోతోంది. ఈ సినిమా మీద చాలా అంటే చాలా అంచనాలు వున్నాయి. ఎన్టీఆర్ కెరీర్ కు ఇది కీలక సినిమా. టెంపర్, నాన్నకు ప్రేమతో సినిమాలతో ట్రాక్ మీదకు వచ్చిన ఎన్టీఆర్ కెరీర్, ఈ సినిమా విజయం సాధిస్తే పీక్ కు వెళ్లిపోతుంది. అలాగే మిర్చి, శ్రీమంతుడు సినిమాలతో టాప్ ఛెయిర్ లోకి వెళ్లిపోయిన దర్శకుడు కొరటాల శివ అందనంత ఎత్తుకు ఎదుగుతారు. బహుశా రాజమౌళి తరువాత ఆ రేంజ్ డైరక్టర్ అయ్యే అవకాశాలు కొరటాల శివకే వున్నాయి. ఈ సినిమా విజయం మాత్రమే దాన్ని ప్రూవ్ చేయగలదు. నిలబెట్టగలదు.
మరో పక్క అదే రేంజ్ టెన్షన్లు కూడా ఈ సినిమా చుట్టూనే వున్నాయి. 63 కోట్ల వ్యాపారం ఈ సినిమాపై ఆధారపడి వుంది. బ్రహ్మొత్సవం, సర్దార్ గబ్బర్ సింగ్, కబాలి లాంటి సినిమాలు ఇచ్చిన షాక్ నుంచి ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే తేరుకొంటోంది. అలాంటి సమయంలో ఈ సినిమా ఎలా వుంటుంది అన్న టెన్షన్ అయితే ఇండస్ట్రీలో వుంది. టాలీవుడ్ లో మరీ హైప్ ఎక్కువ వచ్చినా భయమే.
ఇక మహేష్ బాబు, నిర్మాత దానయ్య కూడా ఈ సినిమా ఫలితం కోసం చూస్తున్నారు. వాళ్లిద్దరు కలిసి కొరటాల శివతో వంద కోట్ల సినిమాకు ప్రిపేర్ అవుతున్నారు. ఆ ప్రాజెక్టు కు ఈ సినిమా ఏమీ బ్రేక్ వేయదు కానీ, దానిపై ప్రభావం అయితే చూపిస్తుంది.
ఇదిలా వుంటే జనతా గ్యారేజ్ షూట్ ఇంకా రెండు రోజులువుంది. అంటే 22 వరకు. అక్కడికి విడుదల తేదీ 10 రోజుల దూరంలో వుంటుంది. ఆ టైమ్ లోనే మిగిలిన పనులు, ఓవర్ సీస్ డిస్క్ లు ఇలా అన్ని పనులు చక్క బెట్టాలి. అందుకే ఇండస్ట్రీలో 2నే గ్యారేజ్ విడుదల వుంటుందా? 9కి వెళ్తుందా? అన్న ప్రశ్నలు అక్కడక్కడ వినిపిస్తున్నాయి. 99శాతం వాయిదా అన్నది ఉండదనే అనుకోవాలి. ఎందుకంటే రెండో వాయిదా అంటూ వుంటే అది సినిమాను వీక్ చేయడానికి అవకాశం వుంది కాబట్టి.
మొత్తం మీద ఇక్కడి నుంచి మరో పది రోజులు జనతా గ్యారేజ్ డిస్కషన్ పాయింట్ ఆఫ్ ది ఇండస్ట్రీగా వుంటుంది.