పివి సింధు ఈ దేశం తరపున ఒలంపిక్స్ లో సాధించిన విజయాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. ఆమె ను ఆ రేంజ్ కు చేర్చడానికి ఆమె తల్లితండ్రులు పడ్డ శ్రమ, కోచ్ గోపీచంద్ చాకచక్యం కూడా అద్భుతాలే. అన్ని విధాలా అందరూ ప్రశంసాపాత్రులే. అయితే విజయం సాధించిన సింధుపై కురిపిస్తున్న వరాలు ఆమె ఆటను బతికిస్తాయా? లేక చంపేస్తాయా అన్నదే అనుమానం. అదే విధంగా ఇలా ప్రోత్సాహకాలు భయంకరంగా ప్రకటించడం అన్నది రాష్ట్రంలో క్రీడలను బతికించడానికి పనికి వస్తాయా అన్నది కూడా అనుమానమే.
గతంలో ఇలా ఉవ్వెత్తున కెరటంలా ఎగిసిన వాళ్లు, ఆ వెంటనే ఫ్రభుత్వాల నుంచి నజరానాలు అందుకున్నవారు, ఇప్పుడు ఏ స్టేజ్ లో ఎలా వున్నారో ఒక్కసారి గుర్తుచేసుకుంటే ఈ అనుమానం కలుగుతుంది.
సింధుకు ఎపి గవర్నమెంట్ గ్రేడ్ వన్ ఉద్యోగం, ఇంటి స్థలం, మూడు కోట్లు ఇచ్చింది. దానికి బదులుగా ఓ అకాడమీ నిర్మించి, దాని చీఫ్ కోచ్ గా నెలకు పదిలక్షల జీతంతో ఉద్యోగం ఇచ్చి, అర్హులకు ఉచిత కోచింగ్ ఇచ్చే అవకాశం కల్పించి వుంటే…? దీనివల్ల ఆమెకు పదిలక్షల జీతంతో ఉద్యోగం వస్తుంది. రాష్ట్రంలో మాంచి కోచింగ్ సెంటర్ ప్లస్ కోచ్ ప్రభుత్వం తరపున ఏర్పాటయ్యే అవకాశం వుంటుంది కదా? గ్రేడ్ వన్ ఉద్యోగం ఇస్తే, ఆట అటకెక్కిపోదా? కనీసం కోచ్ గా కూడా టైమ్ దొరుకుతుందా?
అయిదేళ్లకో, పదేళ్లకో ఇలా క్రీడాకారులకు ఇచ్చేబదులు, జిల్లాకో క్రీడకు అకాడమీలు ఏర్పాటు చేయచ్చుకదా? నిపుణులైన క్రీడాకారులను కోచ్ లుగా ప్రభుత్వ ఉద్యోగాల్లో నియమించవచ్చు కదా? ఇలా అందరూ కోట్లకు కోట్లు ఒక్కరికే కట్టబెట్టేబదులు, అడుగున వున్న మాణిక్యాలను వెలికి తీసే పనికి ఆ డబ్బు వాడవచ్చు కదా? ఎకరాలకు ఎకరాల భూములు, కోట్ల కొద్దీ డబ్బు, విలాసవంతమైన కార్లు, ఇవన్నీ కలిసి క్రీడాకారిణిని మరింత ప్రోత్సహిస్తాయా? బద్దకం అలవాటు చేస్తాయా? గతంలో కొందరు క్రీడాకారుల విషయంలో జరిగింది ఇదే కదా?