రెజ్లర్ సాక్షి మాలిక్ కాంస్య పతకాన్ని సాధించింది.. షట్లర్ సింధు రజత పతకాన్ని సాధించింది. ఓసోస్, రెండు పతకాలేనా.? అని వెటకారం చెయ్యడం చాలా సులువు. ఆటగాళ్ళ వరకూ అత్యద్భుత ప్రతిభ ఇది. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. ఇంట్లో కూర్చుని కబుర్లు చెప్పేవాళ్ళకీ, సోషల్ మీడియాలో పనిలేక కామెంట్లు పెట్టేవారికీ చాలా చిన్న విషయమే కావొచ్చుగాక. మీడియా మైక్ దొరికితే నోటకొచ్చినట్లు మాట్లాడే సోకాల్డ్ మేధావుల గురించి మాట్లాడుకోవడం అనవసరం.
ప్రముఖ రచయిత.. అన్న గుర్తింపు ఆమె ఇప్పుడు కోల్పోయారు. జస్ట్ ఆమె బ్లాంక్ అంతే. శోభా డే.. ప్రముఖ రచయితగా తాను సంపాదించుకున్న అనుభవాన్నంతా చెత్తబుట్టలో పడేసుకున్నారు. కాదు కాదు, ఒక్క మాటతో తగలబెట్టేసుకున్నారు. రియో ఒలింపిక్స్‌కి మనవాళ్ళను పంపడం దండగ.. మహిళా ఆటగాళ్ళయితే సెల్ఫీలు తీసుకుని, ఎంజాయ్ చేసి, ఉత్త చేతుల్తో తిరిగొస్తారు.. అన్న ఆమె కామెంట్లకు టపీ టపీ మని రెండు చెంపదెబ్బలు పడ్డాయి.
ఒకటి సాక్షి మాలిక్ కొట్టిన చెంపదెబ్బ అయితే, ఇంకోటి సింధు కొట్టిన చెంపదెబ్బ. కాంస్యం దెబ్బతోనే ఓ పక్క వాచిపోయింది.. రజతం దెబ్బకి, బహుశా లోపల పళ్ళు కూడా ఊడిపోయి వుండాలి. శోభా డే గురించి ఇకపై ఎక్కడా మాట్లాడుకోవడం అనవసరం. ఎందుకంటే, ఆమె దేశాన్ని అవమానించింది. దేశ క్రీడాకారుల్ని చిన్నచూపు చూసింది.
అమితాబ్ బచ్చన్ లాంటి వ్యక్తికే కోపం తెప్పించాయి శోభా డే చేసిన వ్యాఖ్యలు. ఇప్పుడామె తన ముక్కుని నేలకి రాసి క్షమాపణ అడుగుతుందో, లేదంటే సాక్షి మాలిక్‌తోపాటు సింధు కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెబుతుందో వేచి చూడాల్సిందే.