నయీమ్ నరరూప రాక్షసుడు – ఓ నిర్మాత

నయీమ్..మన రాజకీయ, అధికార వ్యవస్థ తయారుచేసిన ఓ వికృత స్వరూపం. దాని బారిన పడిన బాధితులు ఎందరో..ఎందరి కథలో ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. కొందరు బయటకు చెప్పుకుని, మరి కొందరు చెప్పుకోలేక. చీమా చీమా…

నయీమ్..మన రాజకీయ, అధికార వ్యవస్థ తయారుచేసిన ఓ వికృత స్వరూపం. దాని బారిన పడిన బాధితులు ఎందరో..ఎందరి కథలో ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. కొందరు బయటకు చెప్పుకుని, మరి కొందరు చెప్పుకోలేక. చీమా చీమా ఎందుకు కుట్టావ్ అంటే నా బంగారు పుట్టలో వేలు పెట్టావ్ కదా అని బదులు ఇచ్చినట్లు, అధికారానికి సన్నిహితంగా వున్న కీలక వ్యక్తులను 800 కోట్ల మేరకు డిమాండ్ చేయడం వల్ల నయీం అనే వాడి పీడ హైదరాబాద్ బడా బాబులకు తప్పింది. నయీం బాధితుల్లో ఒకరు అని వినిపిస్తున్న ఓ నిర్మాతను ‘గ్రేట్ ఆంధ్ర’ ప్రశ్నించింది.  ముందు ఈ విషయం డిస్కస్ చేయడానికి అంగీకరించని ఆయన, తరువాత కాసిన్ని వివరాలు అందించారు..ఆ వివరాలు ఆయన మాటల్లోనే..

‘’నేను పెద్ద హీరోలతో వరుసగా సినిమాలు చేస్తున్న సమయం అది. విదేశాల్లో ఎక్కువగా షూట్ చేసిన ఓ సినిమా విడుదల తరువాత నయీమ్ నుంచి కబురు వచ్చింది. హైదరాబాద్ సమీపంలోని ఊరిలో వున్న నా కుటుంబ ఆస్తి తన పేర మార్చమని. దాని విలువ వంద కోట్ల వరకు వుంటుంది. ఓసారి ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర కలవమని కబురు వచ్చింది. వెళ్లాను. ’’ నయీమ్ బైక్ పై వచ్చాడు. కేరళ వెళ్తున్నానని, వైద్యం చేయించుకు వస్తానని, వచ్చేసరికి నిర్ణయం తీసుకోవాలని చెప్పాడు.

నీ పిల్లలు ఫలానా స్కూల్లో చదువుతున్నారు. మీ అన్న నిత్యం ఫలానా నెంబర్, ఫలానా మోడల్ కారులో, ఫలానా చోటికి  వెళ్తారు. మీ అమ్మ నాన్న ను నీ కళ్ల ముందే చంపేస్తా..ఆలోచించుకో ’’ అన్నాడు. ఎంతో మందిని సంప్రదించాను. ఎవరి దగ్గర నుంచి ఏ సహాయం అందలేదు. నయీమ్ విషయంలో తాము అసక్తులమని పెద్ద పెద్ద  వాళ్లు చేతులు ఎత్తేసారు. ఆఖరికి ఓ మీడియా పెద్దాయిన సాయం చేసారు. ఏం సాయం చేసారు. ఎలా చేసారు అన్నది చెప్పలేను. కానీ జీవితాంతం ఆయన రుణం తీర్చుకోలేను. దఫదఫాలుగా ఎనిమిదిన్నర కోట్లు నయీం కు అందచేసాను. 

ఆ దశలోనే నా సినిమా ఒకటి గోవాలో షూటింగ్ జరుగుతోంది. ఒక్కసారి కూడా  గోవా వెళ్లలేకపోయాను. కేవలం నయీం కు గోవాలో వున్న నెట్ వర్క్, పట్టు నాకు తెలుసు. అందుకే బతుకు భయంతో గోవాకు ఒక్క రోజు కూడా వెళ్లలేదు. ఈ విషయాలు మా అమ్మనాన్నకు, భార్యకు కూడా ఆ రోజు చెప్పలేదు. నిద్రలేని రాత్రుళ్లు గడిపాను. డబ్బు పోతుందని కాదు, ఎవర్ని చంపేస్తాడో అన్న భయం.  

నయీం చచ్చిపోయేవరకు కూడా ఆ భయం వెంటాడింది. మళ్లీ ఎప్పుడు ఫోన్ చేస్తాడో? మళ్లీ డబ్బు అడుగుతాడో, ఎలా ఇవ్వాలో? అన్న భయం. ఇప్పుడు బాహాటంగా చెబుతున్నా..కేసిఆర్ కు చేతులెత్తి దండం పెడతాను. జీవితాంతం కేసిఆర్ కే మొక్కుతాను. ఏ ముఖ్యమంత్రి చేయని ధైర్యం చేసాడు ఆయన…ఇక ప్రశాంతంగా నిద్రపోయే అవకాశం నాకు కేసిఆర్ వల్లే కలిగింది….’’

ఇదీ ఆ నిర్మాత గోడు. ఇలాంటి వాళ్లు హైదరాబాద్ లో మరెంతమంది వున్నారో? వారి వ్యధలేమిటో?