సినిమా విడుదల దగ్గరకు వచ్చింది అంటే దానికి ప్లస్ అయ్యే ఏ అంశాన్ని కూడా వదులుకోకూడదు. ఈ విషయంలో మన హీరోల కన్నాబాలీవుడ్ హీరోలు ముందు వుంటారు. పబ్లిక్ లోకి దూసుకుపోతారు. కానీ మన హీరోలు పార్క్ హయాత్ లో అందమైన ఏంకర్లతో చిట్ చాట్ ల రికార్డు చేయించుకుని మీడియాకు పంపిణీ చేస్తారు.
జనతా గ్యారేజ్ సినిమా డేట్ దగ్గరకు వస్తోంది. ఇలాంటి టైమ్ లో కృష్ణ పుష్కరాలు వచ్చాయి. పైగా ప్రభుత్వం తరపును మంత్రి వచ్చి మరీ ఎన్టీఆర్ ను పిలిచారు. అదీ కాక తెలుగుదేశం పార్టీ, దాని కీలక బాధ్యులు చంద్రబాబు, బాలయ్య వంటి వారితో న్యూట్రల్ గా వుండాలని ఎన్టీఆర్ తెర వెనుక ప్రయత్నిస్తున్నారన్న వార్తలు కూడా వున్నాయి.
ఫ్యాన్స్ వస్తే, నందమూరి హీరోలు అందరూ ఒకటే అని, ఎటువంటి విబేధాలు లేవని, ఎన్టీఆర్ చెబుతూ వస్తున్నారన్న వార్తలు వున్నాయి. పైగా చంద్రబాబుతో విబేధం ఎన్టీఆర్ కెరీర్ కు అంత మంచిది కాదన్న సలహాలు కూడా అక్కడక్కడ వినిపిస్తుంటాయి. అలాంటపుడు కృష్ణ పుష్కరాలు అన్నది ఓ మాంచి అవకాశం. ఎన్టీఆర్ ను బాబుగారే మంత్రిని పంపించి మరీ ఆహ్వానించారు. ఈ ఆహ్వానాన్ని మన్నించి కృష్ణ స్నానానికి వెళ్తున్నా అంటే వచ్చే మైలేజే వేరు.
అందునా కృష్ణా జిల్లా అంటే నందమూరి వారి స్వంత జిల్లా. అక్కడకు వెళ్లి స్నానం చేసి, మీడియాతో గ్యారేజ్ ముచ్చట్లు పనిలో పనిగా పంచుకుని వస్తే, ఆ పబ్లిసిటీనే వేరప్పా. మరి ఇలాంటి చాన్స్ ఎన్టీఆర్ ఎందుకు వదులుకున్నట్లో? ఇలా చేయడం ద్వారా బాబు అండ్ కో కు మరింత దూరం అవుతారు కానీ దగ్గరయితే కారు కదా?