షార్ట్ ఫిలిమ్ మేకర్స్ పై వల

మన సినిమా జనాలు భలే తెలివైన వారు. ఎక్కడ కాస్త డబ్బులు చేసుకునే అవకాశం వుంది, ఎవరి దగ్గర కాస్త టాలెంట్ వుందో, అక్కడ వలేసి పట్టుకుని బండి లాగించేయడం అంటే భలేగా ముందుంటారు.…

మన సినిమా జనాలు భలే తెలివైన వారు. ఎక్కడ కాస్త డబ్బులు చేసుకునే అవకాశం వుంది, ఎవరి దగ్గర కాస్త టాలెంట్ వుందో, అక్కడ వలేసి పట్టుకుని బండి లాగించేయడం అంటే భలేగా ముందుంటారు. అప్ కమింగ్ రచయితలను, డైరక్టర్లను తమ దగ్గర ఘోస్ట్ లు గా పెట్టుకుని చాలా కాలం బండి లాగించేస్తారు. తీరా ఆ ఘోస్ట్ లు కాస్తా వెళ్లిపోయాక చతికిల పడిపోతారు. జనం భలే ఆశ్చర్యపోతారు. వీళ్లేనా ఇప్పటి దాకా మంచి సినిమాలు అందించింది. ఇప్పుడేమయింది వీరికి అని. 

అసలు రహస్యం ఘోస్ట్ లే. పోసాని, ఈవీవీ సత్యనారాయణ, ఎఆర్ రెహమాన్, కోడి రామకృష్ణ, అనూప్ రూబెన్స్, త్రివిక్రమ్ శ్రీనివాస్, ఇలా జాబితా రాసుకుంటూ పోతే సినిమాలోని చాలా క్రాఫ్ట్ ల్లో తమ గురువులకు విజయాలను అందించి, బయటకు వచ్చిన వారు ఎందరి పేర్లో వుంటాయి. వీళ్లు బయటకు వచ్చిన తరువాత సదరు గురువులు ఎందుకు హిట్ లు అందించలేకపోయారో అన్నది అప్పుడు అర్ధం అవుతుంది.

అయితే ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ వచ్చాక, రచయితలు, దర్శకుల కోసం వెదుకులాట మొదలయ్యాక ఘోస్ట్ లు ఎక్కువ కాలం వుండడం లేదు. ఒకటి రెండు సినిమాలకే గురువుల దగ్గర నుంచి జెండా ఎత్తేస్తున్నారు.

ఇదిలా వుంటే ఇండస్ట్రీ లో ఇంకో సమస్య కూడా వుంది. ప్రతిభ వున్న డైరక్టర్లు..సృజన వున్న డైరక్టర్లు. ప్రతిభ సినిమా మేకింగ్ వరకు ఒకె. కానీ సృజన వుంటే కొత్త దారులు తెరుస్తుంది. కొత్త సినిమాలు, కొత్త పుంతలు తొక్కే సబ్జెక్ట్ లు వస్తాయి. కానీ చాలా మంది సీనియర్లలో ప్రతిభ వుంది కానీ సృజన తక్కువ. సృజన వున్న దర్శకులు టాలీవుడ్ లో చాలా అంటే చాల తక్కువ. అయితే షార్ట్ ఫిల్మ్ లు రావడం ప్రారంభించాక ఈ సృజన అన్నది స్పష్టంగా కనిపించడం ప్రారంభించింది. ఎప్పుడూ ఒకే ఫార్మాట్ లో ఆలోచించడం అలవాటైపోయిన టాలీవుడ్ డైరక్టర్ల కళ్ల ముందు..ఓహో…సృజన అంటే ఇలా వుంటుందా అని చూపిస్తోంది.

రన్ రాజా రన్ దగ్గర నుంచి పెళ్లి చూపులు వరకు అనేక షార్ట్ ఫిలిమ్ మేకర్ల మెయిన్ స్ట్రీమ్ సినిమాలు దర్శకులకు మార్గ దర్శకం చేస్తున్నాయి. వీళ్ల దగ్గర నిర్మాతలున్నారు, పేరు వుంది. బయ్యర్లు వున్నారు. హీరోలు వున్నారు. కానీ వీళ్లకు కథలు కావాలి. కొత్త దనం కావాలి. సృజన కావాలి. పాపం, షార్ట్ ఫిలిమ్ మేకర్ల దగ్గర సృజన కుప్పలు తెప్పలుగా వుంది కానీ హీరోలతో, నిర్మాతలతో అప్రోచ్ లేదు. అందుకే ఇప్పుడు చాలా మంది దర్శకులకు అమాంతం షార్ట్ ఫిలిం మేకర్లపై అపారమైన ప్రేమ పుట్టుకు వచ్చేస్తోంది. షార్ట్ ఫిలిమ్ లను ఉద్దరించేందుకు, షార్ట్ ఫిలిం మేకర్లను ఆదరించేందుకు ముందుకు వచ్చేస్తున్నారు.

80 లక్షలతో మాంచి సినిమా తీసి చూపించిన పెళ్లిచూపులు సినిమా డైరక్టర్ లాంటి వాళ్లను పట్టుకోగలిగితే, తమ సర్కిల్ ఉపయోగించి, తాము సినిమా చేసేయచ్చు. లాభాలు చేసుకోవచ్చు. తమ హవా కొనసాగించుకోవచ్చు. అందుకు పెట్టుకున్న షార్ట్ కట్ షార్ట్ ఫిలిం ఉద్దరణ.

అయితే ఒక్కరిని ఇధ్దరిని పట్టుకుంటే సరిపోతుందా? సరిపోదు. ఎందుకంటే షార్ట్ ఫిలిం మేకర్లు మాత్రం ఈ కొత్త గురువుల దగ్గర ఎన్నాళ్లుంటారు. ఒక్క సినిమాతో వాళ్లకీ సర్కిల్ వస్తుంది జెండా ఎత్తేస్తారు. అందుకనే పోటీలు, కాన్సెప్ట్ లు పెట్టి ఓ అరడజని మందిని పట్టుకుంటే ఓ అరడజను ప్రాజెక్టులు పట్టుకుంటే కొన్నాళ్లు బండి లాగించేయచ్చు. అదీ పాయింట్.