ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకున్నా ఒలింపిక్స్‌లో పాల్గొనే కనీస అర్హత భారత క్రీడాకారులకి వుందన్నది అనుమానమే. అత్యంత ఆవేదనా భరితమైన విషయమిది. క్రికెట్ పోటీలు జరుగుతున్నాయంటే చాలు, అబ్బో.. పాలకులు చేసే హడావిడి అంతా ఇంతాకాదు. క్రికెట్ కోసం ఎంత ఖర్చు చేయడానికైనాసరే పాలకులు వెనుకాడరు. అత్యాధునిక క్రికెట్ స్టేడియంలు నిర్మించేందుకు అత్యుత్సాహం చూపుతారు. కారణం, క్రికెట్ ద్వారా వచ్చే ఆదాయమే.
క్రికెట్‌కి భారతదేశంలో ఈ స్థాయి ప్రాధాన్యత దక్కడం అభినందనీయమే. కానీ, అదే సమయంలో మిగతా క్రీడల మాటేమిటి.? రియో ఒలింపిక్స్‌లో ఇప్పటిదాకా అన్ని విభాగాల్లోనూ భారత క్రీడాకారులు చేతులెత్తేశారు. ముందు ముందు పరిస్థితులు ఎలా వుంటాయో ఊహించలేం. ఎవరన్నా ఏదో ఒక మెడల్ తీసుకొస్తే అది అద్భుతమే. రావాలనే ఆశిద్దాం, కానీ అది అత్యాశే అవుతుందన్న పరిస్థితులు కన్పించడాన్ని ఎలా తప్పు పట్టగలం.?
స్విమ్మింగ్‌లో మనమెక్కడ వున్నాం.? జిమ్నాస్టిక్స్‌లో మన పరిస్థితేంటి.? పరుగుల పోటీలో మన ఆటగాళ్ళు ఎక్కడ.? ఇలా చెప్పుకుంటూ పోతే, చాలా చాలా విభాగాల్లో మన క్రీడాకారులు పోటీకి సైతం నిలబడలేని పరిస్థితి. మన దేశంలో ఓ రాష్ట్రం కన్నా చిన్న దేశాలు రియో ఒలింపిక్స్‌లో అద్భుతాలు సృష్టించేస్తున్నాయి. అంతెందుకు, ఓ లోక్‌సభ నియోజకవర్గంలోని జనాభాతో కూడా పోటీ పడలేని దేశాలే అద్భుతాలు సృష్టించేస్తోంటే 125 కోట్ల భారతీయుల్లో, ఒలింపిక్ మెడల్స్ సాధించే ఆటగాళ్ళు లేకపోవడం శోచనీయమా.? సిగ్గుచేటా.?
ఇదివరకటిలా కాదు.. ఇప్పుడు పాలకుల కక్కుర్తి ప్రపంచానికి పరిచయమవుతోంది. ఒలింపిక్స్‌లో మెడల్స్ తెచ్చిన ఆటగాళ్ళే, బతుకుతెరువు కోసం కూలీల్లా పనిచేస్తున్నారు. వీధుల్లో హాకర్స్‌లా జీవితాన్ని నెట్టుకొచ్చేస్తున్నారు. ఓ మల్లయోధుడు, ఓ బాక్సర్.. ఇలా ఒలింపిక్స్‌కి వెళ్ళిన ఆటగాళ్ళు.. క్రీడలపై తమకున్న మక్కువతో తమ చుట్టుపక్కల వుండే పిల్లలకి ఆయా ఆటల్లో శిక్షణ ఇస్తూ, సంతృప్తి చెందుతున్నారు. చెప్పుకుంటూ పోతే ఇలాంటి కథలకు అంతే లేదు. ఇవి కథలు కాదు, వ్యధలు.
ఏ ఆట అయినా గెలుపోటములు సహజం. వెళ్ళారు కాబట్టి, మెడల్స్ కొట్టేయాలని రూలేమీ లేదు. కానీ, ఆటగాళ్ళను తయారు చేయడంలో మన పాలకుల చిత్తశుద్ధి ఏంటన్నదే ఇక్కడ ప్రశ్న. ఏళ్ళు గడుస్తున్నాయి.. ఒలింపిక్స్ వస్తున్నాయి, వెళుతున్నాయి.. మళ్ళీ వస్తున్నాయి.. ఏం లాభం.? సరైన ఆటగాళ్ళను తయారుచేయడంలో విఫలమవుతున్నాం. అత్యాధునిక స్టేడియంలు, రన్నింగ్ ట్రాక్‌లు తయారు చేసి, వాటిల్లో ఈవెంట్స్ నిర్వహించుకుంటున్నాం.
క్రీడారంగానికి ప్రోత్సాహకాలు అందించడానికి ఆర్థిక వనరులకు లోటేమీ లేదు. కానీ, ఇక్కడ లోపం వున్నదల్లా చిత్తశుద్ధి విషయంలోనే. కోట్లు గుమ్మరిస్తారు, ఆ కోట్లు బొక్కేస్తారు. ఇలాగైతే, క్రీడా ఆణిముత్యాలు భారతదేశం నుంచి ఎప్పటికి వెలుగులోకి వచ్చేను.? స్వచ్ఛంద సంస్థలు, సామాన్యులు చందాలేసుకుని ఆటగాళ్ళను ఇకపై తయారు చేయాలేమో.! అప్పుడన్నా పాలకులకు బుద్దొస్తుందా.?