చిన్న సినిమాల జనాలు తమ సినిమా ప్రమోషన్ కోసం దాసరి ఇంటికి వెళ్లి ఓ ఫొటో దిగడం లేదా తమ ఫంక్షన్ కు ఆయన్ను పిలవడం కామన్. ఆయన ఆ చిన్న సినిమాను ఓ రేంజ్ లో ఎత్తుకుంటారు. మంచిదే. చిన్న సినిమాను ప్రమోట్ చేయడం అవసరమే. కానీ ఇలాంటి సందర్భాల్లో దాసరి మాటలు భలేగా వుంటాయి. తాను చిన్నప్పుడే ఇలాంటి సినిమాలు చేసానని అంటుంటారు. ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలని అంటారు. వీటికి అందరూ సహకరించాలి అంటారు.
అన్నీ బాగానే వుంటాయి. కానీ, ఓ నిర్మాతగా, బయ్యరుగా, డిస్ట్రిబ్యూటర్ గా ఇలాంటి సినిమాలు ఆయన ఏడాదికి ఒకటన్నా నిర్మించవచ్చుగా? యంగ్ టాలెంట్ ను ఆయన కేవలం నిర్మాతగా ప్రోత్సహించవచ్చుగా. పవన్ కళ్యాణ్ లాంటి బడా స్టార్ డేట్ల కోసం వేచి వుండే బదులు చిన్న సినిమాలు నిర్మించవచ్చుగా. పవన్ తో సినిమా చేస్తా అని అందరిలాగే దాసరి కూడా అనడం కన్నా, ఇలాంటి యంగ్ టీమ్ లతో చిన్న సినిమాలు నిర్మించవచ్చు కదా?
పవన్ లాంటి హీరోతో సినిమా బదులు, పెళ్లి చూపులు లాంటి సినిమాలు పాతిక నిర్మించవచ్చు. అది కదా అసలైన ప్రోత్సాహం. మాటలు కన్నా చేతలు మిన్న కదా? పైగా చిన్న సినిమాలు బాగా లాభాలు చేసుకుంటున్నాయి కూడా. పవన్ తో భారీ సినిమా అంటే గాల్లోదీపం కూడా. మరి దాసరి ఆలోచిస్తారా? ఏమో?