భారత్, పాకిస్తాన్ల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. స్వాతంత్య్ర దినోత్సవానికి ఒక రోజు ముందు పాకిస్తాన్, సరిహద్దుల్లో రెచ్చిపోయింది. దాంతో, యుద్ధం తప్పదా.? అన్న అనుమానాలు వెల్లువెత్తాయి. అయితే, ఇది పాకిస్తాన్‌కి అలవాటే. భారత్‌కి కూడా అలవాటైపోయిన వ్యవహారమే. భారత్‌ని రెచ్చగొట్టడమే పాకిస్తాన్ పని. సంయమనం పాటించడం భారత్‌కి ఆనవాయితీగా మారిపోయింది. యుద్ధం జరిగితే ఏం జరుగుతుందో భారత్‌కి మాత్రమే తెలుసు. ఆ యుద్ధ నష్టాల్ని ముందుగా అంచనా వేసే పరిస్థితుల్లో పాకిస్తాన్ లేదు.
కాశ్మీర్ గురించి పాకిస్తాన్ ఈ మధ్య పదే పదే మాట్లాడుతోంది. దాంతో, భారత్ కూడా స్వరం పెంచక తప్పలేదు. కాశ్మీర్ స్వాతంత్య్రం కోసం సహకరిస్తామంటూ పాకిస్తాన్ ఈ మధ్య చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారానికే కారణమయ్యాయి. కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ వైఖరి నేపథ్యంలో, ప్రధాని నరేంద్రమోడీ అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. పాకిస్తాన్‌కి ఈ సందర్భంగా ఘాటైన హెచ్చరిక కూడా పంపించారు.
ఇన్నేళ్ళలో ఏనాడూ, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) మనదేనని మన దేశంలో ఎవరూ గట్టిగా నినదించిన పాపాన పోలేదు. ఎప్పటికైనా బంగ్లాదేశ్‌లా పీఓకే కూడా ఓ కొత్త దేశంగా మారుతుందనే భారతదేశంలో అంతా అనుకున్నారు. కానీ, పరిస్థితులు మారుతున్నాయి. పీఓకేలో అల్లర్లు పెరిగాయి.. అవి కాశ్మీర్లో ప్రస్తుతం తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులకు వంద రెట్లు తీవ్రంగా వున్నాయి. అంతేనా, పాకిస్తాన్‌లోనూ పీఓకే ప్రకంపనలు కన్పిస్తున్నాయి.
'మేం భారత్‌లో కలుస్తాం..' అంటూ పీఓకే తరఫున పాకిస్తాన్లో నినాదాలు హోరెత్తుతోంటే, పాకిస్తాన్‌కి ఏం చేయాలో తెలియని పరిస్థితి. పీఓకేలోకి అధికారికంగా పాకిస్తాన్ అడుగు పెట్టే పరిస్థితి లేదు. ఆ పని చేస్తే, అంతర్జాతీయ సమాజం దృష్టిలో అడ్డంగా బుక్కయిపోతుంది. అందుకే, కాశ్మీర్లో అలజడులు సృష్టిస్తోంది. ఇది జగమెరిగిన సత్యం. కాశ్మీర్ రావణ కాష్టంలా రగులుతూనే వున్నా, ఇదివరకటితో పోల్చితే పరిస్థితులు దయనీయంగా తయారయ్యాయిప్పుడు.
దాంతో, 'సహనాన్ని చేతకానితనంగా తీసుకోవద్దు..' అని ఘాటైన హెచ్చరికలు పాకిస్తాన్‌కి పంపిన భారత్, ఏ క్షణాన అయినాసరే, పాకిస్తాన్‌కి 'బుద్ధి చెప్పక తప్పదు' అఏ నిర్ణయానికి వచ్చేయొచ్చు. అదే జరిగితే, పాకిస్తాన్‌తో యుద్ధం తప్పకపోవచ్చు. నరేంద్రమోడీ ప్రకటన తర్వాత, కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ నేతల నుంచి 'పీవోకే మనదే..' అన్న మాట ఇంకా గట్టిగా విన్పిస్తోంది. యుద్ధం వినాశనాన్నే మిగుల్చుతుంది. ఇది కాదనలేని వాస్తవం. కానీ, నిత్యం కాశ్మీర్‌ని రావణకాష్టంలా పాకిస్తాన్ తగలెడ్తోంటే, చూస్తూ ఊరుకోవడం కూడా చేతకానితనమే అవుతుంది. సహనానికీ ఓ హద్దు వుంటుంది మరి.