ఈ డబ్బులన్నా జనానికి పంచుతారా.?

వంద కోట్లు.. ఐదొందల కోట్లు.. వెయ్యి కోట్లు.. రెండు వేల కోట్లు.. ఐదు వేల కోట్లు.. పది వేల కోట్లు.. ఇలా ఫిగర్‌ రోజు రోజుకీ పెరిగిపోతోంది. వాస్తవమేంటో ఇంతవరకు అధికారికంగా వెల్లడి కాలేదు.…

వంద కోట్లు.. ఐదొందల కోట్లు.. వెయ్యి కోట్లు.. రెండు వేల కోట్లు.. ఐదు వేల కోట్లు.. పది వేల కోట్లు.. ఇలా ఫిగర్‌ రోజు రోజుకీ పెరిగిపోతోంది. వాస్తవమేంటో ఇంతవరకు అధికారికంగా వెల్లడి కాలేదు. గ్యాంగ్‌స్టర్‌ నయీమ్‌ ఎన్‌కౌంటర్‌ తర్వాత, అతని ఆస్తుల బాగోతం వెలుగు చూస్తున్న మాట వాస్తవం. అయితే, అదెంత.? అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే. 

గజాలు కాదు, ఎకరాలు.. ఇదీ గ్యాంగ్‌స్టర్‌ నయీమ్‌ భూ దందా. ఇంతేనా, కోట్లాది రూపాయల సొమ్ములు 'నోట్ల కట్టల రూపంలో' దొరుకుతున్నాయి. ఇప్పటికే 'సిట్‌' ఏర్పాటయ్యింది. అవసరమైతే 'సిట్‌' బృందంలోకి అదనంగా కొందరు అధికారుల్ని జాయిన్‌ చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. కలుగులోంచి ఎలకలు బయటకొస్తున్నాయి. కొందరు అరెస్టవుతున్నారు, ఇంకొందర్ని పోలీసులు పట్టుకుంటున్నారు. వెరసి, నయీమ్‌ బాగోతం ప్రకంపనలే సృష్టిస్తోందన్నమాట. 

ఇంతకీ, నయీమ్‌ నుంచి స్వాధీనం చేసుకున్న డబ్బు, ఇతర ఆస్తుల్ని ఏం చేస్తారు.? ఇదిప్పుడు సాధారణ ప్రజానీకం మెదళ్ళను తొలిచేస్తున్న ప్రశ్న. ఇది జనాన్ని బెదిరించి కూడగొట్టిన ఆస్తులు, సొమ్ముల వ్యవహారం. దాంతో, మామూలుగా అయితే బాధితులకే ఆ సొమ్ములు లేదా ఆస్తులు చెల్లించాల్సి వుంటుంది. కానీ, ప్రభుత్వం ఆ పని చేస్తుందా.? డౌటే.! 

అన్నట్టు, రాజకీయ నాయకులకు సంబంధించి అనేక అవినీతి బాగోతాలు వెలుగు చూస్తుంటాయి. కానీ, ఆ కేసులు అలాగే నీరుగారిపోతుంటాయి. లక్ష కోట్ల ఆరోపణలు కాస్తా వేల కోట్లకీ, ఆ తర్వాత వందల కోట్లకీ పరిమితమైపోయి, కేసులు క్లోజ్‌ అయిపోవడం మామూలే కదా. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కేసులో ఏం జరిగింది.? వైఎస్‌ జగన్‌ విషయంలో ఏం జరుగుతోంది. జయలలిత అయితే అక్రమాస్తుల కేసులో నిర్దోషిగా తేలారు. జగన్‌ కేసు విచారణ ఇంకా ఇంకా కొనసాగుతోంది గనుక, ఇప్పుడే మాట్లాడటం కాస్త ఇబ్బందికరమే. ఈ కేసులో ఏం జరుగుతుందన్నది ప్రస్తుతానికి మిలియన్‌ డాలర్ల ప్రశ్నే. 

కానీ, ఎక్కడా రాజకీయ నాయకుల అవినీతిని బట్టబయలు చేసి, వారు బొక్కేసిన మొత్తాన్ని కక్కించిన దాఖలాలు కన్పించవు. టూజీ స్పెక్ట్రమ్‌ కేసులో లక్షన్నర కోట్ల కుంభకోణం జరిగిందన్నారు. ఏవీ ఆ లక్షన్నర కోట్లు.? అంటే సమాధానం దొరకదు. రాజకీయ నాయకులతో ముడిపడినదే గ్యాంగ్‌స్టర్‌ నయీమ్‌ వ్యవహారం. సో, ఇక్కడా పైసలు లెక్క తేలడం అనుమానమే. కాదంటారా.?