బ్రేకింగ్ న్యూస్. ఏపీ మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణను ఏపీ సీఐడీ పోలీసులు కాసేపటి క్రితం అరెస్ట్ చేశారు.
ఇటీవల టెన్త్ ప్రశ్నపత్రాల లీకేజీలో నారాయణ విద్యాసంస్థల పాత్ర ఉన్నట్టు పోలీసుల విచారణలో నిర్ధారణ అయ్యింది. దీనికి సంబంధించి నారాయణ విద్యాసంస్థలో పని చేసే వైస్ ప్రిన్సిపాల్‌ను కూడా అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
ఈ కేసులో మరో సంచలనం చోటు చేసుకుంది. సదరు నారాయణ విద్యాసంస్థల అధిపతి నారాయణ హైదరాబాద్‌లోని కొండాపురంలో తన ఇంట్లో వుండగా ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనం సృష్టిస్తోంది.
గత ప్రభుత్వ హయాంలో నారాయణ మున్సిపల్‌శాఖ మంత్రిగా క్రియాశీలక పాత్ర పోషించారు. నారాయణ నాయకత్వంలో చంద్రబాబు రాజధాని ఎంపిక కమిటీని నియమించిన సంగతి తెలిసిందే.
2019 ఎన్నికల్లో నారాయణ నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీ చేశారు. వైసీపీ అభ్యర్థి అనిల్‌కుమార్ యాదవ్ చేతిలో ఆయన ఓటమిపాలయ్యారు.
ఏపీలో అధికార మార్పిడి నేపథ్యంలో నారాయణ రాజకీయాలకు దూరంగా వుంటున్నారు. అయితే టెన్త్ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం నారాయణకు చుట్టుకుంది. మాజీ మంత్రి అరెస్ట్‌పై టీడీపీ ఏ విధంగా స్పందిస్తుందో మరి!