భాష మన ఇష్టం. పుట్టడంతోనే మాతృభాష నేర్చుకుంటాం. మొదట నేర్పించేది అమ్మే. తండ్రి భాష వుండదు. అన్నిట్లో మేల్ డామినేషన్ అంటారు కానీ, వాళ్లకు అసలు భాషే వుండదు.
ఇప్పుడు ఈ భాష గొడవ ఎందుకంటే, అప్పుడప్పుడు కేంద్రంలో వున్న కొంత మంది హిందీని మన నెత్తిన రుద్దడానికి ప్రయత్నిస్తుంటారు. సహజంగానే చాలా మంది ప్రతిఘటిస్తారు. 1965లో వచ్చిన హిందీ వ్యతిరేక ఉద్యమం మద్రాస్‌ని అల్లకల్లోలం చేసింది. తమిళనాడులో 72 మంది చనిపోయారు. ఫలితంగా తర్వాతి ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది.
పాకిస్తాన్లో కూడా ఉర్దూను వ్యతిరేకిస్తూ తూర్పు పాకిస్తాన్లో నిరసన వచ్చింది. తర్వాతి రోజుల్లో బంగ్లాదేశ్ పుట్టుకకి ఇది కూడా ఒక కారణం.
సరే, రాజకీయాలు పక్కన పెడితే భాష మన ఇష్టం. ఇంగ్లీష్ ఎలాగూ అనివార్యం. అది ప్రపంచ భాషగా మారింది. అది తెలియకపోతే ఎక్కడా విలువ లేదు. హిందీ అలా కాదు. అది దేశ భాషల్లో ఒకటి. ఎక్కువ మంది మాట్లాడే భాష. అందుకని నేర్చుకుంటే దేశంలో ఎక్కడికెళ్లినా బతికేయచ్చు. కానీ బలవంతం అంటేనే సమస్య.
మా చిన్నప్పుడు హైస్కూల్ నుంచి హిందీ స్టార్ట్ అయ్యేది. హీరాలాల్ అని ఒకాయన టీచర్. హిందీ పీరియడ్ అంటే పైప్రాణాలు పైన్నే పోయేవి. ఎందుకంటే అది రాదు, నోరు తిరగదు. చేతిలో బెత్తం సుయ్‌మని సౌండ్ చేసేది. అతి కష్టం మీద తుమ్ హమ్ అని బట్టీ పట్టేవాళ్లం. మా క్లాస్‌లో రహంతుల్లా అని వుండేవాడు. వాడికి హిందీ ఈజీ అనుకున్నాం. కానీ అందరికంటే ఎక్కువ తన్నులు తినేవాడు. ఎందుకంటే వాళ్లింట్లో మాట్లాడేది తెలుగు కలిసిన ఉర్దూ. మాట్లాడ్డం వేరు, భాషని నేర్చుకోవడం వేరని అర్థమైంది.
హిందీకి భయపడ్డం కంటే నేర్చుకోవడమే మేలని హిందీని ప్రత్యేకంగా నేర్పించే “ప్రాథమిక” కోర్సులో జాయిన్ అయ్యాను. అప్పుడు కూడా కంఠస్థం తప్ప తెలుగులా చూస్తే అర్థమయ్యేది కాదు. మా వూళ్లో ప్యాలెస్ అనే థియేటర్ ఉండేది. పేరుకే ప్యాలెస్ కానీ అది హోప్లెస్ (ఇప్పుడు రీమోడల్ చేసినట్టున్నారు). శుక్ర, శని, ఆదివారాల్లో హిందీ సినిమాలు మ్యాట్నీ ఆడేవి. శనివారం మధ్యాహ్నం డ్రిల్ క్లాస్ ఎగ్గొట్టి గేట్ కీపర్‌కి పావలా ఇచ్చి నేను, శేఖర్ అనేవాడు సగం హిందీ సినిమాలు చూడసాగాం. ప్యార్ మెహబ్బత్, జిందగీ ఇట్లాంటి పదాలు అర్థమయ్యాయి.
హీరాలాల్ అయ్యవారు కంటే హిందీ సినిమాలే ఎక్కువ నేర్పించాయి. కానీ పరీక్షల్లో మేరీ సప్నోంకి అనే పాట ఏ సినిమాలోది అని అడగరు కదా. భారతీయ త్యోహార్ అని కష్టమైంది ఏదో అడుగుతారు. మాలాంటి వాళ్ల కోసమే బిట్ పేపర్ని సృష్టించారు. దాని సాయంతో భూకంపాన్ని తట్టుకునే వాళ్లం.
రాయడం, చదవడం సరిగా రాకపోయినా మనలో చాలా మందికి హిందీ వచ్చు. పాటలు, సినిమాల్లోని సొగసుని ఆనందిస్తున్నాం. భాషా సామ్రాజ్యవాదంలా హిందీని రుద్ది, హిందీ వస్తే ఉద్యోగాలు, మార్కుల్లో ప్రియారిటీ అంటే కొత్త జనరేషన్ ఊరుకోదు.
దేశానికి ఏదైనా చేయండయ్యా, దేశాన్ని ఏదో చేయకండి.
జీఆర్ మహర్షి