ఎమ్బీయస్‌: టర్కీ- తిరుగుబాటుతో లాభపడ్డ పాలకుడు

జులై 15 న టర్కీ దేశాధ్యక్షుడికి వ్యతిరేకంగా సైన్యం తిరగబడిందని, దానికి బుద్ధి చెప్పమని దేశాధ్యక్షుడు ఎర్దోగాన్‌ ప్రజలకు పిలుపు నిచ్చిన 12 గంటల్లోనే తిరుగుబాటు విఫలమై, సైన్యం లొంగిపోయిందని మనకు తెలుసు. ఇది…

జులై 15 న టర్కీ దేశాధ్యక్షుడికి వ్యతిరేకంగా సైన్యం తిరగబడిందని, దానికి బుద్ధి చెప్పమని దేశాధ్యక్షుడు ఎర్దోగాన్‌ ప్రజలకు పిలుపు నిచ్చిన 12 గంటల్లోనే తిరుగుబాటు విఫలమై, సైన్యం లొంగిపోయిందని మనకు తెలుసు. ఇది వినగానే ప్రజాస్వామ్యం పరిరక్షింప బడిందని మనం ఆనందించడం కద్దు. టర్కీ రాజకీయాలు ఎలా వున్నాయో, సైన్యం ఎందుకలా తిరగబడిందో, తిరుగుబాటు తర్వాత ఎర్దోగాన్‌ తీసుకున్న చర్యలు ఎంత తీవ్రంగా వున్నాయో వివరాలు తెలిస్తే తప్ప యిది మంచి పరిణామం అవునో కాదో తేల్చుకోలేం. 

ఆధునిక టర్కీ రిపబ్లిక్‌కు పితామహుడిగా పేరుబడిన కెమాల్‌ పాషా టర్కీని సెక్యులర్‌ దేశంగా తీర్చిదిద్దాడు. సెక్యులరిజం పాటిస్తున్న కొద్ది ముస్లిం దేశాల్లో అది ఒకటి. అయితే రాజకీయాలన్నాక ఏదో ఒక వాదాన్ని బలంగా వినిపించకపోతే మనుగడ వుండదు కాబట్టి కొన్ని పార్టీలు ఇస్లామ్‌ పేరు మీద ప్రజలను ఆకట్టుకోవడానికి చూశాయి. కానీ వాటికి పూర్తి ఆదరణ లేకపోవడంతో యితరవాదాల పార్టీలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పరచాయి. అవి రాజ్యాంగానికి మతపరమైన సవరణలు చేద్దామనుకున్నపుడు టర్కీ సైన్యం దాన్ని ప్రతిఘటిస్తూ సెక్యులరిజానికి పరిరక్షకురాలిగా వ్యవహరిస్తూ వచ్చింది. వెల్‌ఫేర్‌ పార్టీ అనే ఇస్లామిస్ట్‌ పార్టీ ద్వారానే ఎర్దోగాన్‌ రాజకీయాల్లోకి వచ్చాడు. తండ్రి కోస్టల్‌ గార్డ్‌. ఇతను ఇస్తాంబుల్‌ ఇస్లామిక్‌ స్కూలులో, మర్మరా యూనివర్శిటీలో చదివి మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ పాసయ్యాడు. ఫుట్‌బాల్‌ ఆటగాడిగా వృత్తి చేపట్టాడు. టీనేజరుగా ఇస్లామిస్టు సర్కిల్స్‌లో తిరిగాడు, వెల్‌ఫేర్‌ పార్టీలో చేరి 1994లో తన 40వ యేట ఇస్తాంబుల్‌కు మేయరయ్యాడు.

1997లో ఎర్బకాన్‌ నాయకత్వంలోని వెల్‌ఫేర్‌ పార్టీ సంకీర్ణ ప్రభుత్వం మతపరమైన విధానాలు చేపడుతూంటే మిలటరీ కలగచేసుకుని అతని చేత రాజీనామా చేయించింది. 1998లో ఆ పార్టీని నిషేధించింది. మిలటరీ చర్యకు వ్యతిరేకంగా ఎర్దోగాన్‌ మతం పేర ప్రజలను రెచ్చగొట్టడానికి తీవ్రమైన పదజాలంతో ఉపన్యాసాలు చేశాడు. దాంతో మిలటరీ అతన్ని అరెస్టు చేసి నాలుగు నెలల పాటు జైలుకి పంపింది. పదవులు చేపట్టకుండా నిషేధం విధించింది. బయటకు వచ్చాక 2001 ఆగస్టులో అబ్దుల్లా గుల్‌ అనే సహచరుడితో కలిసి ఎకెపి (జస్టిస్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ పార్టీ) అనే మరో ఇస్లామిస్టు పార్టీ ఏర్పరచాడు. తనను తాను మోడరేట్‌ కన్సర్వేటివ్‌గా అభివర్ణించుకున్నాడు. ఆ పార్టీ 2002లో జరిగిన ఎన్నికల్లో ఘనవిజయం సాధించింది. తనపై నిషేధం వుంది కాబట్టి గుల్‌ను ప్రధానిని చేసి ఉపయెన్నికలో నెగ్గాక అతన్ని దింపి 2003 మార్చిలో తనే ప్రధాని అయ్యాడు. 2007, 2011 ఎన్నికలలో అతని నేతృత్వంలో పార్టీని మళ్లీమళ్లీ గెలిచింది. 11 ఏళ్ల పాటు ప్రధానిగా పాలించాక ఎర్దోగాన్‌ అధ్యక్ష పదవికి మొట్టమొదటిసారిగా 2014లో ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించి నెగ్గాడు. 

2014 ఆగస్టులో ప్రధాని పదవిని అహ్మద్‌ దావుతోగ్లూకు అప్పగించి తను దేశాధ్యక్షుడయ్యాడు. అప్పటిదాకా అలంకారప్రాయంగా వున్న అధ్యక్షపదవికి ఎన్నో అధికారాలు కట్టబెట్టసాగాడు. ఈ వరస బాగాలేదని అభ్యంతర పెట్టిన అహ్మద్‌ను తొలగించి తన అనుచరుడైన బినాలీ యిల్‌దిరిమ్‌ను ప్రధానిగా చేసి, అధికారాలన్నీ తన చేతిలో పెట్టుకున్నాడు. ఈ 14 ఏళ్లలో ఎర్దోగాన్‌ టర్కీకి ఆర్థిక సుస్థిరత తెచ్చాడు. టర్కీని మాన్యుఫ్యాక్చరింగ్‌ సెంటర్‌గా, ఎగుమతుల కేంద్రంగా తీర్చిదిద్దాడు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై బాగా ఖర్చు పెట్టి కొత్త రోడ్లు, ఎయిర్‌పోర్టులు, హైస్పీడు రైల్‌ నెట్‌వర్క్‌ నిర్మించాడు. అతను వ్యాపారస్తులకు అనుకూలుడు. అమెరికాతో సఖ్యం నెరపి, నాటోలో చేరాడు. యూరోపియన్‌ యూనియన్‌లో చేరదామని చూస్తున్నాడు. అతని పాలనలో సరాసరి అభివృద్ధి రేటు 4.5% వుంది. ద్రవ్యోల్బణ రేటును చాలా బాగా నియంత్రించాడు, కానీ యితర దేశాలతో పోలిస్తే యిప్పటికీ అక్కడ ధరలు ఎక్కువే. 2014 నుంచి ఎకానమీ దిగజారసాగింది. ప్రస్తుతం గ్రోత్‌ రేటు 2.9% కి తగ్గి, నిరుద్యోగం 10%నికి పెరిగింది. ప్రపంచమంతటా గమనిస్తాం – ఆర్థికాభివృద్ధి జరిగిన కాలంలోనే అవినీతి, బంధుప్రీతి, నియంతృత్వం, విమర్శించినవారిపై కాఠిన్యం వుంటాయి. ఇక్కడా అదే జరిగింది. 

అతని అవినీతికి, ప్రభుత్వధనాన్ని దుర్వ్యయం చేయడానికి ఉదాహరణగా రాజధాని అంకారా శివార్లలో కొండ మీద కట్టిన వెయ్యి గదుల శ్వేతసౌధం (దాని పేరు అక్‌ సరాయ్‌) కనబడుతోంది. అది వైట్‌ హౌస్‌ కంటె, క్రెమ్లిన్‌ భవనం కంటె పెద్దది. ఖర్చు 615 మిలియన్‌ డాలర్లను మించిందంటున్నారు. 2013లో 100 బిలియన్‌ డాలర్ల అవినీతి స్కాండల్‌ బయటపడడంతో అతని కాబినెట్‌లో ముగ్గుర్ని, అతని సహచరులను అరెస్టు చేయించవలసి వచ్చింది. అవినీతిలో అతని పాత్రను నిరూపించే సంభాషణ రికార్డింగ్‌ సోషల్‌ మీడియా ద్వారా వెలుగులోకి రావడంతో ఫేస్‌బుక్‌, ట్విటర్‌, యూట్యూబ్‌లను నిషేధించాడు. ఎన్నికలలో అక్రమాలు చేశాడని కూడా ఆరోపణలు రావడంతో అతని యిమేజి దెబ్బ తినసాగింది. తన అవినీతిని, అధికారదాహాన్ని బయటపెడుతున్న స్థానిక జర్నలిస్టులను వేధించడమే కా, అంతర్జాతీయ మీడియాకు సంబంధించిన వారిపై కూడా దాడుల జరిపించాడు. అతని నియంతృత్వానికి, అవినీతికి వ్యతిరేకంగా 2013 మేలో దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి. పోలీసులు కాల్పులు జరిగి 22 మంది చనిపోయారు. ఇతర దేశాలు దీన్ని ఎత్తి చూపాయి. యూరోపియన్‌ యూనియన్‌లో చేరడానికి అతను జరుపుతున్న చర్చలు ఆగిపోయాయి. 

విదేశీ వ్యవహారాల్లో కూడా చాలా తప్పులు జరిగాయి. ఒకప్పుడు టర్కీకి మిత్రదేశంగా వున్న ఇజ్రాయేలుతో సంబంధాలు చెడగొట్టుకున్నాడు. సిరియా పాలకుడైన బషర్‌ అల్‌ అసాద్‌ ప్రభుత్వాన్ని బలహీనపరచడానికి ప్రయత్నిస్తున్న ప్రతిపక్షాలకు అండగా నిలిచాడు. వారితో బాటు ఐసిస్‌కు, లేవాంత్‌ మిలిటెంట్లకు కూడా ధనసహాయం చేస్తున్నట్లు బయటకు వచ్చేసింది. కుర్దులతో టర్కీవారికి 1978 నుంచి వైరం నడుస్తోంది. కుర్దిస్తాన్‌ వర్కర్స్‌ పార్టీ (పికెకె)తో 2012 నుంచి చర్చలు సాగించి రాజీ పడి కొంతమేరకు విజయం సాధించినా, ఐసిస్‌తో పోరాడుతున్న సిరియన్‌ కుర్దులకు సాయపడడానికి నిరాకరించడంతో, తక్కిన కుర్దులు కూడా అతనికి వ్యతిరేకు లయ్యారు. ఐసిస్‌ వాళ్లు టర్కీలో కూడా టెర్రరిస్టు కార్యకలాపాలు మొదలెట్టడంతో ప్రజల్లో ఎర్దోగాన్‌ పట్ల విముఖత ఏర్పడింది.  వీరికి మిలటరీ బలం కూడా తోడైతే తనకు పదవీచ్యుతి తప్పదని గ్రహించాడు ఎర్దోగాన్‌. ఇతని పార్టీ అధికారంలోకి వచ్చేముందు మిలటరీ నాలుగు సార్లు ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంది. అందువలన యితను ఎప్పటికప్పుడు మిలటరీని నిర్వీర్యం చేస్తూ, తన అనుయాయులను దానిలో భర్తీ చేస్తూ జాగ్రత్తపడ్డాడు. మిలటరీ అధికారులు మతచిహ్నాలను ధరించకూడదని కెమాల్‌ పాషా చేసిన చట్టాన్ని యితను మార్చేశాడు. మిలటరీ యొక్క సెక్యులర్‌ స్వభావాన్ని మార్చడానికి ఉన్నత పదవుల్లో మతాభిమానులను నియమించసాగాడు. తిరుగుబాటు జరిగినప్పుడు వీళ్లు దానిలో పాలు పంచుకోలేదు. కింది స్థాయిలో వున్న వారే తిరగబడి, అణచబడ్డారు. 

తిరుగుబాటు సందర్భంగా చెప్పుకోవలసిన ఒక ముఖ్య వ్యక్తి –  75 ఏళ్ల ఫెతుల్లా గ్యులెన్‌! ఇతను కూడా ఇస్లామిస్టే. సూఫీ వర్గానికి చెందినవాడనవచ్చు. తన ధోరణిలో ఇస్లాంను వ్యాప్తి చేస్తూ వుంటాడు. అతనికి టర్కీలోనే కాదు, ఆసియాలోని యితర దేశాల్లో కూడా అనుయాయులున్నారు. వారు స్థాపించిన విద్యాలయాలు చాలా ప్రఖ్యాతి చెందాయి. 1998లో మిలటరీ పెత్తనం నడిచేటప్పుడు తను చేసిన తీవ్రధోరణి మతోపన్యాసాల వలన యిబ్బంది వస్తుందన్న భయంతో 1999లో అమెరికాకు వలస వచ్చి 2001లో గ్రీన్‌ కార్డ్‌ సంపాదించాడు. 2002 ఎన్నికలలో సాటి ఇస్లామిస్టు అయిన ఎర్దోగాన్‌కు మద్దతు యిచ్చాడు. చాలాకాలం సన్నిహితుడిగా వున్నాడు. మిలటరీలో ఇస్లామిస్టుల నియామకానికి సహకరించాడు. అతని అనుయాయులు కూడా మిలటరీలో పెద్ద ఉద్యోగాలు ఆక్రమించారు. కొంతకాలానికి ఎర్దోగాన్‌ సర్వాధికారాలు తన చేతిలోకి తీసుకుని అవినీతికి పాల్పడడంతో గ్యులెన్‌ అతన్ని వ్యతిరేకించసాగాడు. దాంతో ఎర్దోగాన్‌ అతనిపై, అతని వర్గీయులపై పగబట్టాడు. 2013లో గ్యులెన్‌ అనుయాయులైన మిలటరీ పెద్దలు కొందరు ఎర్దోగాన్‌కు వ్యతిరేకంగా కుట్ర చేద్దామనుకున్నారు. ఇది అతను ముందుగానే పసిగట్టి వాళ్లందరినీ అరెస్టు చేయించాడు. శిక్షలు వేయించడానికి న్యాయవ్యస్థలో కూడా గ్యులెన్‌ అనుయాయులను తొలగించి, చట్టాల్లో మార్పులు చేసేశాడు.  కానీ వాటికి ఆధారాలు చూపలేకపోవడంతో అవి అమలు కాలేదు. గ్యులెన్‌పై టెర్రరిస్టు ముద్ర కొట్టి, కేసు పెట్టించి, తమ దేశానికి వెనక్కి పంపమని అమెరికాను కోరాడు. అతని టెర్రరిస్టు కార్యకలాపాలు తమ దృష్టికి రానందున పంపటం లేదని అమెరికా అంది. 

నాటోలో రెండో ముఖ్య దేశంగా వున్న తమ మాట అమెరికా వినలేదని ఎర్దోగాన్‌కు కోపం వచ్చింది. ఇప్పుడీ తిరుగుబాటు వెనక్కాల అమెరికా హస్తం వుందని, గ్యులెన్‌తో బాటు కుర్దుల పికెకె కూడా చేతులు కలిపిందని ఆరోపించాడు కూడా. అతని పాలనపై ప్రజాగ్రహం వెల్లువెత్తుతున్న సమయంలో యీ తిరుగుబాటు జరిగింది. ఎర్దోగాన్‌ తన వాక్చాతుర్యంతో దీన్ని ప్రజాస్వామ్యంపై దాడిగా ప్రజలను నమ్మించగలగడం చేత విఫలమైంది. అటూయిటూ కలిపి 264 మంది చనిపోయారు. వారిలో 173 మంది పౌరులు, 62 మంది పోలీసులు, 5గురు సైనికులు, 24 మంది తిరుగుబాటుదారులు. 2 వేల మంది గాయపడ్డారు. నిజానికి యిది ఇస్లామిస్టు  రాజకీయనాయకుల్లోనే రెండు గ్రూపుల మధ్య అధికార పోరాటం. టర్కీ సమాజంలో వివిధ రంగాల్లో పెద్ద పదవుల్లో వున్న గ్యులెన్‌ మనుషులను ఏదో ఒక విధంగా తొలగించాలని ఎర్దోగాన్‌ ప్రణాళికలు రచించి జాబితా తయారుచేసుకుని ఎప్పణ్నుంచో ఎదురు చూస్తున్నాడు. రెండేళ్లకోసారి జరిగే మిలటరీ నియామకాల, బదిలీల, పదవీవిరమణల సమావేశం ఆగస్టు 1న జరగాలి. దానిలో గ్యులెన్‌ మనుష్యులను తీసేసి, తనవాళ్లను పెడదామనుకున్నాడు. 

ఇప్పుడు యీ తిరుగుబాటు పేరు చెప్పి అతను అరెస్టు చేసినది – 118 జనరల్స్‌, అడ్మిరల్స్‌తో సహా 7500 మంది మిలటరీవారు, 1000 మంది పోలీసు అధికారులు, ఉద్యోగాలు తీసేసినది లేదా సస్పెండ్‌ చేసినది – 8 వేల మంది పోలీసు అధికారులు, 3 వేల మంది న్యాయాధికారులు, 15,200 మంది విద్యాశాఖాధికారులు, 21 వేల మంది టీచర్లు 1577 మంది యూనివర్శిటీ డీన్లు, 1500 మంది ఫైనాన్స్‌ శాఖాధికారులు, 492 మంది మతబోధకులు, 393 మంది సోషల్‌ పాలిసీ మినిస్త్రీ సిబ్బంది, 257 మంది ప్రధాని కార్యాలయంలో ఉద్యోగులు, 100 మంది నిఘా విభాగ అధికారులు! సైనికులు తిరుగుబాటు చేస్తే వారిని శిక్షించాలి కానీ టీచర్లను, మతబోధకులకు శిక్షేమిటి అనుకోవద్దు. వాళ్లంతా గ్యులెన్‌ ఉద్యమం నడిపే విద్యాసంస్థలకు చెందినవారై వుంటారు,  ఆ ఉద్యమ కార్యకర్తలై వుంటారు.  

ఈ చర్యలతో బాటు దేశంలో మూణ్నెళ్ల ఎమర్జన్సీ విధించాడు. ఈ కాలంలో ప్రభుత్వం పార్లమెంటుతో, ప్రతిపక్షాలతో సంప్రదించకుండా ఏ చట్టమైనా చేయవచ్చు, చేసిన చట్టాన్ని కోర్టులు ప్రశ్నించలేవు, మీడియాపై ఆంక్షలు విధించడానికి, పదిమంది గుమిగూడినా, ఎవరిమీదనైనా అనుమానం వచ్చినా అరెస్టు చేయడానికి ప్రభుత్వానికి సర్వహక్కులూ దఖలు పడ్డాయి. ఏ రాజకీయ పార్టీ తిరుగుబాటుకు మద్దతు తెలపలేదు. అయినా వారందరి రాజకీయ హక్కులూ హరించి, ప్రెస్‌ నోరు నొక్కి తన నియంతృత్వానికి బాటలు వేసుకుంటున్నాడు ఎర్దోగాన్‌. ''వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి యీ తిరుగుబాటు మనకు దేవుడు పంపిన సువర్ణావకాశం.'' అని ప్రకటించాడు ఎర్దోగాన్‌. అవకాశం దేవుడు పంపాడో లేదో కానీ, దాన్ని అలా మలచుకున్న ఘనత మాత్రం యీ మానవుడిదే!

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జులై 2016)

[email protected]