ఇదో పెద్ద ప్రశ్నా!? ఏకలవ్యుడు నిషాదుడు కదా, అంటే కోయ, బోయ వంటి గిరిజనుడు అని చెప్పేస్తాం. ఆ సమాధానం ఎంతవరకు కరక్టనేది వివరించడమే యీ వ్యాసం లక్ష్యం. మనందరికీ తెలిసున్న మహాభారత కథ ఒక్కసారి గుర్తు చేసుకుందాం. పేద బ్రాహ్మణుడైన ద్రోణుడు, పాంచాల దేశపు యువరాజైన యజ్ఞసేనుడు (ద్రుపదుడు) అగ్నివేశ మహర్షి దగ్గర సహాధ్యాయులై అస్త్రవిద్యను, ధనుర్వేదాన్ని అభ్యసించారు. మిత్రుడిపై ప్రేమతో ద్రుపదుడు 'మా నాన్నగారు నాకు పట్టాభిషేకం చేయగానే నా ధనమంతా నీదే' అని ద్రోణుడికి మాట యిచ్చాడు. చదువు పూర్తయ్యాక ద్రోణుడు కృపిని పెళ్లాడి అశ్వత్థామను కన్నాడు. ద్రోణుడు ఎక్కడా ఉద్యోగం చేయనందున ఆదాయం లేదు. అశ్వత్థామ ఆవుపాల కోసం ఏడవడం చూడలేక గోదానం తీసుకుందామని ద్రోణుడు చాలా చోట్లకు వెళ్లాడు. ఎక్కడా దొరకలేదు. ఇంటికి తిరిగి వచ్చేసరికి చుట్టుపక్కల పిల్లలు అశ్వత్థామను ఆటపట్టించడానికి పిండినీళ్లను పాలని చెప్పి తాగిస్తున్నారు. ఆ పిల్లవాడు అవి నిజంగా ఆవుపాలనుకుని ఆనందిస్తూ వుంటే ద్రోణుడికి పట్టరాని దుఃఖం వచ్చింది. ఇంతలో తన మిత్రుడు రాజయ్యాడని విని, వెళ్లి ఆవునిమ్మని అడుగుదామనుకున్నాడు. రాజస్థానంలో యితను ''మిత్రమా'' అని సంబోధించగానే ద్రుపదుడు ''స్థాయి బట్టి స్నేహం మారుతుంది. ఇప్పుడు నాకు, నీకు అంతస్తులో ఎంతో తేడా వుంది. నీకిచ్చిన మాట నాకు గుర్తే లేదు. కావాలంటే ఓ పూట భోజనం పెట్టగలను.'' అన్నాడు. భార్యాబిడ్డలతో వెళ్లిన ద్రోణుడికి తలకొట్టేసినట్లయింది. సరైన శిష్యుణ్ని తయారుచేసి, యితన్ని అతని చేత ఓడించి, బుద్ధి చెప్పాలని అప్పుడే ప్రతిజ్ఞ చేసుకున్నాడు. ఉద్యోగార్థం కురుదేశానికి వచ్చినపుడు పిల్లలైన కురుపాండవులు ఆడుకుంటున్న బంతి నూతిలో పడితే బాణాలతో కొట్టి పైకి తీసియిచ్చాడు. అతని ప్రజ్ఞ విన్న భీష్ముడు వచ్చి నీవెవరవని అడిగితే యీ కథంతా చెప్పాడు. పిల్లలకు గురువుగా భీష్ముడు ఉద్యోగం యిచ్చాడు.
కురుపాండవులకు విద్య నేర్పాక కొన్నాళ్లకు అందర్నీ కూర్చోబెట్టి ''అస్త్రవిద్య ముగిశాక నా కోరిక మీరు తీర్చాలి. సరేనా?'' అని అడిగాడు. అందరూ మౌనంగా వుంటే అర్జునుడు మాత్రం ''గురుకార్యాన్ని నెరవేరుస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను.'' అన్నాడు. ఆ క్షణంలోనే ద్రోణుడికి అతడు అత్యంత ఆత్మీయుడై పోయాడు. అతనికి ప్రత్యేక శ్రద్ధతో అస్త్రాలు నేర్పసాగాడు. ద్రోణుడి ఖ్యాతి విని వృష్ణి వంశజులు, అంధక వంశస్థులూ, వివిధ దేశాల రాజులూ, కర్ణుడు అందరూ వచ్చి అతని శిష్యులుగా చేరారు. ఎందరు చేరినా అర్జునుడు విద్య నేర్చుకోడంలో, గురువును సేవించడంలో చూపినంత శ్రద్ధ మరెవరూ చూపలేదు. ఒక రోజు చీకట్లో కూడా బాణాలు వేయడం అభ్యసిస్తూ వుంటే అది చూసిన ద్రోణుడు అర్జునుని కౌగలించుకుని ''విలువిద్యలో లోకంలో మరెవ్వరూ నీకు సమానులుగా నిలువలేనట్లు నిన్ను తీర్చదిద్దడానికి ప్రయత్నిస్తాను.'' అని మాట యిచ్చాడు. అన్నట్టుగానే తన కొడుక్కి నేర్పని అస్త్రాలు కూడా అర్జునుడికి నేర్పాడు. అతని ద్వారానే తన పగ తీరుతుందన్న ఆశ అతనిది. ఒక రోజు ఏకలవ్యుడు వచ్చి విద్య నేర్పమని అడిగాడు. నువ్వెవరివని అడిగితే ''నిషాద రాజైన హిరణ్యధన్వుని (కొన్ని వెర్షన్లలో హిరణ్యధనుషుడు) కొడుకుని'' అన్నాడు. నిషాదులంటే పశుపక్ష్యాదులను వేటాడే ఆటవికులు. నువ్వు నిషాదుడివి కాబట్టి నేర్పనన్నాడు ద్రోణుడు.
అలా ఎందుకని వుండవచ్చు? వేటాడేవారికి క్షాత్రవిద్య నేర్పకూడదన్న నిషేధం వుందా? నగరాలను ఏలే క్షత్రియరాజులకు అడవుల్లో వుండే నిషాదులు సామంతరాజులుగా వుంటూ అప్పుడప్పుడు తిరగబడేవారా? వాళ్లకు విద్య నేర్పితే పోలీసు అకాడెమీలో పోలీసులతో బాటు మావోయిస్టులకూ తర్ఫీదు యిచ్చినట్లవుతుందా? కేవలం కులవివక్షత మాత్రమే అనుకుంటే ద్రోణుడు బ్రాహ్మణులు, క్షత్రియులకే కాక సూతుడైన కర్ణుడికీ విద్య నేర్పాడు. మరి నిషాదులకు ఎందుకు నేర్పలేదు? ఏది ఏమైనా యీ చర్యను ఏకలవ్యుడితో సహా ఎవరూ తప్పుపట్టలేదు. మీ ప్రతిమను పెట్టుకుని అభ్యసిస్తాను అని ఏకలవ్యుడు అంటే సరేనన్నాడు ద్రోణుడు – అలా ఏ మాత్రం విద్య నేర్చుకుంటాడులే అనే ధీమాతో కాబోలు. కొన్నాళ్లకు తన శిష్యుల నందరినీ వేటకు పంపాడు. వేట కవసరమైన సామగ్రి తీసుకుని ఒక మనిషి తన పెంపుడు కుక్కతో సహా వారి వెంట వచ్చాడు. వీరంతా వేటాడుతూంటే ఆ కుక్క ఏకలవ్యుడి వద్దకు వెళ్లింది. అప్పటికే అతను మట్టితో ద్రోణుడి ప్రతిమ చేసి ముందర పెట్టుకుని, విలువిద్యలో అద్భుతమైన పాటవాన్ని సాధించాడు. ఆటవికుడు కాబట్టి జింకతోలు ధరించాడు, జటలు పెంచాడు. శరీరమంతా మలినమై వుంది. అసలే నల్లనివాడు. అతన్ని చూసి కుక్క మొరిగింది. దాన్ని దండించడానికి ఏకలవ్యుడు ఆ కుక్క ముఖం మీద ఒకే సారి ఏడుబాణాలను ప్రయోగించాడు. ఆ కుక్క మొర్రోమంటూ కురుకుమారుల వద్దకు వచ్చింది. ఆ బాణాల తీరును చూసి, ఆ నైపుణ్యానికి అబ్బురపడి కుక్క వెంబడి ఏకలవ్యుడి వద్దకు వెళ్లి కలిశారు. నువ్వెవరు అంటే ఫలానా అని చెప్పాడు. ద్రోణశిష్యుణ్ని అని చెప్పాడు.
వీళ్లంతా తమ నగరానికి తిరిగి వెళ్లి ద్రోణుడితో విషయం చెప్పారు. అర్జునుడు ఫిర్యాదుగా ''గురువర్యా, నన్ను మించినవాడు ఎవరూ లేకుండా లేరన్నారు. తమ శిష్యుడు ఏకలవ్యుడు నన్ను మించిన వీరుడు ఎలా అయ్యాడు?'' అని అడిగాడు. ద్రోణుడు రెండు గడియలు ఏకలవ్యుడి గురించి ఆలోచించి ఏకలవ్యుణ్ని నిర్వీర్యుణ్ని చేయాలనే ఒక నిర్ణయానికి వచ్చాడు. దానికి తన 'ఆచార్యత్వాన్ని' వుపయోగించదలచుకున్నాడు. ఏకలవ్యుడి దగ్గరకు వెళ్లి 'వీరుడా! నువ్వు నాకు శిష్యుడివే అయితే జీతం ఇయ్యి' అన్నాడు. (నన్నయ్య గారు చేసిన అనువాదంలో గురుదక్షిణ అని వుంది). ఏకలవ్యుడు సరేననగానే 'నీ కుడిచేతి బొటనవేలు ఇయ్యి' అన్నాడు. ఇది చాలా దుర్మార్గం. ఏకలవ్యుడికి ప్రత్యక్షంగా విద్య నేర్పని మనిషికి వేతనమడిగే హక్కు ఎక్కణ్నుంచి వచ్చింది? ద్రోణుడి యీ ప్రవర్తనకు కారణమేమిటి? తన పగ తీర్చడానికి సమ్మతించిన అర్జునుణ్ని ఎలాగైనా మంచి చేసుకోవాలన్న తాపత్రయమే కావాలి. కొందరు యింకో కారణం వుందని వ్యాఖ్యానిస్తారు – శిష్యుడి స్వభావాన్ని బట్టి, అర్హత బట్టి వారికి ఎంత విద్య గరపాలో నిర్ణయించే గురువు ద్రోణుడు. అందుకే తన కుమారుడు అశ్వత్థామకు కూడా చెప్పని కొన్ని అస్త్రాలు అర్జునుడికి నేర్పాడు. నిజానికి యుద్ధానంతరం అశ్వత్థామ అందరి కంటె నీచంగా ప్రవర్తించి రాత్రి పూట పాండవ శిబిరానికి వెళ్లి హత్యలు చేశాడు. అలాటి బుద్ధి వుందనే కాబోలు ద్రోణుడు అతనికి పూర్తిగా నేర్పి వుండడు. ఇక ఏకలవ్యుడి దగ్గరకు వస్తే – అతను కుక్క పట్ల చూపిన క్రౌర్యం కారణంగా, యిటువంటివాడికి అడ్డుకట్ట వేయకపోతే లోకానికి వినాశకారుడు అవుతాడు అనుకున్నాడట. ఈ విషయాలు మహాభారతం రాసిన కవి రాయలేదు. వ్యాఖ్యాతలు చెప్పేవే. గురువు కోరిక వినగానే ఏకలవ్యుడు ఏ మాత్రం దిగులుపడకుండా ప్రసన్నముఖంతో బొటనవేలు కోసి యిచ్చేశాడు. ద్రోణుడు సంతోషించి అతనికి తక్కిన వేళ్లతో బాణాలు ఎలా వేయాలో నేర్పాడు. కానీ యిదివరకంతటి వేగం ఆ బాణాల్లో లేదు. ఇదీ భారతం ఆదిపర్వంలో వున్న ఏకలవ్య ప్రస్తావన.
ఈ బొటనవేలు ఖండింపచేయడం ప్రస్తావన మళ్లీ ద్రోణపర్వంలో వస్తుంది. ఇంద్రుడు యిచ్చిన శక్త్యాయుధాన్ని కర్ణుడు అర్జునుడికై దాచి పెట్టుకున్నాడు కానీ ఒక రాత్రి ఘటోత్కచుడు విజృంభించడంతో తర్వాతి సంగతి తర్వాత చూసుకుందామని దానితో ఘటోత్కచుణ్ని చంపివేశాడు. దాంతో పాండవులంతా శోకంలో మునిగితే కృష్ణుడు మాత్రం హర్షం వ్యక్తం చేశాడు. అదేమిటని అడిగితే – కర్ణుడి శక్త్యాయుధం ఖర్చయిపోయింది, అతన్ని నిర్జించడం యిక సులభం కదా అన్నాడు. అతనే కాదు మీ విజయం కోసం ముందు నుండి హిడింబ, బక, శిశుపాల, జరాసంధాదులను ఎలా అడ్డు తొలగిస్తూ పోయానో గుర్తు చేసుకోండి అని చెపుతూ 'ఏకలవ్యుడికి బొటనవేలు వుండి వుంటే అతన్ని ఎవరూ అడ్డుకోలేకపోయారు. నీ మేలు కోసమే ద్రోణుడు అతని బొటనవేలు ఖండింపచేశాడు' అన్నాడు. పుల్లెల శ్రీరామచంద్రుడుగారు చేసిన అనువాదంలో 'ఏకలవ్యుడు అంగుష్ఠాన్ని కోల్పేయేట్లు నేనే చేశాను' అని వుంది. అప్పటికి కృష్ణుడు రంగంపైకి రాలేదు. భగవద్గీతలో 'అందర్నీ నేనే చంపాను, నువ్వు వొట్టి నిమిత్రమాత్రుడవే' అని చెప్పిన ధోరణిలో వుందీ వాక్యం.
కొన్ని వెర్షన్లలో 'నీ మేలు కోరి మహావీరుడైన ఏకలవ్యుణ్ని నేనే చంపాను' అని కూడా వుంది. సభా పర్వంలో శిశుపాలుడు కృష్ణుడికి అగ్రపూజ చేయడాన్ని నిరసిస్తూ 'గౌరవించాలంటే వీరులు వారు లేరా, వీరు లేరా' అంటూ ఏకలవ్యుడి పేరు కూడా చెప్తాడు. అంటే బొటనవేలు పోయిన తర్వాత కూడా ఏకవీరుడు మహావీరుడై వెలిగాడా అన్న సందేహం వస్తుంది. కృష్ణుడి చేతిలో చనిపోయిన ఏకలవ్యుడు ఎవడు? దీనిపై ఆరుద్రగారు పరిశోధన చేశారు. ఏకలవ్యుడు కృష్ణుడికి, పాండవులకి కూడా బంధువే అంటూ వ్యాసం రాశారు. దానికి ఆధారం హరివంశం అన్నారు. సంస్కృత హరివంశం ప్రకారం కృష్ణుడి తండ్రి యైన వసుదేవుడికి అయిదుగురు అక్కచెల్లెళ్లు. వారిలో పృథ (ఈమెను కుంతిభోజుడనే రాజు పెంచుకుని కుంతి అని పేరు పెట్టాడు) ఒకరు. ఆవిడ పాండవులలో ముగ్గురికి తల్లి. శ్రుతశ్రవ అనే ఆవిడ కొడుకు శిశుపాలుడు. పృథుకీర్తి అనే ఆవిడ కొడుకు దంతవక్త్రుడు. జయవిజయులే యీ శిశుపాల, దంతవక్త్రులుగా పుట్టి కృష్ణుడి చేతిలో మరణించారు. శ్రుతదేవ అనే ఆమె కొడుకి పేరు ఏకలవ్యుడు. ఇతను మహావీరుడు. ఉగ్రసేనుడికి వియ్యంకుడైన (అంటే కంసుడికి మామగారైన) జరాసంధుడి వద్ద సేనాపతిగా పనిచేశాడు. కంసుణ్ని చంపినందుకు కృష్ణబలరాములపై పగబట్టిన జరాసంధుడు మధురపై 18 సార్లు దండెత్తాడు. వాటిలో ఏకలవ్యుడే సైన్యాధిపత్యం వహించాడు. ఇతను బలరాముడితో భీకరయుద్ధం చేశాడు. ఇవన్నీ హరివంశంలో వున్నాయి. ఇతన్నే కృష్ణుడు చంపివేశాడు. ఎప్పుడు అన్నది స్పష్టంగా తెలియదు. ద్రోణపర్వం పాటికే చంపేశాడని మాత్రం భారతంలో ఘటోత్కచ వధ తర్వాత కృష్ణుడు చెప్పినదాని ప్రకారం అనుకోవాలి.
ఆరుద్రగారు హరివంశంలో ఏకలవ్యుడు, భారతంలో వేలు పోగొట్టుకున్న ఏకలవ్యుడు ఒకడే అని తీర్మానించారు. దీనికి ఆయన ఉటంకించిన ఆధారం హరివంశంలోని 1-34 లో 33 వ శ్లోకం. దేవశ్రవ కుమారుడు ఏకలవ్యుడు నిషాదుల చేత పెంచబడ్డాడని దానిలో వుంది. దేవశ్రవుడు వసుదేవుని తమ్ముళ్లల్లో ఒకడు. ''శ్రుతదేవ అనే పేరుకు బదులు దేవశ్రవ అనే పేరు ఈ శ్లోకంలో చోటు చేసుకుంది. ఎఱ్ఱన్నగారు ఆంధ్ర హరివంశంలో దాన్ని సవరించి శ్రుతదేవకు కేకయేశ్వరుని వలన ఏకలవ్యుడు పుట్టి నిషాదులలో పెరిగి.. అని రాశారు.'' అని ఆరుద్రగారు రాశారు. ఆరుద్రగారు ఎఱ్ఱన్న పద్యాన్ని అనుసరించి, పాండవులకు, కృష్ణుడికి రక్తబంధువు, జరాసంధుడి సేనాపతి అయిన ఏకలవ్యుడు, ద్రోణుడు చేతిలో బొటనవేలు పోగొట్టుకున్న ఏకలవ్యుడు ఒకడే అని తేల్చేశారు. ఈ వాదన నమ్మితే చాలా ప్రశ్నలే వస్తాయి. ద్రోణుడు నువ్వు నిషాదుడివి కాబట్టి విద్య నేర్పను అన్నపుడు ఏకలవ్యుడు 'అబ్బే, నేను సుక్షత్రియుణ్నే, నిషాదులు పెంచుతున్నారంతే' అని చెప్పలేదేం? అడవిలో ఏకలవ్యుడు తారసిల్లినపుడు నువ్వెవరివి అని పాండవులు అడిగినపుడు 'మీ బంధువునే' అని ఎందుకు చెప్పలేదు? మహాభారతం ప్రకారం రాజసూయ యాగం చేసినప్పుడు ధర్మరాజుకి అతని రక్తబంధువులందరూ సత్కరించారు. శిశుపాలుడు రథానికి జండా కట్టాడు. పినతల్లి కొడుకులైన విందానువిందులు నానారాజులు తెచ్చిన వివిధ నదీజలాలను అందుకుని పెద్దపెద్ద పాత్రలలో పోశారు. ఈ జాబితాలో ఏకలవ్యుడు కూడా వున్నాడు. అతను పాదరక్షలు తెచ్చి ధర్మరాజు పాదాలముందు పెట్టాడు. తన బొటనవేలు పోవడానికి కారకుడైన పాండవులకు ఏకలవ్యుడు యింత సత్కారం చేస్తాడా? ఇది పొసగడం లేదు.
నిజానికి ఏకలవ్యుడి గురించి ఎంతో చెప్పిన హరివంశంలో చిన్నపుడు ద్రోణుడికి బొటనవేలు అర్పించాడని ఎక్కడా లేదు. కాస్సేపు మనం కృష్ణుడి మేనత్త కొడుకు క్షత్రియ ఏకలవ్యుడు, ద్రోణుడికి బొటనవేలు సమర్పించుకున్న నిషాద ఏకలవ్యుడు వేర్వేరు అనుకుందాం. అప్పుడు సందర్భాలు సరిపోతాయి. క్షత్రియ ఏకలవ్యుడు వీరుడు, బంధువైన జరాసంధుడి సేనాపతి. శిశుపాల, దంతవక్త్రుళ్లలాగే మేనమామ కొడుకైన కృష్ణుడిపై పగబట్టినవాడు. చివరకు కృష్ణుడి చేతిలో చనిపోయినవాడు. రాజసూయంలో పినతల్లి కొడుకు ధర్మరాజుకి గౌరవం యిచ్చాడన్నా, అదే మండపంలో కృష్ణుడికి అగ్రపూజ జరిగేటప్పుడు శిశుపాలుడు ప్రత్యామ్నాయంగా ఏకలవ్యుడి ప్రతిపాదించాడన్నా అన్నీ సరిపోతాయి. అంతేకాదు ద్రోణపర్వంలో ఘటోత్కచ వధ తర్వాత కృష్ణుడు మహా యోధులను ముందే నిర్జింపచేసి మీ మార్గం నిష్కంటకంగా చేశాను అని చెప్పే పేర్లలో ఏకలవ్యుడి పేరు అతుకుతుంది.
ఏకలవ్యుడు పేరు వున్న యిద్దరు వ్యక్తులున్నారని, ఒకతను నిషాదరాజు కొడుని, ద్రోణబాధితుడని, మరొకడు పాండవుల రక్తబంధువని, జరాసంధ సేనాపతి అని అనుకుంటే అంతా స్పష్టంగా వుంటుంది. అయితే యీ వాదనకు అవరోధంగా నిలిచేవి – సంస్కృత హరివంశంలో దేవశ్రవకు ఏకలవ్యుడు జన్మించి నిషాదులచే పెంచబడ్డాడనే శ్లోకం, తెలుగు హరివంశంలో 'శ్రుతదేవకు ఏకలవ్యుడు పుట్టి నిషాదులచే పెంచబడ్డాడనే పద్యం! ఈ రెండు ప్రక్షిప్తాలు కావచ్చు. పేరు సామ్యం వలన గందరగోళపడిన రాయసకాడెవరో యిద్దరికీ ముడిపెట్టబోయిన ప్రయత్నం కావచ్చు. ఇతనే కాదు, మహాభారతాన్ని తిరగరాసే రాయసకాళ్లు కూడా గందరగోళ పడ్డారు. ఏకలవ్యుణ్ని చంపాను అని ఒక వెర్షన్లో వుంటే, మరో వెర్షన్లో అతని బొటనవేలును ద్రోణుడి చేత అడిగించాను అని చేర్చారు. ఏది ఏమైనా ఆరుద్రగారు యిద్దరూ ఏకలవ్యులూ ఒకరేనని నమ్మారు. ఆరుద్ర వ్యాసాన్ని ఉటంకిస్తూనే శ్రీ జె.వి.శాస్త్రి (మహాభారత వైజయంతి 7 వ భాగం 336వ పేజీ) 'వీరిద్దరూ ఒకరేనా అనే సందేహం కలుగుతుంది.' అని రాశారు. నా మట్టుకు నాకు ఆరుద్ర గారి వంటి పరిశోధకుడు పొరబడి వుంటారా అనే సందోహంతో బాటు యిద్దరూ వేర్వేరనే నమ్మకం కలిగింది.
అందువలన బొటనవేలు యిచ్చిన ఏకలవ్యుడు నిషాదుడే, తర్వాత అతను విలువిద్యలో ప్రావీణ్యత పోగొట్టుకుని సామాన్యుడిగా జీవించి వుంటాడు. ఈ వ్యాసంలో పొరపాట్లు వుంటే ఎత్తి చూపించగోరతాను.
– ఎమ్బీయస్ ప్రసాద్ (జులై 2016)