చంద్రబాబు మారరుగాక మారరంతే.!

ఎవరేమనుకున్నా తాను నమ్మినదే నిజమనుకుంటారు చంద్రబాబు. అమరావతిని తాను గ్రాఫిక్స్‌లో ఊహించుకుంటూ, అదే నిజమవుతుందని జనాన్ని నమ్మిస్తూ.. ఊహాలోకంలో ప్రపంచం మొత్తాన్ని విహరింపజేయాలనుకుంటారు. అంతే తప్ప, నేల మీదకు దిగి, అసలు వాస్తవమేంటో ఆలోచించరు.…

ఎవరేమనుకున్నా తాను నమ్మినదే నిజమనుకుంటారు చంద్రబాబు. అమరావతిని తాను గ్రాఫిక్స్‌లో ఊహించుకుంటూ, అదే నిజమవుతుందని జనాన్ని నమ్మిస్తూ.. ఊహాలోకంలో ప్రపంచం మొత్తాన్ని విహరింపజేయాలనుకుంటారు. అంతే తప్ప, నేల మీదకు దిగి, అసలు వాస్తవమేంటో ఆలోచించరు. అలా ఆలోచిస్తే ఆయన చంద్రబాబు ఎందుకవుతారు.? 

నిరాహార దీక్షలు, బంద్‌లు, ఆందోళనలు.. ఇవన్నీ ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపేందుకు కొన్ని మార్గాలు. గతంలో చంద్రబాబు చేశారు.. ప్రస్తుతం వైఎస్‌ జగన్‌ చేస్తున్నారు.. రేప్పొద్దున్న ఇంకొకరు చేస్తారు.. చేస్తూనే వుంటారు. అఫ్‌కోర్స్‌, ఈ నిరసనలతో ఒరిగేదేముంటుంది.? అన్నది వేరే విషయం. అలాంటి ఆందోళనలు ఉధృతమై, ఉద్యమం భగ్గుమనడంతోనే కదా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశగా కాంగ్రెస్‌ పార్టీ మెట్టు దిగాల్సి వచ్చింది. 

కానీ, చంద్రబాబు 'బంద్‌లతో ఆంధ్రప్రదేశ్‌ని ఇబ్బందుల్లోకి నెట్టేయడం సబబు కాదు..' అంటూ విపక్షాలపై విషం చిమ్మడం మొదలుపెట్టారు. అంతే తప్ప, అన్ని రాజకీయ పార్టీల్నీ కలుపుకుపోయి, ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామనీ, ఢిల్లీకి ఆంధ్రప్రదేశ్‌ సెగ తాకేలా ఉద్యమానికి సహకరిస్తామని మాత్రం చంద్రబాబు చెప్పడంలేదు. అసలంటూ, ప్రత్యేక హోదాకి మొట్టమొదటి అడ్డంకి చంద్రబాబే అయినప్పుడు, ఆయనెందుకు సహకరిస్తారు.? ఛాన్సే లేదు. 

ఇక, ఇంత జరిగాక కూడా, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిని ప్రపంచంలో టాప్‌ 5 నగరాల్లో ఒకటిగా చేస్తామని చెబుతున్నారు. ఎలా.? 'మీ దిక్కున్న చోట చెప్పుకోండి.. దేశంలోని 29 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ ఒకటి మాత్రమే. కేవలం ఆంధ్రప్రదేశ్‌కే ఆర్థిక సహాయం అందించుకుంటూ పోతే, మిగతా రాష్ట్రాల పరిస్థితేంటి.?' అని సాక్షాత్తూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ, రాజ్యసభలో చెప్పాక, అమరావతి నిర్మాణం అసలు సాధ్యమేనా.! 

2050 కోట్లు అమరావతి కోసం కేంద్రం ఇచ్చిందని అరుణ్‌ జైట్లీ చెబుతున్నారు. అందులో వెయ్యి కోట్లు విజయవాడ, గుంటూరు నగరాలకు కేటాయించినదనీ, అమరావతికి కేటాయించింది వెయ్యి కోట్లేనన్నది అదే రాజ్యసభలో, ఇంకో కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఖండించి పారేశారు. అయినా, దానికి సమాధానమిస్తూ, అదనంగా నిధులు ఇస్తామని అరుణ్‌ జైట్లీ చెప్పలేదు. మరెలా.? ఎక్కడ చెట్టు దులిపి, చంద్రబాబు డబ్బులు పోగేసి అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా నిర్మిస్తారు.? 

అన్నట్టు, రోడ్లకు అడ్డంగా విగ్రహాలు వుండకూడదని చంద్రబాబు సెలవిచ్చారు. నిజమే, విగ్రహాలు వుండకూడదు. జనం గుండెల్లో మహనీయుల్ని పెట్టుకోవాలి. కానీ, చంద్రబాబు తన రాజకీయ అవసరాల కోసం స్వర్గీయ ఎన్టీఆర్‌ విగ్రహాల్ని తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని ప్రతిష్టించారు.? ఎన్ని విగ్రహాలకు వీలు చిక్కినప్పుడల్లా ఆయన పాలాభిషేకాలు చేసేస్తున్నారు. మాట్లాడేశామంటే, మాట్లాడేశాం.. అనుకోవడం చంద్రబాబుకే చెల్లింది. 

చేసే పనులకీ, చెప్పే మాటలకీ పొంతన వుండదు. దటీజ్‌ చంద్రబాబు. తెలంగాణలో పార్టీ ఫిరాయింపులేమో రాజకీయ వ్యభిచారం. అదే పని, ఆంధ్రప్రదేశ్‌లో చేస్తే మాత్రం అది మహత్కార్యం. కేంద్రం తమ రెక్కలు విరిచేసిందంటారు, కేంద్రాన్ని ఎవరన్నా ప్రశ్నిస్తే ఊరుకోరు. దటీజ్‌ చంద్రబాబు. ఆయన మారరు, మారరుగాక మారరు.