రాజకీయాలు చేయడానికి అమెరికా అయితే ఏంటి, అనకాపల్లి అయితే ఏంటి.? ఎక్కడన్నా రాజకీయం రాజకీయమే. ఇండియాలో కాబట్టి ఇలాగ.. అదే అమెరికాలో అయితేనా.? అని సరదాగా అనేస్తుంటాం. అమెరికా అంటే చాలామందికి అందనిది. అందుకే, అదో అద్భుత ప్రపంచం కింద లెక్క. కానీ, అక్కడా రాజకీయాల మన దేశంలోనే వున్నట్లుంటాయి. అందుకే, రాజకీయాల పరంగా అమెరికా అయినా అనకాపల్లి అయినా ఒకటే అనేది.
నిన్న మొన్నటిదాకా అమెరికాలో రాజకీయాల గురించి పెద్దగా ఎవరికీ తెలిసేది కాదు. అఫ్కోర్స్.. ఇప్పుడున్నంత దారుణంగా అమెరికాలో రాజకీయాలు ఇంతకు ముందెన్నడూ లేవనుకోండి.. అది వేరే విషయం. డెమోక్రాట్లు, రిపబ్లికన్లు, స్వతంత్రులు.. ఇలా అమెరికా రాజకీయాల్లో అధ్యక్ష పదవి కోసం కిందా మీదా పడుతూ, రొటీన్ రాజకీయ విమర్శలు చేసుకుంటూ, అమెరికా అధ్యక్ష ఎన్నికల్ని వేడెక్కించేస్తున్నారంతా.
ట్రంప్ రిపబ్లికన్ల అభ్యర్థిగా తెరపైకి వచ్చింది మొదలు, పరిస్థితి మరీ దారుణంగా తయారైపోయింది. ట్రంపు.. ఆయన నోరు కంపు.. అన్న మాట ప్రపంచ వ్యాప్తంగా విన్పిస్తోందిప్పుడు. నోటికొచ్చిన విమర్శలు చేస్తున్నాడాయన. భారతీయులు సహా,, అమెరికాయేతరుల్ని అమెరికా నుంచి తరిమికొట్టేస్తానంటాడు.. ఉగ్రవాదం విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తాడు.. ముస్లింల గురించీ, ఇతర మతాల గురించీ గేలి చేస్తాడు. ఏం చేసినా, ట్రంప్‌కి కొందరి మద్దతు గట్టిగానే లభిస్తోంది.
ఇక, ట్రంప్ ప్రత్యర్థి హిల్లరీ తీరు వేరు. ఆమె ఏం చెప్పాలనుకుంటున్నారో దాన్ని స్పష్టంగా చెబుతూ వస్తున్నారు. అయితే, ట్రంప్‌తో పోటీ పడి ఆమె కూడా ఘాటైన వ్యాఖ్యలు చేయక తప్పడంలేదు. 'తన వద్ద పనిచేసే కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించని ట్రంప్ అమెరికాని ఉద్ధరించేస్తాడా.?' అని హిల్లరీ ఈ రోజు చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపుతున్నాయి. జేబులో తుపాకీ పెట్టుకుని తిరిగే ట్రంప్, అమెరికా ప్రజలకు అండగా ఎలా వుంటాడు? అని హిల్లరీ ప్రశ్నించిన తీరూ ఆశ్చర్యకరమే.
మన దేశంలో కాంట్రాక్టర్లకే రాజకీయాల్లో ఎక్కువ చోటు దక్కుతోందన్నది కాదనలేని విషయం. ఎన్నికల వేళ ఈ కాంట్రాక్టర్ల హవా అంతా ఇంతా కాదు. చట్ట సభల్లోనూ వీరు తమ వ్యక్తిగత అవసరాల కోసం తప్ప, ప్రజల సమస్యల కోసం మాట్లాడింది తక్కువ. ఇలాంటి సందర్భాల్లోనే 'కాంట్రాక్టర్లు రాజకీయాల్లోకి వస్తే ఇలాగే వుంటుంది' అన్న వాదన బలపడ్తుంటుంది. హత్యా రాజకీయాల గురించీ, మన దేశంలో విన్పించే రాజకీయ ఆరోపణలే అటు ట్రంప్, ఇటు హిల్లరీ ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు.
ఓవరాల్‌గా చూస్తే అమెరికా అయినా అనకాపల్లి అయినా రాజకీయం రాజకీయమే.! ఎనీ డౌట్స్.? పేరుకి ప్రపంచానికి పెద్దన్న.. రాజకీయం దగ్గరకొచ్చేసరికి అంతా ఆ తానులోని గుడ్డలే. గతంలో అమెరికా అంతర్గత రాజకీయాలు ప్రపంచానికి తెలిసేవి కాదు, ఇప్పుడు తెలుస్తున్నాయంతే.