అమలపాల్.. వివాహానంతరం కూడా యమ బిజీగా ఉన్న హీరోయిన్. తెలుగులో కాదు కానీ, తమిళ, మలయాళీ భాషల్లో మంచి అవకాశాలు ఉన్న దశలోనే అమల వివాహం చేసుకుంది. అది కూడా సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తిని కావడంతో హీరోయిన్ గా ఆమె కెరీర్ కొనసాగించింది. దానికి భర్త ఆమోదం కూడా ఉందని అమల చాలా సార్లు చెప్పింది. వివాహం అయ్యాకా హీరోయిన్లను హీరోలెవరూ పట్టించుకోరు కానీ.. అమల మాత్రం దానికి మినహాయింపుగా నిలిచింది.
ఇలా ఆమె దూసుకుపోతున్న దశలో గత కొన్ని రోజులుగా విడాకుల అంశంపై వార్తల్లోకి వచ్చింది. దాదాపు రెండేళ్ల కిందట వివాహం చేసుకున్న విజయ్, అమలలు విడాకులు తీసుకొంటారని మలయాళీ మీడియా ప్రచారం మొదలుపెట్టింది. దక్షిణాదిన అంతా గుర్తింపు ఉన్న నటి కావడంతో ఈ అంశం అందరికీ ఆసక్తికరమైంది.
ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ విడాకుల వ్యవహారం కొత్త మలుపు తీసుకుంది. ముందుగా గాసిప్ అనుకున్నా.. దీన్ని ధ్రువీకరిస్తున్నట్టుగా వ్యవహరిస్తున్నాడు అమల భర్త. ఈ విషయం గురించి మీడియాతో వివరాలను పంచుకోను అంటూ కటువుగా చెబుతూనే, తను తన తల్లిదండ్రుల మాటకు విలువనిస్తానని అతడు అంటున్నాడు. మరి ఏమిటి కథ.. అని విచారిస్తే, అమల సినిమాల్లో నటించడం విజయ్ తల్లిదండ్రులకు, తోబుట్టువులకు ఏ మాత్రం ఇష్టం లేదట!
ఈ విషయంలో వారు తమ నిర్ణయాలను చెప్పేశారట. అమలను సినిమాల్లో నటించడం మాన్పించమని వారు విజయ్ కు స్పష్టం చేశారట. అమలను ప్రేమించి పెళ్లి చేసుకున్న విజయ్ ఇన్ని రోజులూ ఈ అంశంపై మౌనంగానే ఉన్నా.. ఇప్పుడు సినిమాల్లో నటించడం మానేయమని ఆమెపై ఒత్తిడి తెచ్చాడని సమాచారం. సినిమాల్లో నటించడం మానేయడం ఇష్టం లేని అమల వీరి ఒత్తిడిని భరించలేక దూరం జరిగిందని, విజయ్ ఏమో తన తల్లిదండ్రుల మాటనే పాటిస్తానని అంటున్నాడని.. దీంతో వీరి విడాకులు ఖాయమైనట్టేనని మలయాళీ పత్రికలు పేర్కొంటున్నాయి.