మితిమీరిన షోలు కొంప ముంచుతున్నాయా?

చాలా కాలంగా తెలుగు సినిమా జనాలు అలవాటు చేసుకున్న విషయం ఒకటి వుంది. వీలయినన్ని ఎక్కువ సెంటర్లు, ఎక్కువ థియేటర్లు వేసుకుని, మొదటి మూడు రోజుల్లోనే వీలయినంత రాబట్టేసుకోవడం. కానీ ఇటీవల అదే వికటిస్తోందట.…

చాలా కాలంగా తెలుగు సినిమా జనాలు అలవాటు చేసుకున్న విషయం ఒకటి వుంది. వీలయినన్ని ఎక్కువ సెంటర్లు, ఎక్కువ థియేటర్లు వేసుకుని, మొదటి మూడు రోజుల్లోనే వీలయినంత రాబట్టేసుకోవడం. కానీ ఇటీవల అదే వికటిస్తోందట. సినిమా టాక్ అన్నది తొలి రోజు, తొలి ఆటకే స్ప్రెడ్ తో కావడంతో జనాలు మరి థియేటర్లకు దూరం అవుతున్నారట. దీంతో వచ్చే జనాలు థియేటర్లకు స్ప్రెడ్ అయిపోయి, రెంట్లు వస్తున్నాయి కానీ, షేర్లు అంతంత మాత్రం అవుతున్నాయట. 

పేరుకు షేర్ ఇంత అంత అని చెప్పుకోవడం తప్ప, అసలు నిర్మాతకు, బయ్యర్లకు వస్తున్నది అంతంతమాత్రంగానే వుంటోందట. ఈ విధానం వల్ల థియేటర్ రెంట్లు, ఖర్చులు, పెరిగిపోతున్నాయట. పైగా కమిషన్ మీద ఆడిస్తే, ఖర్చులు పోను, కమిషన్లు కూడా తీసేస్తే ఇక మిగిలింది అంతంత మాత్రంగానే వుంటోందట. 

ఈవారం విడుదలదైన కబాలి ది ఇంకా విచిత్రమైన పరిస్థితి. ఆంధ్రలో పలు చోట్ల, అప్పటికప్పుడు షోలు క్యాన్సిల్ చేసిన సంఘటనలు కూడా వున్నాయని వినిపిస్తోంది. అలాగే సెల్ఫీ రాజా కు నైజాంలో విపరీతంగా థియేటర్లు ఏర్పాటుచేయడం ఆ సినిమా లాభాలకు కన్నంపెట్టినట్లు తెలుస్తోంది. 

మూడు రోజులు దాటి కనీసం మరో మూడు రోజులు మంచి కలెక్షన్లు వుంటనే ఇలా భారీగా థియేటర్లు వేయడం వల్ల కాస్త డబ్బులు కనిపిస్తున్నాయట. అదే వారం రోజుల పాటు అద్దెలు కట్టినా, మూడు రోజులకు మించి కలెక్షన్లు లేకపోతే, అవి వృధా అవుతున్నాయట. అదే కనుక థియేటర్లు ఓ పద్దతిగా వుంటే, రెంట్ల ఖర్చు, ఇతర ఖర్చులు తగ్గి, సినిమా ఏవరేజ్ అయినా కూడా తొలివారం కాస్త మంచి డబ్బులు మిగుల్తాయి అన్న సలహాలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.  

నిజానికి సినిమా బాగులేకుంటే మండే నాడు సినిమాకు రారు, ఈ మూడు రోజుల్లోనే నొల్లేసుకోవచ్చు అన్నది ప్లాన్. కానీ అది కాస్తా ఖర్చులు పెరగడం, టాక్ విన్నాక ప్రేక్షకులు మరి రాకుండా వుండిపోవడం వంటి వాటితో మైనస్ గా మారుతోందట.