జనసేనాని పవన్‌కల్యాణ్ సరిదిద్దుకోలేని తప్పు చేశారా? అంటే …ఔననే సమాధానం వస్తోంది. వైఎస్ జగన్‌ను ఓడించడమే ఏకైక లక్ష్యమని, వైసీపీ వ్యతిరేక ఓట్లను చీల్చనివ్వననే ప్రకటనతో పవన్‌కల్యాణ్ పెద్ద తప్పే చేశారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఈ ప్రకటనతో పవన్‌కల్యాణ్ చులకన అయ్యారని చెప్పొచ్చు. అది ఏ విధంగానో చర్చించుకుందాం.
ముందుగా ఓ పాత సంగతి గురించి చెప్పుకుందాం. 2019లో జనసేన, వైసీపీ పొత్తు కుదుర్చుకుంటాయని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ అది జరగలేదు. వైసీపీ, జనసేన మధ్య పొత్తుపై ఏం జరిగిందని ఒక సందర్భంలో వైసీపీ కీలక వ్యక్తి, ఎమ్మెల్యే కూడా అయిన నాయకుడి వద్ద ప్రస్తావించాను. అప్పుడాయన నాతో చెప్పిన మాటలు యధాతథంగా…
“మా పార్టీతో పొత్తు కోసం పవన్‌కల్యాణ్ ఆసక్తికనబరిచారు. చంద్రబాబు, లోకేశ్‌లపై పవన్ ఆగ్రహంగా ఉన్నరోజులవి. జనసేన ఆవిర్భావ సభలో టీడీపీ పాలన, అలాగే చంద్రబాబు, లోకేశ్‌లపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తానని, తనను నమ్మాలని అంబటి రాంబాబుతో రాయబారం పంపారు ఈ కబురు మా అధినేత జగన్ చెవిన అంబటి రాంబాబు వేశారు.
“అన్నా పవన్‌కు రాజకీయాలు తెలియక అలా చెప్పి పంపారు” అని జగన్ అన్నారు. “చంద్రబాబు, లోకేశ్‌లపై దుమ్మెత్తి పోయినివ్వండి. మనకు మేలే కదా! టీడీపీ పాలనపై తీవ్ర విమర్శలు చేసిన తర్వాత ఇక పవన్‌తో పనేంటి?. పవన్‌తో పొత్తు పెట్టుకోవడం వల్ల మనవాళ్లకు సీట్లు పోతాయ్” అని అంబటితో జగన్ చెప్పి పంపారు. అంతే, ఆ తర్వాత పొత్తుల ఊసేలేదు” అని సదరు నాయకుడు నాతో అన్నారు.
ఇప్పుడు కూడా పవన్ అదే రకమైన తప్పు చేశారని చెప్పక తప్పదు. ఎందుకంటే వైసీపీకి ప్రధాన ప్రత్యర్థి టీడీపీ. అయితే గియితే జగనో లేదా చంద్రబాబో ముఖ్యమంత్రి అవుతారు. పాలను పెరుగ్గా మార్చుకోడానికి కాసిన్ని మజ్జిగను వాడుతారు. అదే విధంగా తన అధికారానికి పవన్‌ను కూడా మజ్జిగలా వాడుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు.
పవన్ పోగొట్టుకోడానికి ఏమీ లేదు. కానీ చంద్రబాబు పరిస్థితి అది కాదు. టీడీపీకి ఏపీలో బలమైన రాజకీయ పునాదులున్నాయి. పార్టీ స్థాపించిన తర్వాత అధిక కాలంలో అధికారంలో వుంది. అధికార రుచి మరిగిన పార్టీ టీడీపీ.
జనసేనాని పవన్‌కల్యాణ్ స్వతంత్ర రాజకీయాలు చేసుకుంటూ ముందుకు వెళ్లి వుంటే, అతనికి డిమాండ్ వుండేది. చంద్రబాబే కాళ్ల బేరానికి వచ్చి వుండేవారు. కానీ ఇప్పుడు చంద్రబాబు కోసం పవన్ వెంపర్లాడుతున్న చందంగా వ్యవహారం తయారైంది. కుక్క తోకను ఆడించడం ఒక లెక్క, అదే తోక కుక్కను ఆడించాలని భావిస్తే… ఇప్పుడు పవన్‌కల్యాణ్ చేయాలని అనుకుంటున్నదదే.
పొత్తు లేకపోతే జన్మలో సీఎం కాలేనని చంద్రబాబు భయపడిపోతున్నారు. మరోసారి జగన్ సీఎం అయితే టీడీపీ మనుగడే ప్రశ్నార్థకమవుతుందని చంద్రబాబు, టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. దీన్ని రాజకీయంగా సొమ్ము చేసుకోవాల్సిన పవన్‌కల్యాణ్, ఆ పని చేయకుండా చేయరాని తప్పులన్నీ చేసేస్తున్నారు.
రాజకీయాల్లో పౌరుషాలుండవని, వ్యూహాలుంటాయని పవన్ చెప్పడం విన్నాం. కానీ తమకు పౌరుషం ఉందని జనసేన నాయకులు, కార్యకర్తలు చెబుతున్నారు. పోనీ పవన్ అద్భుతమైన వ్యూహాలేమైనా రచిస్తున్నారా? అంటే అంతా ఉత్తుత్తిదే.
పవన్‌కు అన్ని తెలివితేటలే వుంటే… పోయిపోయి దృతరాష్ట్ర కౌగిలిలో ఇరుక్కుంటారా? తన పని తాను చేసుకుపోతూ, తాజా రాజకీయ పరిణామాలకు జాగ్రత్తగా గమనిస్తూ, ఎన్నికలకు ఆరు నెలల ముందు వ్యూహాత్మకంగా అడుగులు వేసి వుంటే, పవన్ డిమాండ్ చేసినన్ని సీట్లు టీడీపీ నుంచి దక్కించుకునే అవకాశం ఉండేదేమో. కానీ ఇప్పుడు ఆ అవకాశం ఎంత మాత్రం లేదు.
ఇదే రాజకీయ జ్ఞాని, అజ్ఞానికి మధ్య వున్న తేడా! రాజకీయాల్లో ఆత్మహత్యలే తప్ప, హత్యలుండవంటారు. ఇందుకు ఉదాహరణగా జనసేన చరిత్రను భవిష్యత్ తరాలు చెప్పుకునే అవకాశాన్ని పవన్ కల్పిస్తున్నారు. పవన్‌ను లోకం ఆ విధంగా గుర్తు పెట్టుకుంటుంది మరి!
సొదుం రమణ