క్లీవ్‌లాండ్‌లో సోమవారం ప్రారంభమై గురువారంతో ముగిసిన రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికలలో రిపబ్లికన్ పార్టీ తరఫు అభ్యర్థిగా రియల్ ఎస్టేటు వ్యాపారి, అత్యంత ధనికుడు ఐన డోనాల్డ్ ట్రంప్ పేరు అధికారికంగా ప్రకటించబడింది. ఇది తప్పదని చాలా రోజులుగా అందరూ అనుకుంటున్నా, అతని ఎన్నిక అంత సజావుగా ఏమీ జరగలేదు. సాధారణంగా రాజకీయనాయకులందరూ యించుమించు ఒకలాటి భావాలనే వ్యక్తం చేస్తారు. తమ పార్టీ విధానం మాట ఎలా వున్నా, అధికారంలోకి వస్తే ఎవరికి మేలు చేయబోతున్నా, ఎన్నికలకు ముందు మాత్రం అన్ని వర్గాలకూ ఆమోదయోగ్యంగా వుండేట్లు లౌక్యంగా మాట్లాడతారు. సమాజంలో ఏ ఓటు బ్యాంకునూ దూరం చేసుకోరు. దీన్నే పొలిటికల్లీ కరక్ట్ మెథడ్ అంటారు. కానీ ట్రంప్ ఒక భిన్నమైన నాయకుడు. సాంప్రదాయ రాజకీయాల్లో నలిగినవాడు కాదు. అందువలన ఎలాటి శషభిషలూ లేకుండా కొన్ని దేశాల పట్ల, ఇస్లాం పట్ల, కొన్ని విధానాల పట్ల తన అసహనాన్ని వ్యక్తం చేస్తున్నాడు. అది సాధారణ తెల్లజాతి అమెరికన్‌ను మెప్పిస్తోంది. తమ మనసులోని మాట యీయన పైకి చెప్తున్నాడు అని అతన్ని ఆరాధిస్తున్నారు. తన వివాదాస్పద వ్యాఖ్యలతో ట్రంప్ తనకంటూ ఒక ప్రత్యేకమైన యిమేజిని సృష్టించుకున్నాడు. దాని వలన అతనికి కొన్ని వర్గాల్లో మంచి మద్దతు లభించినా, యితర వర్గాలన్నీ దూరమై పోతాయేమోనని రిపబ్లికన్ పార్టీ నాయకుల భయం. 8 ఏళ్ల డెమోక్రాటిక్ పార్టీ పాలన తర్వాత యీసారి తమకు వస్తున్న అవకాశం ట్రంప్ అతివాద ధోరణి వలన చేజారుతుందేమోనని బెదురు.
నిజానికి ట్రంప్ వ్యక్తం చేస్తున్న భావాలు ఆ నాయకుల్లో చాలామంది గుసగుసలుగా చెప్పుకునేవే. కానీ పైకి అంటే కొంప మునగవచ్చు. ఈ భావాలను సమర్థించేవారి సంఖ్య ఎక్కువా, వ్యతిరేకించేవారి సంఖ్య ఎక్కువా అన్నది నవంబరులో జరగబోయే ఎన్నికలో తప్ప తెలియదు. ఇలాటి పరిస్థితిలో యింత ఘాటుగా మాట్లాడడం రిస్కే కదా. గతంలో అంటే 1964 అధ్యక్ష ఎన్నికలలో బారీ గోల్డ్‌వాటర్ అనే రిపబ్లికన్ అభ్యర్థి పౌరహక్కులకై పోరాడుతున్న ఆఫ్రో అమెరికన్లకు వ్యతిరేకంగా మాట్లాడాడు. అతను ఘోరంగా ఓడిపోవడమే కాక, అప్పణ్నుంచి ఆ వర్గం రిపబ్లికన్లకు ఓటేయడం మానేసింది. ఇప్పుడు ట్రంప్ కారణంగా కొన్ని జాతుల వారు దూరమై పోతే, వాళ్లను మళ్లీ తమవైపు తిప్పుకోవడం యిప్పట్లో సాధ్యం కాదు కాబట్టి ట్రంప్ ఎన్నికను ఆపుదామని రిపబ్లికన్ నాయకులు కొందరు గట్టిగా ప్రయత్నించారు కానీ సాధ్యపడలేదు.
రిపబ్లికన్ జాతీయ సమావేశంలో 50,000 మంది పాల్గొన్నారు. 1543 మంది డెలిగేట్లు ట్రంప్ పక్షాన నిలిచారు. వారిలో కొందరు ప్రసంగించడం, అధికసంఖ్యాకులు బలపరచడం, ట్రంప్ ఆమోదోపన్యాసం అన్నీ పూర్తయ్యాయి. రిపబ్లికన్ పార్టీలో ట్రంప్‌ను వ్యతిరేకించేవారిలో మాజీ అధ్యక్షుడు జార్జి బుష్, అతని సోదరుడు మాజీ గవర్నరు జెబ్ బుష్, కితం ఎన్నికలో ఒబామాతో పోటీ పడిన మిట్ రోమ్నీ, జాన్ మెక్‌కేన్ వున్నారు. వారు సమావేశానికి హాజరు కాలేదు. దాంతో ట్రంప్ భార్య, కొడుకు, కూతురు, స్నేహితులు వక్తలుగా ముందుకు వచ్చి అతన్ని ఆకాశానికి ఎత్తేశారు. అతని కొడుకు డోనాల్డ్ ట్రంప్ జూనియర్ తన తండ్రి ఎంత కష్టపడి పైకి వచ్చాడో చెప్పాడు. ''తను బిల్డింగులు కట్టించినప్పుడు కార్మికులతో బాటు పక్కన నిలబడి కాంక్రీటు మిక్స్ కలిపాడు. వాళ్లతో మాటలు కలిపి, వారి సాధకబాధకాలు విన్నాడు. సామాన్యుడి ఆలోచనా ధోరణి హార్వార్డ్, వార్టన్ యూనివర్శిటీలో చదివిన మేధావుల కంటె ఆయనకే ఎక్కువగా తెలుసు.'' అన్నాడు. అతని చిన్న కూతురు టిఫనీ, పెద్ద కూతురు, వ్యాపారవేత్త అయిన ఇవాంకా యిద్దరూ తమ తండ్రి లాటి అనురాగమూర్తిని ఎవరూ లేరని, అతనికి కూతుళ్లగా పుట్టడం తమ అదృష్టమనీ చెప్పారు. అతని వైన్ తయారీ సంస్థలో మేనేజరుగా పనిచేసే కెర్రీ వూలార్డ్ ''ట్రంప్ ఒక ద్రష్ట, ఒక స్వాప్నికుడు, ఎవరి కంట పడని సూక్ష్మాంశాలెన్నో గమనించగల ఘనుడు'' అని శ్లాఘించాడు.
రెండో రోజు రిపబ్లికన్ పార్టీలో సీనియర్లు చాలామంది ట్రంప్‌ను కొద్దిగా మెచ్చుకుంటూ హిల్లరీ క్లింటన్‌ని తిట్టిపోశారు. 'ఆమెను ఎన్నుకుంటే ఒబామాను మూడోసారి ఎన్నుకున్నట్టే, ఇప్పటికే అమెరికాలో భద్రత కరువైంది, బయటి దేశాలలో మన పరువు పోయింది. అదే పద్ధతి కొనసాగుతుంది' అంటూ ప్రసంగించారు. వీరిలో కొందరు ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలపై తమ అభిప్రాయాలు వెలిబుచ్చకుండా హిల్లరీని విమర్శించడం ద్వారా అతనికి మద్దతు తెలిపారు. అంతకు ముందు రోజు ట్రంప్ భార్య మెలానియా యిచ్చిన ఉపన్యాసంలో గతంలో ఒబామా భార్య ప్రసంగంలోని కొన్ని వాక్యాలు రిపీటయ్యాయి. దాంతో కాపీ కొట్టిందని విమర్శలు వచ్చాయి. ఈ సమావేశంలో ఆ ఉపన్యాసం రాసిన అసిస్టెంటు మెరెడిత్ ముందుకు వచ్చి ''ఆ పొరపాటు నాదే, మిషెల్లిపై అభిమానం వలన ఆమె భావాలు నా వాక్యాల్లో చొరబడ్డాయి'' అని చెప్పుకుంది. వీరందరితో బాటు లిబియాలో అమెరికా తరఫున పోరాడి ప్రాణాలు పోగొట్టుకున్న వారి బంధువులు, అమెరికాలో అక్రమంగా వలసవచ్చినవారి చేతిలో హతులైన వారి కుటుంబసభ్యులు కూడా మాట్లాడారు. డెమోక్రాటిక్ పార్టీ అవలంబించిన విదేశాంగ విధానం వలన అమెరికా ప్రతిష్ఠ మట్టిలో కలిసిందని, అమెరికన్లు లోకువై పోయారని, అందుకే తన నినాదం 'మేక్ అమెరికా గ్రేట్ ఎగేన్' అని ట్రంప్ వాదన. ఐసిస్ పుట్టి పెరగడానికి, ఈజిప్టులో, సిరియాలో, ఇరాక్‌లో అశాంతి నెలకొనడానికి, అమెరికా సైన్యం అక్కడకు వెళ్లి చావుదెబ్బలు తినడానికి ఒబామా పాలనలో విదేశాంగ వ్యవహారాలు చూసిన హిల్లరీ కూడా యీ వైఫల్యాలకు బాధ్యత వహించాలని, తన అభ్యర్థిత్వాన్ని ఆమోదిస్తూ యిచ్చిన ఉపన్యాసంలో ట్రంప్ చెప్పాడు. రేపు అమెరికా ఓటర్లకు కూడా యిదే చెప్పి హిల్లరీని ఓడిస్తానని అతని ధీమా. దానికి రిహార్సల్‌గానే విదేశీ యుద్ధాలలో మరణించిన అమెరికన్ సైనికుల కుటుంబాల చేత ఉపన్యాసాలు యిప్పిస్తున్నాడు.
సీనియర్ రిపబ్లికన్ నాయకులు గ్రహించిన సత్యం ఒకటుంది – బీదవాళ్లలో, తెల్లవాళ్లలో, కాలేజీ డిగ్రీ వరకు చదవనివారిలో, బ్లూ కాలర్ వర్కర్లలో, క్రైస్తవాన్ని శ్రద్ధగా అవలంబించేవారిలో ట్రంప్‌కు ఆకర్షణ వుంది. ఇది ఏ మేరకు పార్టీకి మేలు చేస్తుంది అన్న విషయమే తెలియటం లేదు. మిట్ రోమ్నీ 2012లో ఒబామాకు ప్రత్యర్థిగా రిపబ్లికన్ పార్టీ తరఫున నిలబడ్డాడు. రిపబ్లికన్ పార్టీ అబార్షన్లకు, మహిళల హక్కులకు, స్వలింగ సంపర్కులకు వ్యతిరేకమనే భావన వుంది. ఈ కారణం చేత ఆ ఎన్నికలో మహిళలు డెమోక్రాటిక్ పార్టీకి హెచ్చుగా ఓటేయడంతో రోమ్నీ ఓడిపోయాడు. ఇప్పుడు యివే విషయాలపై ట్రంప్ మరింత ఘాటుగా మాట్లాడి, పార్టీకి ఆడవాళ్లను మరింత దూరం చేస్తాడని రోమ్నీ అభ్యంతరం. నాలుగు నెలల క్రితం ట్రంప్ అభ్యర్థిత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడానికి అతను యూటా యూనివర్శిటీలోని హింక్లీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పాలిటిక్స్‌కి వెళ్లి ట్రంప్‌ను తీసిపారేస్తూ ప్రసంగించాడు. ''అతనొక బోగస్, ఓ ఫ్రాడ్. ట్రంప్ యూనివర్శిటీలో పట్టాకు ఎంత విలువ వుందో అతని వాగ్దానాలకు కూడా అంతే విలువుంది. ఏవేవో కబుర్లు చెప్పి, మనకు టోపీ వేసి, అతను వైట్‌హౌస్‌కు చెక్కేస్తాడు. మనకు మిగిలేది టోపీ మాత్రమే'' అని ఘాటుగా మాట్లాడాడు. టోపీ ప్రస్తావన ఎందుకంటే ట్రంప్ ఎన్నికల ర్యాలీలలో కార్యకర్తలందరూ విధిగా ''మేక్ అమెరికా గ్రేట్ ఎగేన్'' అని రాసి వున్న ఎఱ్ఱ టోపీలు ధరిస్తున్నారు. 700 మంది వున్న ఆ సభలో ముప్పాతిక శాతం మంది ఆ టోపీలే వేసుకుని కూర్చున్నారు. ఈ ఉపన్యాసం తర్వాత ట్రంప్ కెంటుకీ, లూసియానా రాష్ట్రాల ప్రైమరీల్లో నెగ్గాడు. దాన్ని బట్టే తెలుస్తుంది – రిపబ్లికన్ నాయకులు ప్రజల నాడిని పట్టుకోలేక పోయారని, ట్రంప్ పట్టుకున్నాడని! రోమ్నీ ఉపన్యాసం తర్వాత ట్రంప్ అతన్ని హేళన చేశాడు – ''విఫలమైన యీ నాయకుడు పార్టీలో సాటి నాయకుణ్ని ఎలా దిగజారుస్తున్నాడో చూడండి.'' అని.
ట్రంప్‌ను తీవ్రంగా దూషించేవారిలో టెడ్ క్రూజ్ ఒకడు. అతను రిపబ్లికన్‌లలో అతివాద రైట్ వింగ్ (టీ పార్టీ సెక్షన్ అంటారు)కు చెందినవాడు. అతనికి మతఛాందసత్వం వుంది, ముస్లిములను దేశంలోకి రానీయకూడదని, ఇస్లామిక్ టెర్రరిజం వున్న ఇరాక్, సిరియాలపై బాంబుల వర్షం కురిపించి, వాటిని తుడిచిపెట్టేయాలని, మెక్సికన్లను రానీయకుండా గోడ కట్టాలని – వాదించడంలో ట్రంప్ కంటె నాలుగాకులు ఎక్కువ చదివాడు. 12 రాష్ట్రాలలో ప్రైమరీలలో నెగ్గాడు. తన భావజాలానికి చెందినవాడే కాబట్టి తొలిదశలో అంటే ఏడాది క్రితం అతను ట్రంప్‌తో సఖ్యంగా వుందామని చూశాడు. తక్కిన రిపబ్లికన్ అభ్యర్థులు ట్రంప్ పద్ధతులను నిరసిస్తున్నపుడు ''అతను ధైర్యవంతుడు, ఉన్నదున్నట్టు చెప్తున్నాడు. ప్రస్తుత ప్రభుత్వాన్ని తూర్పారబడుతున్నాడు.'' అని మెచ్చుకున్నాడు. అలా అంటే అతను పోటీలోంచి తప్పుకుంటాడేమోనని ఆశపడ్డాడు. కానీ క్రమేటీ ట్రంప్ బలపడి తననే వెనక్కి నెట్టడంతో శత్రువుగా మారాడు. పార్టీ అతన్ని అభ్యర్థిగా నిలబెట్టడానికి వీల్లేదని పెద్ద ఉద్యమమే చేశాడు. ఇద్దరూ వ్యక్తిగతంగా కూడా తిట్టుకున్నారు. పార్టీలో అతనిపై విమర్శలు కురిసిన కొద్దీ, సీనియర్లు అడ్డుకున్నకొద్దీ కొద్దీ ట్రంప్ బలపడుతూ వచ్చాడు, పైకి ఎదుగుతూ వచ్చాడు. ఇది టెడ్‌ను మరింత మండించింది. క్లీవ్‌లాండ్ సమావేశంలో ట్రంప్‌ను పార్టీ అభ్యర్థిగా నామినేట్ చేసిన తర్వాత యిచ్చిన ఉపన్యాసంలో అతను ట్రంప్‌కు అభినందనలు తెలపడంతో సరిపెట్టి, అతని అభ్యర్థిత్వాన్ని ఆమోదించినట్లు ప్రకటించకుండా ఓటర్లను తమ మనస్సాక్షిగా అనుగుణంగా ఓటేయమని విజ్ఞప్తి చేశాడు. ఇది సభలో వున్నవారిని మండించింది. 'వి వాంట్ ట్రంప్', 'వి వాంట్ ట్రంప్' నినాదాలతో హోరెత్తించారు. ఇది భరించలేక టెడ్ వేదిక దిగి వెళ్లిపోతూ వుంటే, అతన్ని పిల్లికూతలతో వెక్కిరించారు. అదే సభలో వున్న అతని భార్య హైదీని కూడా హేళన చేయడం మొదలెట్టడంతో సెక్యూరిటీవారు వచ్చి ఆమెను బయటకు తీసుకెళ్లారు.
ఈ విధంగా ట్రంప్ అన్ని అవరోధాలను దాటుకుని, పార్టీలోని ప్రత్యర్థుల పీచమణచి, అధికారికంగా అభ్యర్థిగా ప్రకటించబడ్డాడు. దీనికి కారణం – అతనికి ప్రజాదరణ పెరిగిందని పార్టీ గుర్తించడం. ట్రంప్ వంటి వాచాలుడికి అమెరికన్ ప్రజలలో యింత ఆదరణ ఎలా పెరిగింది అనే విషయాన్ని యింకో వ్యాసంలో చర్చిద్దాం. ట్రంప్ అతివాద ధోరణి పార్టీకి మేలు చేస్తుందా, కీడు చేస్తుందా, అది పార్టీకి ట్రంప్ కార్డుగా మారుతుందా, లేక పార్టీని మరో నాలుగేళ్ల పాటు డంప్ చేస్తుందా అనేది నవంబరులోనే తెలుస్తుంది.
– ఎమ్బీయస్ ప్రసాద్ (జులై 2016)