ఎమ్బీయస్‌: షీలా దీక్షిత్‌ బ్రాహ్మణ్యం

2017 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెసు తరఫు ముఖ్యమంత్రి అభ్యర్థిగా షీలా దీక్షిత్‌ను ఎంపిక చేశారు. ఎందుకు చేశారో ఎవరికీ అర్థం కావటం లేదు. ఆవిడ 78 ఏళ్ల వయోధికురాలు. ఢిల్లీలో రెండు దఫాలు ముఖ్యమంత్రిగా…

2017 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెసు తరఫు ముఖ్యమంత్రి అభ్యర్థిగా షీలా దీక్షిత్‌ను ఎంపిక చేశారు. ఎందుకు చేశారో ఎవరికీ అర్థం కావటం లేదు. ఆవిడ 78 ఏళ్ల వయోధికురాలు. ఢిల్లీలో రెండు దఫాలు ముఖ్యమంత్రిగా దక్షతతో పాలించినా మూడో దఫాలో కామన్‌వెల్త్‌ గేమ్స్‌ అవినీతి వంటి పెద్ద స్కాముల్లో యిరుక్కుంది. పరిపాలన కూడా కుంటుపడి, ఢిల్లీ ఎసెంబ్లీ ఎన్నికలలో వరుసగా రెండుసార్లు కాంగ్రెసు ఓడిపోయింది. పైగా ఆవిడకు ఎన్నికలలో దిగాలన్న కోరిక ఏ మాత్రం వ్యక్తం చేయలేదు. ఢిల్లీ వంటి అర్ధరాష్ట్రంలోనే దెబ్బ తిన్న వ్యక్తికి యుపి వంటి పెద్ద రాష్ట్రాన్ని పాలించమంటే పాలించగలదా? ఇవేమీ లెక్కలోకి తీసుకోలేదు. బ్రాహ్మణ ఓట్లపై కాంగ్రెసు కన్నేసింది కాబట్టి ఆవిడను నిల్చోబెట్టింది అని కొన్ని పత్రికలు రాస్తున్నాయి. షీలా బ్రాహ్మణి ఎలా అయిందో నాకు అర్థం కావటం లేదు. పుట్టుక చేత ఆవిడ పంజాబీ ఖత్రి (క్షత్రియ). బ్రాహ్మణుడైన ఉమాశంకర్‌ దీక్షిత్‌ కుమారుడు, ఐయేయస్‌ అధికారి వినోద్‌ దీక్షిత్‌ను పెళ్లాడింది కాబట్టి కపూర్‌ అనే యింటి పేరు మారి దీక్షిత్‌ వచ్చి చేరింది. అంతే! 

హిందూ సమాజంలో పెళ్లి వలన కులం మారుతుందా? షీలా పిల్లలు సగం బ్రాహ్మణ-సగం క్షత్రియ అవుతారు. క్షేత్రాన్నో, బీజాన్నో లెక్కలోకి తీసుకుని తమను తాము బ్రాహ్మణగానో, క్షత్రియగానో చెప్పుకోవచ్చు. భర్త బ్రాహ్మణుడు, అల్లుడు ముస్లిం అయినంత మాత్రాన షీలా బ్రాహ్మణియో, ముస్లిమో అయిపోతుందా? ఇందిరా గాంధీ బ్రాహ్మణి. ఆమె భర్త పార్శీ. రాజీవ్‌ గాంధీ సగం బ్రాహ్మణుడు. కానీ ఆయన బీజాన్ని ప్రధానంగా లెక్కించి తను పార్శీ అని చెప్పుకున్నాడు. ఆయన కూతురు ప్రియాంకలో పావు బ్రాహ్మణత్వం వుంది. పావు పార్శీ, సగం క్రైస్తవం వుంది. ఆమెను ముఖ్యమంత్రి అభ్యర్థినిగా తీసుకుని వస్తారు అన్నపుడు కూడా బ్రాహ్మణ ఓటర్లను దృష్టిలో పెట్టుకుని.. అని మీడియా రాసింది. అది ఎలా పొసుగుతుందో నాకు అర్థం కాదు. బ్రాహ్మణులను ఆకట్టుకోవాలనే లెక్కతోనే బిజెపి వరుణ్‌ గాంధీని ముందుకు తెద్దామా అని చూస్తోంది.. అని కూడా మీడియా రాసింది. వరుణ్‌ గాంధీ తండ్రి సగం బ్రాహ్మణుడు, తల్లి సిఖ్కు. అందుచేత వరుణ్‌ కూడా పావు బ్రాహ్మణుడే. అతణ్ని బ్రాహ్మణ అభ్యర్థిగా ఎలా చూపిస్తారు? చూపిస్తే నమ్ముతారా?

ఎందుకీ కులాల గోల? అంటే కాంగ్రెసుకు సలహాదారుడిగా చేరిన ప్రశాంత్‌ కిశోర్‌ కూడికలు, తీసివేతలు వేసి చూసి కాంగ్రెసు పక్షాన బ్రాహ్మణ అభ్యర్థి వుండి తీరాలని చెప్పాడట. అలా ఎందుకంటే – తక్కిన పార్టీలన్నీ కూడా కులాలవారీ లెక్కలే వేస్తోంది కాబట్టి! బియస్పీ దళిత పార్టీ. బ్రాహ్మణులతో చేతులు కలిపినప్పుడు నెగ్గి అధికారంలోకి వచ్చింది. సమాజ్‌వాదీ పార్టీ బిసిల, ముఖ్యంగా యాదవుల పార్టీ. వీళ్లిద్దరూ ముస్లిములను దువ్వుదామని ప్రయత్నిస్తున్నారు కానీ వాళ్లు ఎటు మొగ్గు చూపుతారో ఎవరికీ తెలియటం లేదు. ముస్లిములను బుజ్జగించవలసిన అవసరం లేని పార్టీ బిజెపి. ఏదో రకంగా అన్ని కులాల హిందూ ఓట్లను సంఘటితం చేయగలిగితే తనకు ఎదురు వుండదని బిజెపి లెక్క. 2014 పార్లమెంటు ఎన్నికలలో బిజెపి ఘనవిజయం సాధించింది. ఇందిర హత్య తర్వాత 1984లో రాజీవ్‌ గాంధీ 85 పార్లమెంటు సీట్లలో 83 గెలిచాడు. ఆ తర్వాతి రికార్డు బిజెపిదే. 42% ఓట్లతో 80 సీట్లలో 71 గెలిచింది. అయితే అప్పుడు కులప్రస్తావన కంటె 'వికాస్‌' (అభివృద్ధి) అనే నినాదమే ఎక్కువగా వాడారు. మోదీ వస్తే దేశాభివృద్ధికి లోటు వుండదని ప్రజలను నమ్మకం కలిగించారు. 

పదవీకాలంలో సగం పూర్తయ్యాక అభివృద్ధి నినాదంతో ఆకట్టుకోవాలని చూస్తే ఓట్లు రాలవని భయం పట్టుకుంది. ఎందుకంటే యుపిలో కరువు తాండవించి, పంటలు విఫలమయ్యాయి. మోదీ నడిపే కేంద్రప్రభుత్వం నుంచి తగినంత సాయం రాలేదు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ పెరగలేదు, వ్యవసాయరంగంలో ఉద్యోగాలు, పరిశ్రమలు పెరగలేదు. రెండేళ్లగా రైతుల జీవితాలలో వికాసం జరగలేదు. పైగా అప్పుడు మోదీ అభ్యర్థి, కాంగ్రెసు వ్యతిరేకత తారాస్థాయిలో వుంది. ఇప్పుడు పరిస్థితి సాధారణ స్థితికి వచ్చింది. ఏ రకమైన వేవ్‌ గోచరించటం లేదు. అందుచేత దశాబ్దాలుగా నమ్ముకున్న కులసమీకరణాలతోనే అందరూ ముందుకు సాగుతున్నారు. నిజానికి ఘనవిజయం సాధించిన తర్వాత బిజెపి యుపిలో తన పార్టీ వ్యవస్థను బలోపేతం చేసుకోలేదు. ఇతర రాష్ట్రాల ఎన్నికలలో బిజీగా వుండిపోయింది. హిందూమతానికి సంబంధించిన విషయాలలో కొందరు చురుగ్గా వుండి వివాదాలు కొని తెచ్చుకున్నారు తప్ప ప్రజాందోళనలు చేపట్టలేదు. ఇప్పుడు అమిత్‌ షా యుపిపై దృష్టి సారించడంతో యిక హడావుడి ప్రారంభమైంది. 

ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవర్ని ప్రకటించడం అనే విషయంపై బిజెపి యింకా ఎటూ తేల్చుకోలేదు. ముందే ప్రకటించడం కొన్ని రాష్ట్రాలలో మేలు చేసింది, మరి కొన్నివాటిల్లో కీడు చేసింది. స్మృతి ఇరానీని ప్రకటిద్దామా అన్న ఆలోచన వచ్చి, ఢిల్లీలో కిరణ్‌ బేదీ వ్యవహారంలా తయారవుతుందేమోనని దడిశారట. వరుణ్‌ గాంధీని చేయమని మేనకా అడుగుతోందట కానీ అతనికి అతివాద హిందూ యిమేజి వుంది. మొహంపై చిరునవ్వు కనబడదు, జనంలోకి దూసుకుని వెళ్లే అలవాటు లేదు. కజిన్‌ రాహుల్‌ గాంధీ కంటె చాలా రెట్లు మెరుగే కానీ యుపిలాటి పెద్ద రాష్ట్రంలో నెగ్గుకు రాగలడన్న నమ్మకం చాలటం లేదు. 2002లో ముఖ్యమంత్రిగా దిగిపోయిన రాజనాథ్‌ సింగ్‌ కూడా బిజెపి ఆలోచనలో వున్నాడట. ఏది ఏమైనా 17% ఓట్లున్న అగ్రవర్ణాలను (బ్రాహ్మణ, రాజపుత్ర, వైశ్య) ఆకట్టుకునే ప్రయత్నంలోనే బిజెపి పడింది. వారిని పూర్తిగాను, బిసిలను కొంతవరకు తమ వద్దకు తెచ్చుకుంటే గెలుపు  సులభం. ఎందుకంటే నాలుగు పార్టీలు ఓట్లను పంచుకోబోతున్నాయి. ఎవరూ వేరేవారితో పొత్తు పెట్టుకునేట్లు లేరు. మాయావతికి అవినీతి మచ్చ, ములాయంకు శాంతిభద్రతల మచ్చ, కాంగ్రెసుకు నాయకత్వ లేమి. 27 ఏళ్లగా గద్దెకు దూరంగా వుండి క్యాడర్‌ కూడా చెదిరిపోయింది. 

అందువలన బిజెపికి మంచి అవకాశం వుంది. దాన్ని వినియోగించుకోవాలంటే సరైన పాళ్లు కుదరాలి. 1998 ఎన్నికలలో రామ మందిరం కడతామనే హామీతో 85లో 57 సీట్లు తెచ్చుకున్నాం కాబట్టి దాన్ని మళ్లీ లేవనెత్తాలని ఆరెస్సెస్‌ పట్టుబడుతున్నా బిజెపికి ధైర్యం చాలటం లేదు. దానికి బదులుగా ముస్లిం బూచిని చూపించి, అన్ని వర్ణాల హిందువులను కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు.  2013 ముజఫూర్‌పూర్‌ అల్లర్లలో నిందితుడు, బిజెపి ఎంపీ అయిన హుకుమ్‌ సింగ్‌ యిటీవల శామిలీ జిల్లాలోని కైరానా నుంచి 346 మంది హిందువులు, ముస్లిము గూండాలు బెదిరించడంతో వూరు వదిలి పారిపోయారని, అఖిలేశ్‌ ప్రభుత్వం వారికి రక్షణ కల్పించలేకపోయిందని ఆరోపిస్తూ వారి పేర్లతో జాబితా విడుదల చేశాడు. ఆ జాబితాను క్షుణ్ణంగా పరిశీలిస్తే తేలిందేమిటంటే – వారిలో కొందరు చచ్చిపోయి చాలాకాలమైంది, కొందరు చదువు కోసమో, ఉద్యోగాల కోసమో వూరు వదిలి వెళ్లారు. అయినా జూన్‌ 13 నాటి ర్యాలీలో అమిత్‌ షా ఆ ఆరోపణను పునరుద్ఘాటించాడు. ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ యిలాటి ట్రిక్కులు పెరగవచ్చు. ప్రస్తుతానికి బిజెపి దళిత-కూర్మీ-బ్రాహ్మణ కూటమి ఏర్పరచడానికి చూస్తోందిట. మోదీని బిసిగా చూపించి, బిసిల మద్దతు సంపాదించవచ్చు.

గుజరాత్‌లో గోరక్షణ పేరుతో దళితులపై జరిగిన దాడి పార్లమెంటులో చర్చకు వచ్చిన రోజే, మాయావతి గురించి ఓ బిజెపి నాయకుడు అనుచిత వ్యాఖ్య చేయడంతో అతనిపై వెంటనే చర్య తీసుకుని, దళిత వ్యతిరేకతను తమ పార్టీ సహించదని బిజెపి చూపుకునే ప్రయత్నం చేసింది. ముస్లిములపై అనుచిత వ్యాఖ్యలు చేసినవారిని మాత్రం ఏ పదవుల్లోంచి తీసివేయలేదు. ఎందుకంటే యుపిలో గెలవాలంటే దళిత ఓట్లు ముఖ్యం. కాంగ్రెసుకు అన్ని కులాల నుంచి కొద్దికొద్ది ఓట్లు పడతాయి తప్ప ఏ కులమూ పూర్తిగా కాంగ్రెసుకు ఓటేయడం లేదు. ఈ పరిస్థితిని చక్కదిద్దమనే ప్రశాంత్‌ కిశోర్‌ను పిల్చుకుని వచ్చారు. అందర్నీ సంతృప్తి పరుస్తూనే ఏదో ఒక కులాన్ని గట్టిగా పట్టుకోవాలని అన్నాట్ట. మెజారిటీ బిసిలు ఎస్పీకు, మెజారిటీ దళితులు బియస్పీకు వేస్తారు కాబట్టి అగ్రవర్ణాల ఓట్ల కోసం బిజెపి, కాంగ్రెసు పోటీ పడాలి. వాటి మద్దతు వున్నంతకాలం కాంగ్రెసు గెలుస్తూ వచ్చింది. వాళ్లెప్పుడైతే బిజెపివైపు తిరిగిపోయారో అప్పణ్నుంచి కాంగ్రెసుకు పతనం ప్రారంభమైంది. ఇప్పుడు మళ్లీ వాళ్లను తిప్పుకోవాలంటే బ్రాహ్మణ అభ్యర్థి వుంటే బెటరని ప్రశాంత్‌ అన్నాడట.

ప్రియాంకా గాంధీని రాజకీయాల్లోకి ఫుల్‌ స్కేలులో తీసుకుని వచ్చి ముఖ్యమంత్రి అభ్యర్థిగా చూపుతారంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. 2002లో అమేఠీ, రాయబరేలీ బెల్టులో వున్న 10 నియోజకవర్గాల్లో కాంగ్రెసుకు 3 వుండేవి. 2004లో ఆమె ప్రచారం చేసినప్పుడు రాహుల్‌, సోనియా యిద్దరూ నెగ్గారు. 2007 అసెంబ్లీ ఎన్నికలలో 10టిలో 7 నియోజకవర్గాల్లో కాంగ్రెసు గెలిచింది. 2012 వచ్చేసరికి ప్రియాంకా అంటే ఓటర్లకు మొహం మొత్తింది. ఎంతసేపూ తమ కుటుంబం ఎంత గొప్పదో చెప్పుకునేసరికి చాల్లే అని 10టిలో 2 గెలిపించి సరిపెట్టారు. 2014 వచ్చేసరికి యింకా దిగజారింది. రాహుల్‌ గాంధీ తన ప్రత్యర్థి స్మృతి ఇరానీ కంటె తొలిదశలో వెనకబడి, చివరకు చచ్చీచెడి గెలిచాడు. ఆమె ప్రచారానికి వస్తే జనాలు చూడడానికి వస్తున్నారు తప్ప వినడానికి రావడం లేదన్న సంగతి అర్థమై, సరైన ముఖ్యమంత్రి అభ్యర్థి కోసం వెతికారు. చివరకు షీలా దీక్షిత్‌ను ఒప్పించారు. ఇంటిపేరు బట్టి బ్రాహ్మణిగాను, పుట్టుకబట్టి క్షత్రియ గానూ చూపించి రెండు అగ్రవర్ణాలను ఆకర్షిస్తారేమో!

ఆమెతో బాటు కాంగ్రెసు రాష్ట్ర అధ్యక్షుడిగా సినిమా నటుడు రాజ్‌ బబ్బర్‌ను తీసుకుని వచ్చారు. అతను ఆగ్రాకు చెందిన వాడే అయినా ప్రస్తుతం ఉత్తరాఖండ్‌ నుంచి రాజ్యసభ ఎంపీగా వున్నాడు. పార్టీ వ్యవస్థతో పెద్దగా సంబంధం లేని అతన్ని ఎంపిక చేయడానికి కారణం అందరికీ తెలిసున్న మొహం కావడం. రెండు బిసి వర్గానికి (కంసాలి కులానికి) చెందినవాడు కాబట్టి బిసిలను ఆకట్టుకోవడం. అతను తన రాజకీయజీవితాన్ని బిసి పార్టీ ఐన ఎస్పీతో ప్రారంభించాడు. 1999లో, 2004లో రెండు సార్లు ఎంపీగా గెలిచాడు. అమర్‌ సింగ్‌తో విభేదించి 2006లో బయటకు వచ్చేసి, రెండేళ్ల తర్వాత కాంగ్రెసులో చేరి, 2009లో ఫిరోజాబాద్‌ ఉపయెన్నికలో అఖిలేశ్‌ భార్య డింపుల్‌కు వ్యతిరేకంగా నిలబడ్డాడు. రాహుల్‌ వచ్చి ప్రచారం చేశాడు.  బబ్బర్‌ 85 వేల మెజారిటీతో నెగ్గాడు. కానీ 2014లో  ఘజియాబాద్‌ నుంచి పోటీ చేసి బిజెపి అభ్యర్థి  వికె సింగ్‌ చేతిలో ఓడిపోయాడు. పార్టీలో అతను ఏ గ్రూపుకూ చెందడు. పార్టీ వర్కర్లతో కూడా సన్నిహితంగా మెలగడు. అతని పని వూరూరూ తిరిగి ప్రచారం చేయడమే.  షీలా దీక్షిత్‌ కూడా తిరగాల్సి వుంటుంది. ఈ వయసులో ఎంతవరకు తిరగగలదో చూడాలి. ఢిల్లీ అయితే చిన్నది. నగరం కాబట్టి కొన్ని సౌకర్యాలుంటాయి. యుపి అయితే నగరాలు, పట్టణాలు అంతంత మాత్రం. ఇక గ్రామాలైతే చెప్పనక్కరలేదు. అమితాబ్‌ ఎన్నికలలో నిలబడినప్పుడు ప్రచారానికి పల్లెటూళ్లలో తిరిగి నానా అవస్థా పడ్డాడు. మళ్లీ ఎప్పుడూ లోకసభకు నిలబడలేదు. షీలా దీక్షిత్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా చూపి కాంగ్రెసు ఏం బావుకుంటుందో ఫలితాలు వస్తే తప్ప చెప్పలేం.

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జులై 2016)

[email protected]