శరద్ మురార్ కు ముట్టింది అంతేనా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు అత్యంత ఆప్తుడు శరద్ మురార్. గోపాల గోపాల సినిమాలో భాగస్వామిగా, సర్దార్ గబ్బర్ సింగ్ కు పూర్తి నిర్మాతగా ఆయనే వ్యవహరించారు. ఆ సినిమాలో మంచి లాభాలు…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు అత్యంత ఆప్తుడు శరద్ మురార్. గోపాల గోపాల సినిమాలో భాగస్వామిగా, సర్దార్ గబ్బర్ సింగ్ కు పూర్తి నిర్మాతగా ఆయనే వ్యవహరించారు. ఆ సినిమాలో మంచి లాభాలు చేసుకున్నారని వార్తలు వున్నాయి. లేదు సర్దార్ సినిమా కారణంగా నష్టపోయారనీ వార్తలు వున్నాయి. 

సర్దార్ సినిమా కారణంగా తన మిత్రుడు శరద్ మురార్ నష్టపోయారని, అందుకే ఆయనకే మరో సినిమా చేయాల్సి వుందని అప్పట్లో కొన్ని మీడియా సంస్థలకు ఇంటర్వూలు ఇచ్చినపుడు పవన్ చెప్పారు కూడా.  నిజానికి సర్దార్ వల్ల నష్టపోయింది బయ్యర్లే కానీ, శరద్ ఎలా అవుతారని చాలా మంది అనుకున్నారు కూడా. 

ఎందుకంటే నో రిటర్న్ అనే కచ్చితమైన బేసిస్ మీద అమ్మకాలు సాగించారు ఆ సినిమాను. సర్దార్ కావచ్చు, ఇప్పుడుచేయబోయే సినిమా కావచ్చు, మేకింగ్ లో చాలా ఆలస్యం అనివార్యమవుతోంది. పవన్ ఆయన అనుకున్నపుడే సినిమా చేస్తున్నారు. శరద్ మురార్ జస్ట్ వెయిట్ అండ్ సీ అన్నట్లు వుంటున్నారు.  దీనంతటి వెనుక ఇండస్ట్రీలో భలే గుసగుసలు వినిపిస్తున్నాయి. 

శరద్ మురార్ రికార్డుల ప్రకారం నిర్మాతే కానీ, అసలు నిర్మాత పవన్ నే అని ఆ గుసగుసల సారాంశం. గోపాల గోపాలకు మూడు కోట్లు, సర్దార్ సినిమాకు ఏడు కోట్లు నిర్మాతగా వ్యవహరించినందుకు పారితోషికంగా శరద్ కు పవన్ అందించారని, మిగిలిన లాభ నష్టాలన్నీ పవన్ వే అన్నది ఇండస్ట్రీ వర్గాల గుసగుసల సారాంశం.

 పవన్ పేరు చెబితే చాలు బయ్యర్లు సూట్ కేసులతో వస్తారని, పైసా పెట్టుబడి లేకుండా సినిమా చేయవచ్చు అని, అది శరద్ అయినా మరెవరైనా సరే అని సినిమా జనాల అభిప్రాయం. ఆ ఇమేజ్ ఎలాగూ వుంది కాబట్టి, శరద్ ను ముందు పెట్టి పవన్ నే సినిమాలు చేసుకుంటున్నారని, అందువల్ల శరద్ మురార్ నష్టపోవడం అన్నది వుండదని కామెంట్లు వినిపిస్తున్నాయి. అందుకే ఈ సినిమా కూడా లేట్ అయినా, ఎప్పుడు వచ్చినా శరద్ మురార్ కు ఒకటే అని అంటున్నారు.