అయ్యోరామా.. అమ్మకానికి మెడికల్‌ సీట్లు.!

ప్రపంచం నివ్వెరపోయింది.. విద్యాలోకం షాక్‌కి గురయ్యింది.. ఎవరూ ఊహించని ఘటన ఇది.. పడమర సూర్యుడు ఉదయించాడేమో.. ఇలా ఆశ్చర్యపోవాలి.. ఎంబీబీఎస్‌ సీట్లు అమ్మకానికి పెట్టారనగానే.! ఏంటి, నిజమేననుకుంటున్నారా.? పాలు తెల్లగా వుంటాయనేది ఎంత నిజమో,…

ప్రపంచం నివ్వెరపోయింది.. విద్యాలోకం షాక్‌కి గురయ్యింది.. ఎవరూ ఊహించని ఘటన ఇది.. పడమర సూర్యుడు ఉదయించాడేమో.. ఇలా ఆశ్చర్యపోవాలి.. ఎంబీబీఎస్‌ సీట్లు అమ్మకానికి పెట్టారనగానే.! ఏంటి, నిజమేననుకుంటున్నారా.? పాలు తెల్లగా వుంటాయనేది ఎంత నిజమో, మెడికల్‌ సీట్లు అమ్మకానికి మార్కెట్‌లో సిద్ధంగా వున్నాయన్నదీ అంతే నిజం. ఇదిప్పుడు కొత్తగా తెరపైకి వచ్చిన విషయమేమీ కాదు. ఒకప్పుడు 50 లక్షలు వుండేది.. ఇప్పుడు ఆ రేటు కోటిన్నరకు పాకింది. అంతే తేడా. 

ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో అయినా, ఆంధ్రప్రదేశ్‌ – తెలంగాణ రాష్ట్రాల్లో అయినా మెడికల్‌ సీట్ల అమ్మకం ఎప్పటినుంచో ఓ సాధారణ విషయంగా పరిగణించబడ్తోంది. ఇప్పుడంటే తెలంగాణ ఎంసెట్‌-2 ప్రశ్నాపత్రం లీక్‌ అయ్యిందనే గాసిప్స్‌తో మెడికల్‌ సీట్ల అంశం కాస్త కొత్తగా హాట్‌ టాపిక్‌ అయ్యిందేమోగానీ, నిజానికి ఇది పాత విషయమే. 

తెలంగాణలో అయినా ఆంధ్రప్రదేశ్‌లో అయినా మెడికల్‌ సీటు కావాలంటే ముందుగా 60 లక్షలు చెల్లించుకోవాలి. తెలంగాణలో సీటు కావాలంటే ఏడాదికి 11 లక్షలు ఫీజు, ఆంధ్రప్రదేశ్‌లో సీటు కావాలంటే 9 లక్షలు.. ఇది అదనం. అయితే, ఈ 'ఫిగర్స్‌' విషయంలో చిన్న చిన్న మార్పులున్నాయండోయ్‌. ఆ మార్పులు 11 లక్షల నుంచి 15-20 లక్షల వరకు వుంటోంది. నమ్మశక్యంగా లేని విషయమేమీ కాదిది. నమ్మదగ్గదే. కావాలంటే ఎవరైనా సరే 'మెడికల్‌ సీటు కావాలి..' అని ఏ మెడికల్‌ కాలేజీని అయినా సంప్రదించి చూడండి. అక్కడుండే బ్రోకర్లు ఈ విషయాన్ని ఎంచక్కా వివరించేస్తారు. 

ఇంకా చిత్రమైన విషయమేంటంటే, ఈ దోపిడీలో ప్రజా ప్రతినిథులకీ వాటా వుండడం. వారి షేర్‌ వారికి వెళ్ళిపోవాల్సిందే. అన్నట్టు, ప్రజా ప్రతినిథులకు చెందినవే ఎక్కువ మెడికల్‌ కాలేజీలు తెలుగు రాష్ట్రాల్లో వున్నాయి. డైరెక్ట్‌గా కొంత మందికి మెడికల్‌ కాలేజీలు వుంటే, ఇంకొందరేమో బంధువుల పేర్లతో మెడికల్‌ కాలేజీలు నడుపుతున్నారు. అద్గదీ అసలు విషయం. 

సిగ్గు సిగ్గు.. అన్న మాట చాలా చాలా చాలా చిన్నది. ప్రజా ప్రతినిథులు ఆశ్చర్యం వ్యక్తం చేసినా, ఈ ఘటనపై విచారణ చేసి, దోషుల్ని శిక్షిస్తామని ప్రభుత్వం తూతూ మంత్రంగా ప్రకటనలు చేసినా అంతకన్నా హాస్యాస్పదం ఇంకొకటుండదు. విచారణ సరిగ్గా జరిగితే తెలుగు రాష్ట్రాల్లో సగానికి పైగానే.. ఆ మాటకొస్తే నూటికి 90 శాతం కాలేజీ అడ్డంగా బుక్కయిపోతాయన్నది ఆ కాలేజీల బాగోతంతో 'మెడిసిన్‌'పై ఆశలొదిలేసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నమాట. ఎనీ డౌట్స్‌.?