పార్లమెంటు సమావేశాలు జరుగుతాయి.. ఆంధ్రప్రదేశ్‌లో అధికార తెలుగుదేశం పార్టీ సహా, మిత్రపక్షం బీజేపీ, ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, దాంతోపాటుగా కాంగ్రెస్ పార్టీ, వీటన్నిటితో కలిసి వామపక్షాలు.. అన్నీ ప్రత్యేక హోదా కోసం నినదిస్తాయి. ఇక్కడ ఒకరు తక్కువ, ఇంకొకరు ఎక్కువ కాదు. అందరూ ప్రత్యేక హోదా కోసం నినదించే మొనగాళ్ళే. అయితే ఎవరూ ఢిల్లీ వేదికగా పోరాటం చెయ్యరు, చేసినా ఉపయోగం వుండదు.
ఇది ఇప్పటి తంతు కాదు, చాన్నాళ్ళుగా జరుగుతున్నదే. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి. మళ్ళీ 'ప్రత్యేక లొల్లి' మొదలైంది. గతంలో కాంగ్రెస్ ఎంపీ (రాజ్యసభ) కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లుపై ఓటింగ్ జరగాల్సి వుందిప్పుడు. కాంగ్రెస్ ఇప్పుడు ఇదే అంశం చుట్టూ పావులు కదుపుతోంది. తమ ఎంపీలకు విప్ జారీ చేసి, బిల్లుని పాస్ చేయిస్తామని కాంగ్రెస్ చెబుతోంది. టీడీపీ ఈ విషయంలో కలిసి వస్తుందా.? అని ప్రశ్నిస్తోంది కాంగ్రెస్.
ఇంకోపక్క, టీడీపీ కూడా ప్రత్యేక హోదాపై చర్చకు నోటీసు ఇచ్చింది లోక్‌సభలో. అంతే తప్ప, కాంగ్రెస్ సభ్యుడు ఇచ్చిన బిల్లుపై ఓటింగ్ జరిగితే, అనుకూలంగా ఓటేస్తామని చెప్పడంలేదు. పైగా, ఇది రాజకీయ కోణంలో పెట్టిన ప్రైవేటు బిల్లు తప్ప, చిత్తశుద్ధితో పెట్టింది కాదన్నది టీడీపీ వాదన. బీజేపీ సంగతి సరే సరి. అసలు బీజేపీకి ప్రత్యేక హోదా ఇచ్చే ఉద్దేశ్యం లేదు. వైఎస్సార్సీపీ మాత్రం ప్రత్యేక హోదాపై ప్రైవేటు బిల్లుకు అనుకూలంగా ఓటేస్తామని ప్రకటించేసింది. ఈ మొత్తం ఎపిసోడ్‌లో వామపక్షాలు జస్ట్ ఆటలో అరటిపండు.. అనుకోవాలేమో.!
అంతా బాగానే వుందిగానీ, అసలంటూ లోక్‌సభలో అయినా, రాజ్యసభలో అయినా ప్రత్యేక హోదాపై చర్చ, ఓటింగ్‌కి ఆస్కారం వుందా.? అన్నదే ఇక్కడ మిలియన్ డాలర్ల ప్రశ్న. కేవీపీ ప్రవేశపెట్టింది ప్రైవేటు బిల్లు గనుక, అది బీజేపీకి ఇష్టం లేని వ్యవహారం గనుక, అధికారంలో వున్న బీజేపీ.. చాలా ఈజీగా ఈ వ్యవహారాన్ని టాకిల్ చేయగలదు. తద్వారా ప్రత్యేక హోదా నినాదాన్ని 'కిల్' చేసెయ్యాలన్నది బీజేపీ ఆలోచన. ఈ విషయం కాంగ్రెస్‌కి కూడా తెలుసు.
సో, జరుగుతున్నదంతా ఓ హైడ్రామా. అంతకు మించి, అక్కడేదో జరిగిపోతుందని అనుకోవడం హాస్యాస్పదం. ఉమ్మడి తెలుగు రాష్ట్రం విభజన వ్యవహారంలో పార్లమెంటే 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌కి అన్యాయం చేసింది. ఆ పార్లమెంటులో అప్పుడు కాంగ్రెస్ అధికార పక్షం.. ఇప్పుడు బీజేపీ అధికార పక్షం. అంతకు మించి తేడా ఏమీ లేదు. ఎనీ డౌట్స్.?