అధికారం చేపట్టి రెండేళ్లయిన తర్వాత మోదీ కాబినెట్ విస్తరణ చేపట్టారు, కొందరి శాఖలు మార్చారు. తక్కినవారి మాట ఎలా వున్నా స్మృతి ఇరానీ శాఖ మార్పు గురించే ఎక్కువ చర్చ జరిగింది. దానికి కారణం ఆమె హై ప్రొఫైల్, వర్క్ స్టయిల్. దానివలన అభిమానులూ ఏర్పడ్డారు, వ్యతిరేకులూ ఏర్పడ్డారు. 2014 ఎన్నికల ప్రచారంలో మోదీ ఆమెను తన చిట్టిచెల్లెలుగా సంభావించారు. నెగ్గాక కాబినెట్‌లోకి తీసుకున్నారు. మానవవనరుల శాఖ ఎంతో కీలకమైనది. గతంలో పివి, జోషీ, అర్జున్ సింగ్ వంటి అనుభవజ్ఞులు పాలించిన శాఖ. ఈమెకు ఏ అనుభవం లేకున్నా ఎకాయెకీ కాబినెట్ ర్యాంకు యిచ్చి ఆ శాఖ కట్టబెట్టారు. అనుభవజ్ఞురాలైన సుష్మా స్వరాజ్ కంటె స్మృతికే ఎక్కువ ఎక్స్‌పోజరు వచ్చింది. ఆమె మంచి వక్త. కష్టపడే స్వభావం కలది. ఏదైనా విషయాన్ని త్వరగా ఆకళింపు చేసుకోగలదు, అవతలివారితో వాదించగలదు. విదేశాల నుంచి స్కాలర్ల సేవలు దేశంలోని ఉన్నత విద్యాలయాల విద్యార్థులకు అందించడం, స్వచ్ఛ విద్యాలయ స్కీము కింద 4 లక్షల టాయిలెట్లను పాఠశాలల్లో కట్టించడం వంటి మంచి పనులు చేసింది. అయినా ఆమెను క్యాంపస్‌ల నుంచి దేవిడీమన్నా చేసి (దేవిడీ అంటే కోటగుమ్మం, మనా అనే హిందూస్తానీ పదానికి అర్థం నిషిద్ధం, తెలుగులోకి వచ్చేసరికి మన్నా అయింది, రాజుగారికి ఎవరి మీదనైనా కోపం వస్తే వారిపై రాజద్వారనిషేధం విధిస్తాడు. అదే దేవిడీమన్నా) ప్రాధాన్యత తక్కువ వున్న, యిప్పటిదాకా సహాయమంత్రి నిర్వహిస్తున్న జౌళి శాఖకు పంపారు. ఈవిడ ర్యాంకు తగ్గించలేదు, అంతవరకు ఆవిడ సంతోషించాలి. 'ఉత్తర ప్రదేశ్ ఎన్నికలలో ప్రియాంకా గాంధీకి దీటుగా ప్రచారం చేయడానికి సమయం కావాలి కాబట్టి, ఎచ్‌ఆర్‌డి వంటి హెవీ శాఖ నుంచి తప్పించారు తప్ప మరేమీ కాదు' అని ఆవిడ అభిమానులు అంటున్నారు. కాదు, హైదరాబాదు యూనివర్శిటీ, జెఎన్‌యు వ్యవహారాల్లో మరీ దూకుడుగా వెళ్లడం చేత ఎదురుదెబ్బ తగిలిందని కొందరు విశ్లేషిస్తున్నారు. వాటి మాట ఎలా వున్నా ఆవిడ వ్యవహారశైలి వలననే ఆమె దెబ్బ తింది అనేది మాత్రం కొట్టవచ్చినట్లు కనబడుతోంది.
ఆవిడ పెద్దగా చదువుకోలేదు. ఏ మేరకు చదువుకున్నది అనేది కోర్టు త్వరలోనే తేలుస్తుంది. ఆ తీర్పు వచ్చేపాటికి ఆమె విద్యామంత్రిగా వుంటే ఎబ్బెట్టుగా వుంటుందని, వేరే శాఖకు మార్చారని కూడా కొందరంటున్నారు. ఎకడమిక్ క్వాలిఫికేషన్ మాట ఎలా వున్నా ఆవిడ విద్య నేర్చింది, తెలివితేటలు గడించింది. అందుకే అనుకోని రీతిలో 38 సం||ల వయసులోనే పెద్ద పదవి చేతికి అంది వచ్చి విద్యాశాఖలో నెగ్గుకుని వచ్చింది. ఇవన్నీ ఆమె అహంకారాన్ని పెంచాయి. విద్య విలువ తెలియనట్లు విద్యాధికులతో కూడా చాలా దురుసుగా ప్రవర్తించి చెడ్డపేరు తెచ్చుకుంది. ఆమె అధికారంలోకి వస్తూనే ఢిల్లీ యూనివర్శిటీ విసి దినేశ్ సింగ్ చేత ఆయన ప్రవేశపెట్టిన నాలుగేళ్ల డిగ్రీ కోర్సును రద్దు చేయించింది. ఇదివరకు తాము సమర్థించిన ఈ కోర్సును యిప్పుడు వ్యతిరేకించేట్లా యుజిసిపై ఒత్తిడి తెచ్చింది. విశ్వభారతి యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ (విసి) సుశాంత దత్తగుప్త, పుదుచ్చేరి యూనివర్శిటీ విసి చంద్రా కృష్ణమూర్తిలను పదవుల్లోంచి తొలగించింది. ఇలా యింతకు ముందు ఎప్పుడూ జరగలేదు. ఈవిడతో వేగలేక బొంబాయి ఐఐటీ చైర్మన్ అనిల్ కాకోడ్కర్, ఢిల్లీ ఐఐటి చైర్మన్ ఆర్‌కె షెవగాంకర్ రాజీనామా చేశారు. ఆమె శాఖలో పనిచేసే 6గురు సెక్రటరీలు, 10 ఎడిషనల్ సెక్రటరీలు, 12 మంది జాయింటు సెక్రటరీలు యీమెతో పనిచేయలేం బాబోయ్, వేరే శాఖకు వేసేయండి అని అర్జీలు పెట్టుకున్నారు. ఉత్తి పుణ్యానికి పేచీకి దిగే ఆమె స్వభావమే దానికి కారణం. ''డియర్ స్మృతి ఇరానీజీ'' అంటూ బిహార్ విద్యామంత్రి ఆమెకు ట్వీట్ చేస్తేనే ఏదో అసభ్యపదం వాడినంత యాగీ చేసింది.
తక్కినవారిని తృణీకరించినా హాని ఏమీ జరగకపోవడంతో ఆమె మోదీ మాట కూడా లక్ష్యపెట్టడం మానేసిందట. బాబా రామ్‌దేవ్ జాతీయ వేద విద్యామండలి నెలకొల్పుతానని ప్రతిపాదించాడు. ఆరెస్సెస్ కూడా దానికి ఆమోదం తెలిపింది. అయితే దాని నిర్వహణ ఎవరి చేతిలో పెట్టాలనేదానిపై భేదాభిప్రాయం వచ్చింది. వేదపండితులు ఆధ్వర్యంలో నడవాలని ఆరెస్సెస్ భావించగా, రామ్‌దేవ్ ఆధ్వర్యంలో వుండాలని మోదీ, షా అనుకున్నారు. ఆ విషయం తెలిసి కూడా స్మృతి రామ్‌దేవ్‌ను ఆమోదించక, దాన్ని పెండింగులోనే పెట్టింది. ఐఐఎమ్ మేనేజ్‌మెంట్, 2015 బిల్లు విషయంలో కూడా మోదీతో ఆమె ఏకీభవించలేదు. దేశంలో 20 ప్రతిష్ఠాత్మకమైన విద్యాలయాలు పెట్టాలని, సెంట్రల్ యూనివర్శిటీ లన్నిటిలో వైఫై సౌకర్యం కల్పించాలని మోదీ సంకల్పించినా యీమె యింకా అమలు చేయక విపరీతమైన జాప్యం చేసింది. ప్రధాని కార్యాలయంతో, యీమె శాఖకు నిరంతరం వివాదాలు కొనసాగుతున్నాయి. మోదీకి తనకు ఆత్మీయుడైన మాజీ కేబినెట్ సెక్రటరీ టిఆర్‌ఎస్ సుబ్రహ్మణ్యం అధ్యక్షతన ఒక కమిటీ వేసి జాతీయ విద్యావిధానం ఎలా వుండాలో రూపకల్పన చేయించాడు. వాళ్లు తయారుచేసిన డ్రాఫ్టు పాలసీ రిపోర్టును ఈమె పట్టించుకోలేదు. నివేదికను బహిరంగ పరచి, చర్చకు పెట్టండి అని అడిగడిగి వేసారిన సుబ్రహ్మణ్యం 'నేనే దీన్ని బయటపెడతా' అని బెదిరించే దాకా వెళ్లారు. అయినా యీమె చలించలేదు.
ఈమె స్థానంలో వచ్చిన ప్రకాశ్ జావడేకర్‌కు సహాయమంత్రి పోస్టు నుంచి కాబినెట్ ర్యాంకుకు ప్రమోషన్ వచ్చింది. మోదీకి ఆత్మీయుడైన అదానీకి ఆయన మేలు చేశాడన్న విషయం మనం గుర్తించాలి. ముంద్రా పోర్టు నిర్మాణసమయంలో పర్యావరణాన్ని ధ్వంసం చేసినందుకు గౌతమ్ అదానీ కంపెనీకి రూ.200 కోట్ల జరిమానా పడింది. దాన్ని యీయన మాఫీ చేశాడు. ప్రకాశ్ కూడా ఆరెస్సెస్ నేపథ్యం వున్న వ్యక్తే కాబట్టి స్మృతి ప్రారంభించిన విద్యారంగ కాషాయీకరణ కార్యక్రమం కొనసాగుతుందని అనుకోవచ్చు. అతనికి సహాయమంత్రిగా వేసిన రామ్‌శంకర్ కఠేరియా కూడా ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్‌కు సన్నిహితుడు. మరో సహాయ మంత్రి మహేంద్ర నాథ్ పాండే కూడా. 10 రాష్ట్రాల నుంచి కొత్తగా తీసుకున్న 19 మందిలో సగం మందికి ఆరెస్సెస్‌లో పనిచేసిన నేపథ్యం వుంది. మొత్తం 77 మంది మంత్రుల్లో 70 మంది బిజెపివారే. వారిలో చాలామంది ఆరెస్సెస్‌కు ఆత్మీయులే.
మంత్రివర్గ పునర్నిర్మాణంలో మోదీ ప్రతిభను, పనితీరును లెక్కలోకి తీసుకుని నిర్దాక్షిణ్యంగా, నిర్మొగమాటంగా వ్యవహరించారని మీడియాలో రాయించుకున్నా యుపిలో ఎన్నికలకు, కులసమీకరణలకు పెద్ద పీట వేశారని కనబడుతూనే వుంది. యుపి నుంచి యిప్పటికే 12 మంది మంత్రులుండగా మరో ముగ్గుర్ని చేర్చుకున్నారు. ఈ 15 మందిలో ఆరుగురు మంత్రుల నియోజకవర్గాలు 100 కి.మీ.ల పరిధిలోనే వున్నాయంటే ఆ ప్రాంతంపై బిజెపి ఎంత ఫోకస్ పెట్టిందో తెలుస్తోంది. 75 ఏళ్లు దాటినవారిని వుంచకూడదన్న అప్రకటిత నియమం వున్నా ఆ వయసు దాటిన కల్‌రాజ్ మిశ్రా అనే యుపి బ్రాహ్మణ నేతను తీసేయలేదు. ప్రస్తుత కాబినెట్‌లో యుపి నుంచి ఐదుగురు బ్రాహ్మణులు, ఐదుగురు ఒబిసిలు, యిద్దరు రాజపుత్‌లు, ఒక సిఖ్కు, ఒక జాట్, ఒక దళితుడు వున్నారు. అంటే బిజెపి దళిత ఓట్లపై పెద్దగా ఆశ పెట్టుకోకుండా అగ్రకులాలు, ఒబిసిలపై దృష్టి పెట్టిందని అనుకోవాలి. 75 దాటిన నజ్మా హెప్తుల్లాను విదేశీ పర్యటన నుంచి వెనక్కి వచ్చాక రాజీనామా యిప్పించారు. ఆమె స్థానంలో మరో ముస్లిం ఎంజె అక్బర్‌ను చేర్చుకున్నారు. పనితీరు సరిగ్గా లేని ఐదుగురు సహాయమంత్రులను తీసేశారు. వారం రోజులాగి, భారీ పరిశ్రమల శాఖలో సహాయమంత్రి జిఎం సిద్ధేశ్వర చేత రాజీనామా చేయించారు. అందరితో బాటు తీసేద్దామనుకుంటే అతను 'ఇవాళ నా పుట్టినరోజు, ఆ సందర్భంగా నా అభిమానులు నా నియోజకవర్గంలో పెద్ద సభ ఏర్పాటు చేశారు. దానికి తీమం (తీతా లాగ) వెళ్లడం బాగుండదు' అని చెప్పుకున్నాడు. ఆ ముచ్చట కానిచ్చాక, పార్టీ బాధ్యతలు చేపట్టి, ఎడ్యూరప్పకు సహాయంగా వుండడం కోసం అనే పేరు చెప్పి తీసేశారు.
కులం లెక్కలు ఎంత తీవ్రంగా వేశారో ఉదహరించే ఓ పుకారు ఢిల్లీలో షికారు చేస్తోంది. దళితుల్లో పలుకుబడి పెంచుకోవాలి కాబట్టి ఓట్లు ముఖ్యం కాబట్టి, ఇద్దరు ఎస్టీలకు, ఐదుగురు ఎస్సీలకు కొత్తగా కాబినెట్‌లో చోటిచ్చారు గుజరాత్‌లో పటేళ్లు ఆందోళన చేస్తున్నారు కాబట్టి ఒక పటేల్‌ను, కొత్త కూటమిలో ఆదివాసీలు కీలకం కాబట్టి ఒక ఆదివాసీని కాబినెట్‌లోకి తీసుకున్నట్లే, రాజస్థాన్ నుంచి జాట్లను సంతృప్తి పరచాలనుకుని పిపి చౌధురీ అనే సుప్రీం కోర్టు లాయరును ఎంపిక చేశారు. జాబితా బయటకు లీక్ కాగానే రాజస్థాన్ బిజెపి యూనిట్ వారు 'ఈ చౌధురీ యింటిపేరు బట్టి జాట్ అనుకున్నారేమో, కాదు, సీర్వీ అనే కులానికి చెందినవాడు' అని చెప్పారు. అయ్యయ్యో అనుకుని సిఆర్ చౌధురీ అనే జాట్ పేరు కూడా చేర్చారట. సామర్థ్యమే కొలబద్దయితే ఉమాభారతి వంటి అనేకమందిని తీసివేయవలసి వచ్చేది. వివాదాలను లెక్కలోకి తీసుకుంటే సంజీవ్ బలియా, నిరంజన్ జ్యోతి వంటి వారినీ తీసేయవలసి వచ్చేది. వీరెవ్వరినీ ముట్టుకోలేదు కానీ జయంత్ సిన్హాను ఆర్థిక శాఖ నుంచి తప్పించివేశారు. జయంత్ వెంచర్ కాపిటలిస్టుగా వున్నాడు కాబట్టి పారిశ్రామికవేత్తలతో బాగా వ్యవహరించగలడంటూ ఆ శాఖలోకి తీసుకుని వచ్చారు కానీ యిటీవల అతని తండ్రి యశ్వంత్ సిన్హా ప్రభుత్వాన్ని విమర్శించిన కారణంగానే యీ మార్పు జరిగిందని అంటున్నారు. జయంత్ భార్య పునీతా కుమార్ పాతికేళ్ల అనుభవం వున్న ఇన్వెస్ట్‌మెంట్ కన్సల్టెంట్. ఆమెను ఇన్ఫోసిస్‌లో యిండిపెండెంట్ డైరక్టరుగా తీసుకోవడం వలన, జయంత్ ఆర్థికశాఖలో కొనసాగడం ఔచిత్యభంగం కలిగిస్తుందనే సాకు పైకి చెప్తున్నారు. కీలకమైన యీ మార్పు గురించి తనకేమీ చెప్పకపోవడంతో జయంత్‌కు కోపం వచ్చింది. చార్జి హేండోవర్ చేయడానికి గునిశాడు. అతని స్థానంలో సంతోష్ గంగ్వార్, అర్జున్ రామ్ మెహవాల్‌లను వేశారు కానీ దానికి ముందు మోదీ కాని, అమిత్ కానీ అరుణ్ జైట్లేని సంప్రదించారో లేదో తెలియదు. అరుణ్‌పై మోదీ, షాలకు కాస్త కినుక లేకపోలేదు. అరుణ్ జైట్లీ న్యాయశాఖా మంత్రి కాకపోయినా న్యాయశాఖలో నియామకాలన్నిటిలో తనకు కావలసిన వారినే వేసుకున్నాడని, ఆ శాఖ మంత్రిగా సదానంద గౌడ దాన్ని నిరోధించలేకపోయాడని, అందుకే అతన్ని తీసేశారని కూడా అంటున్నారు. కమ్యూనికేషన్స్ మంత్రిగా రవిశంకర్ ప్రసాద్ ఆ వ్యాపారంలోని ప్రముఖులతో మరీ భుజాలు రాసుకుని తిరుగుతున్నాడు కాబట్టి, అక్కణ్నుంచి తీసేసి న్యాయశాఖలో వేసి ఆ శాఖలో అరుణ్ ప్రాబల్యానికి అడ్డుకట్ట వేయమన్నారట.
కులాల లెక్కతో ప్రాముఖ్యంలోకి వచ్చిన మరో మంత్రి 36 ఏళ్ల అనుప్రియ సింగ్ పటేల్. ఉత్తరప్రదేశ్‌లోని కూర్మీ కులానికి చెందిన సోనేలాల్ పటేల్ బియస్పీ పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకడు. తర్వాత విడిగా వచ్చి అప్నాదళ్ అనే పార్టీ స్థాపించాడు. ఆయన పెద్ద కూతురు అనుప్రియ. ఢిల్లీలో శ్రీరాం కాలేజీలో చదువుకుంది. సైకాలజీలో, బిజినెస్ ఎడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ చేసింది. సోనేలాల్ 2009లో రోడ్డు ప్రమాదంలో చనిపోతే, భార్య కృష్ణా పటేల్ పార్టీ అధ్యక్షురాలైంది. అనుప్రియ జనరల్ సెక్రటరీ అయింది. 2012 ఎన్నికల్లో వారణాశి పార్లమెంటరీ నియోజకవర్గంలోకి వచ్చే రోహనియా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా నిలబడి గెలిచింది. ఆ కులస్తుల ప్రాబల్యం వారణాశి సమీప ప్రాంతాల్లో బాగా వుంది. 2014 పార్లమెంటు ఎన్నికలలో యుపిలో ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటిస్తూ వచ్చిన బిజెపి, వారణాశిలో మోదీ ఘనవిజయం సాధించాలంటే కూర్మీ ఓట్ల అవసరం బాగా వుందని గ్రహించి, ఒక్క ఎమ్మెల్యే మాత్రమే వున్న అప్నాదళ్‌తో పొత్తు పెట్టుకుని దానికి రెండు పార్లమెంటరీ సీట్లు కేటాయించింది. ఒక దానిలో హరిబన్ష్ సింగ్, మరో దానిలో సోనేలాల్ కూతురు అనుప్రియ నిలబడి గెలిచారు. గెలిచిన ఏడాది తర్వాత కృష్ణా పటేల్ తన రెండో కూతురు పల్లవిని కూడా పార్టీలోకి తీసుకుని వచ్చి ఆమెకు ఉపాధ్యక్ష పదవిని కట్టబెట్టింది. అది అనుప్రియకు రుచించలేదు. తిరగబడింది. హర్‌బన్ష్ మాత్రం కృష్ణా పటేల్ వెంటే నిలబడ్డాడు. కూతుర్ని ఆరేళ్లపాటు పార్టీలోంచి బహిష్కరించిన తల్లి ఆమెను కేంద్ర కాబినెట్‌లో తీసుకుంటే ఎన్‌డిఏలోంచి వైదొలగుతానని బిజెపిని; హెచ్చరించింది. అయినా అనుప్రియను మంత్రి చేసి తన మిత్రపక్షాన్ని రెండుగా చీల్చింది బిజెపి. రాబోయే యుపి ఎన్నికలలో కూర్మీ ఓట్లు తల్లి పక్షాన పడతాయో, కూతురి పక్షాన పడతాయో చూడాలి.
– ఎమ్బీయస్ ప్రసాద్ (జులై 2016)