'రీషూట్ అనేది తప్పేమీ కాదు.. అయినా మా సినిమాని రీషూట్ చెయ్యడంలేదు..' అంటూ 'జనతా గ్యారేజ్' విషయంలో చిత్ర దర్శక నిర్మాతలు ఓ క్లారిటీ ఇచ్చినట్లే, కన్ఫ్యూజన్ని పెంచేశారు. సాధారణంగా కొరటాల శివ సినిమాలకి రీషూట్ అన్న మాట ఎక్కువగా విన్పించదు. చేసినవి రెండే సినిమాలు అయినా, పెర్ఫెక్ట్ ప్లానింగ్‌తో ఆ సినిమాల్ని కొరటాల శివ పూర్తి చేసి హిట్లు కొట్టాడు.
'మిర్చి' విషయంలోనూ, 'శ్రీమంతుడు' విషయంలోనూ కొరటాల మ్యాజిక్ పనిచేసింది. 'మిర్చి' సినిమా కోసం ముందుగా తీసిన ఓ ఫైట్ సన్నివేశాన్ని, సినిమా రిలీజ్ అనంతరం యాడ్ చేసిన విషయం విదితమే. ఆ విషయం పక్కన పెడితే, ఇప్పుడు 'జనతా గ్యారేజ్'పై భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాల్ని అందుకోవడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఆల్రెడీ మహేష్‌ని డీల్ చేసేశాడు గనుక, ఎన్టీఆర్‌ని డీల్ చేయడం కొరటాలకి పెద్ద కష్టమేమీ కాదన్న వాదనా లేకపోలేదు.
ఇక, 'జనతా గ్యారేజ్' విషయంలో మొదటి నుంచీ కొన్ని చిన్న చిన్న అనుమానాలు తెరపైకొస్తున్నాయి. షూటింగ్ ఆలస్యమవుతోందనీ, రీషూట్స్ జరుగుతున్నాయనీ గాసిప్స్ టాలీవుడ్ సర్కిల్స్‌లో షికార్లు చేశాయి. ఆగస్ట్ 12న విడుదల కావాల్సిన సినిమా సెప్టెంబర్ 2కి షిఫ్ట్ అయ్యిందని స్వయంగా కొరటాల శివ ప్రకటించడంతో ఈ గాసిప్స్‌కి మరింత బలం వచ్చి చేరింది. పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసమేనంటూ కొరటాల వివరణ ఇచ్చినాసరే, ఎక్కడో తేడా కొట్టిందన్న వాదన తెరపైకి వస్తోంది సరికొత్తగా.
ఆగస్ట్ 12 అంటే ఇంకా చాలా టైమ్ వుంది. ఈలోగా ఎంచక్కా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్ని పూర్తి చేసేసుకోవచ్చు. కానీ, 20 రోజులపాటు టైమ్ పొడిగించడమంటే, రీషూట్ జరుగుతోందేమో అన్న వాదనలకి స్వయానా చిత్ర యూనిట్ అవకాశం కల్పించినట్లయ్యింది. ఏమో, ఏం జరిగిందో.. ఏం జరుగుతోందోగానీ, ఎన్టీఆర్ ఇమేజ్ కన్నా ఇప్పుడు ఈ సినిమా విషయంలో కొరటాల శివ ఫ్యాక్టరే సినిమాకి కొండంత అండ. ఈ గాసిప్స్‌ని అధిగమించి, కొరటాల హ్యాట్రిక్ హిట్‌ని నమోదు చేస్తాడా.? వేచి చూడాల్సిందే.