''ఆర్ట్ ఆఫ్ లివింగ్'' ఫౌండేషన్ వ్యవస్థాపకుడు రవిశంకర్ యీ ఏడాది మార్చిలో ఢిల్లీలోని యమునానదిలోని యిసుకమేటల్లో పెద్ద సాంస్కృతికి కార్యక్రమం నిర్వహించి పర్యావరణవేత్తల విమర్శలకు గురైన సంగతి అందరికీ తెలుసు. నదిలో ఏర్పడే యీ యిసుక మేటలు దిగువ ప్రాంతాల్లో వరదలను నిరోధిస్తాయి. పై నుంచి కొట్టుకుని వచ్చే యిసుకను ఆకర్షించి నిలుపుతాయి. నీటిని నిలువ చేసుకుని, నదీ తీరాల్లోని జనవాసాల్లోని భూగర్భజలాలను పెంచుతాయి. అందువలన వాటిపై ఎక్కువమంది ఒకేసారి గుమిగూడితే వాటి స్వభావం దెబ్బ తింటుంది. 35 లక్షల మంది వచ్చే యీ భారీ సమావేశం వలన యిసుకమేటలకు, పర్యావరణానికి నష్టం వాటిల్లుతుందని భావించిన నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జిటి) ఆర్ట్ ఆఫ్ లివింగ్ (ఎఒఎల్) ఫౌండేషన్‌పై రూ.5 కోట్ల జరిమానా విధించింది. తమ వద్ద అంత డబ్బు లేదని నిర్వాహకులు విన్నవించుకోవడంతో రూ.25 లక్షలు కార్యక్రమానికి ముందు కట్టి, తక్కినది 3 వారాల్లో కట్టేందుకు గడువు యిచ్చింది. 25 లక్షలు కట్టి అనుమతి తెచ్చుకుని కార్యక్రమం కానిచ్చేశాక, ఎఒఎల్ బ్బెబ్బెబ్బే అంది. మేమేమీ భూమి, నీరు కలుషితం చేయలేదు కాబట్టి కట్టనక్కరలేదు అంటూ కోర్టు కెక్కింది.
తమిళనాడులో 1956లో పుట్టిన రవిశంకర్ బెంగుళూరు యూనివర్శిటీ ద్వారా బియస్సీ పాసయ్యారు. ఆ తర్వాత వివాదాస్పదుడైన మహర్షి మహేష్ యోగి వద్ద శిష్యుడిగా చేసి ఆయన టిఎమ్ (ట్రాన్సిడెంటల్ మెడిటేషన్) టీములో పనిచేశారు. 1981లో బెంగుళూరు ముఖ్యకేంద్రంగా ఎఒఎల్ ఫౌండేషన్ స్థాపించారు. ఇప్పుడది 156 దేశాలకు విస్తరించింది. రవిశంకర్ శ్వాసక్రియలో ''సుదర్శన క్రియ'' అనే విధానాన్ని 1982లో రూపొందించి 1983లో మొదటిసారి స్విజర్లండ్‌లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ కోర్సు ప్రారంభించారు. తన పేరుకు ముందు శ్రీశ్రీ చేర్చుకున్న రవిశంకర్‌ను ఎన్డిఏ ప్రభుత్వం యీ ఏడాది ''పద్మవిభూషణ్''తో సత్కరించింది. ప్రభుత్వం యిస్తున్న దన్నుతో గిన్నెస్ బుక్ రికార్డుల్లో ఎక్కడానికి ఢిల్లీలో వ(ర)ల్డ్ కల్చరల్ ఫెస్టివల్ పేర ఆయన ఢిల్లీలో మార్చి 11 నుంచి మూడు రోజుల పాటు 155 దేశాల నుంచి 35 లక్షల మంది పాల్గొనే మెగా యీవెంట్ తలపెట్టారు. 24 దేశాల నుంచి దాదాపు 36 వేల మంది కళాకారులు వచ్చి ఏడెకరాలలో కట్టిన 1200 అ.ల పొడుగు, 200 అ.ల వెడల్పు, 40 అ.ల ఎత్తు వున్న వేదికపై ప్రదర్శనలు నిర్వహిస్తారని ప్రకటించారు. ఇలాటి కార్యక్రమం ఎక్కడైనా జరుపుకోవచ్చు. కానీ యమునా నదీగర్భంలో ఎందుకు తలపెట్టారో ఎవరికీ అర్థం కాలేదు. ఇసుకమేట ప్రాంతం కాబట్టి అక్కడ శాశ్వత నిర్మాణాలు ఏవీ చేపట్టకూడదని రూలుంది. టైమ్స్ గ్రూపు వాళ్లు పదేళ్ల క్రితం టైమ్స్ గ్లోబల్ విలేజి అని కట్టి నెల్లాళ్లపాటు ఎగ్జిబిషన్ నిర్వహించింది. ప్రతీ ఏడాది అక్కడే చేద్దామని అనుకుంది కానీ ఢిల్లీ హైకోర్టు కలగచేసుకుని, దాన్ని కొట్టించేసింది. ఏటేటా చేయడానికి వీల్లేదంది.
పర్యావరణవేత్తలందరూ మొత్తుకుంటున్నా యీ కార్యక్రమానికి కేంద్రప్రభుత్వం, ఢిల్లీ రాష్ట్రప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరించాయి. మోదీతో చిన్న విషయానికై కూడా తగవులాడే ఆప్ దీనిపై మాత్రం ఏకాభిప్రాయంతో వుండడానికి కారణం – కేజ్రీవాల్ కాబినెట్లో టూరిజం మంత్రి కపిల్ మిశ్రా ఎఒఎల్ సభ్యుడు కావడమే! ఇలాటి ఉత్సవాల వలన రాష్ట్రంలో టూరిజం పెరుగుతుందని ఆయన ప్రకటించాడు. ఉత్సవస్థలం వద్ద పోలీసులనే కాదు, సైన్యాన్ని కూడా మోహరించారు. వీళ్ల దన్ను చూసుకునే నిర్వాహకులు చివరి నిమిషం దాకా ఫయర్, సెక్యూరిటీ క్లియరెన్సులకై దరఖాస్తు చేసుకోలేదు. కొన్ని గంటల్లో కార్యక్రమం ప్రారంభమవుతుందనగా వారు అప్లయి చేయడం, నిమిషాల్లో వీళ్లు జారీ చేయడం జరిగాయి. సభానిర్వహణ అనుమతికై డిసెంబరులో ఎఒఎల్ అప్లయి చేసినప్పుడు ఏదో చిన్న సాంస్కృతిక కార్యక్రమం అంది తప్ప యింతమంది వస్తారని చెప్పలేదు. ఎంతమంది వస్తారని వాళ్లూ అడగకుండా అనుమతి యిచ్చారు. తర్వాత భారీస్థాయిలో జరుగుతోందని తెలిసి యితరులు విమర్శలు చేస్తే జవాబిస్తూ ఎఒఎల్ ''మేం డిసెంబరులో యీ స్థలాన్ని గుర్తించినప్పటికే అక్కడ 25 ఎకరాలలో భవననిర్మాణాల తాలూకు చెత్త పడేసి వుంది. మాకు అనుమతి రాగానే డిసెంబరు 22 నుంచి దాన్ని తీసివేయడం మొదలుపెట్టాం. మేం మా నిర్మాణాల్లో పర్యావరణానికి అనుకూలమైన మట్టి, చెక్క, గుడ్డ వంటివే వాడుతున్నాం. 650 బయో టాయిలెట్స్ కడుతున్నాం. ఉత్సవం తర్వాత అవి అక్కడే వుండిపోతాయి కాబట్టి నదీజలాలు కలుషితం కాకుండా వుంటాయి.'' అని వాదించింది.
అసలు యిక్కడ ఎందుకు పెట్టాలి అని అడిగితే నదులను రక్షించవలసిన ఆవశ్యకత చాటిచెప్పడానికి అని చెప్పుకుంది. యమునా నది 375 కి.మీ.లు ప్రయాణించి ఢిల్లీ చేరేసరికి దానిలో మరీ మాలిన్యాలుండవు. కానీ ఢిల్లీలో 22 కి.మీ.లు ప్రయాణించేసరికి పూర్తిగా కలుషితమై పోతుంది. యమునానదిలోని కాలుష్యంలో 80% ఢిల్లీలో పయనిస్తుండగానే జరుగుతుంది. మామూలుగా అయితే 100 మిలీ. ల నీటిలో కోలిఫార్మ్ 500కు మించి వుండకూడదు. యమునలో అది 50 వేలుంటుంది. ఎందుకంటే కోటి జనాభా వున్న ఢిల్లీలో తయారయ్యే మురుగు, చెత్త 19 డ్రెయిన్ల ద్వారా, 42 ఇండస్ట్రియల్ యూనిట్ల ద్వారా యమునలో చేరుతుంది. నదీక్షాళనకై 1993 నుంచి రూ.1500 కోట్లు ఖర్చుపెట్టారు. అది కూడా మురుగులోనే కలిసిపోయినట్లుంది. ఇప్పుడు ఉత్సవం జరిగి మూణ్నెళ్లయింది. యమునా నదీపరిరక్షణ గురించి ప్రజల్లో కానీ, ప్రభుత్వంలో కానీ ఏ మేరకు అవగాహన, స్పందన వచ్చిందో ఎఒఎల్ వారే చెప్పాలి.
సభానిర్వహణకు ఎన్జిటి అనుమతి నిరాకరిస్తూ వుంటే ఎలాగైనా యివ్వాలని ఎఒఎల్ ఒత్తిడి తెచ్చింది. ఐఐటీ ప్రొఫెసర్లతో, పర్యావరణవేత్తలతో కూడిన ఎన్జిటి లెక్కలు వేసి ''మీరు పాడు చేసిన దానిని బాగు చేయడానికి హెక్టేరుకు రూ. 50 లక్షల ఖర్చవుతుంది. ఆ లెక్కన మీకు రూ.120 కోట్ల జరిమానా వేయాలి'' అంది. ''అబ్బే మేం వాడుకునేది 28 హెక్టేర్లే'' అన్నారు రవిశంకర్. వేదికే 7 హెక్టేర్లున్నపుడు అది చూడడానికి వచ్చిన ప్రేక్షకులు ఎన్ని హెక్టేర్లలో కూర్చుని వుంటారు? మొత్తం 400 హెక్టేర్లు వాడారని ఒక అంచనా వుంది. అంటే 200 కోట్లు జరిమానా వేయాలన్నమాట. అయినా ఎన్జిటి దిగి వచ్చి ''మీరన్న 28 హెక్టేర్లే అనుకున్నా మీరు రూ.14 కోట్లు కట్టాలి కదా'' అంది. ''ఢిల్లీ ఐఐటీ ప్రొఫెసరు, జెఎన్‌యు ప్రొఫెసరుతో మీరు వేసిన ఎక్స్పర్ట్ కమిటీని రద్దు చేయండి, వాళ్ల లెక్కలు తప్పు. మేమేమీ తప్పు చేయలేదు. జరిమానా కట్టము. కావాలంటే పునర్మిర్మాణానికి సహకరిస్తాం.'' అని వాదించారు రవిశంకర్. చివరకు ఏ మొహమాటాలకు లొంగిందో కానీ ఎన్జిటి యీ లెక్కలన్నీ పక్కన పెట్టి 'రూ. 5 కోట్లు జరిమానా కట్టండి చాలు' అని ఎఒఎల్‌ను అడిగింది. ''మాది విరాళాలపై నడిచే సంస్థ. అంత డబ్బు లేదు. తొలి విడతగా రూ.25 లక్షలు కడతాం.'' అంటే ''సరే, అది కట్టి ఉత్సవం జరుపుకోండి. తక్కినది మూడు వారాల్లో కట్టండి.'' అంది ఎన్జిటి.
సాధారణంగా పర్యావరణ విషయాలపై ఆందోళన వ్యక్తం చేసే సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్వైర్మెంట్ కూడా యీ వివాదంపై నోరు మెదపలేదు. ఎవరైనా విమర్శించబోతే ''భారత జాతి, సంస్కృతి, హిందూమతం గురించి ఏ కార్యక్రమం చేపట్టినా దాన్ని వ్యతిరేేకించడం ఓ ఫ్యాషన్ అయిపోయింది'' అంటూ వెంకయ్యనాయుడు విరుచుకుపడ్డారు. స్వేచ్ఛ అనే స్వచ్ఛంద సంస్థ ఇడి విమలేందు ఝా ''ఉత్సవం అక్కడ జరపనివ్వరాదు అంటూ పిటిషన్ వేసినందుకు నాపై హిందూ వ్యతిరేకి అనే ముద్ర కొట్టి బిజెపి నాయకులు బెదిరింపు ఫోన్‌కాల్సు వచ్చాయి'' అని చెప్పుకున్నాడు. ఏమైందో ఏమో కానీ ప్రారంభసభకు రావలసిన ప్రణబ్ ముఖర్జీ రాలేదు. విదేశాల నుంచి రావలసిన చాలామంది ప్రముఖులు కూడా రాలేదు. మోదీ మాత్రం హాజరయి అభినందించారు.
ఉత్సవం పూర్తయ్యాక ఎఒఎల్ మొండికేసింది. మేమేమీ తప్పు చేయలేదు. తక్కినది కట్టం అంటూ సుప్రీం కోర్టుకి వెళ్లింది. ఎఒఎల్ సంస్థ దగ్గర నిజంగా డబ్బు లేదా? డబ్బు లేకుండానే 156 దేశాలకు విస్తరించారా? వాళ్ల కోర్సులకు హాజరయ్యేవారి వద్ద ఫీజులు వసూలు బాగానే చేస్తారు. హెడ్క్వార్టర్సులో ఎప్పుడు చూసినా సుమారు వెయ్యిమంది ట్రైనింగ్ పొందుతూంటారు. శ్రీశ్రీ ఆయుర్వేద అనే వ్యాపారసంస్థను 2003 నుంచి నిర్వహిస్తున్నారు. 2017 నాటికి దేశవ్యాప్తంగా 2500 స్టోర్లు నెలకొల్పి, కన్స్యూమర్ గూడ్స్, వెల్నెస్ ప్రోడక్టుల మార్కెట్లోకి కూడా వెళదామని చూస్తున్నారు. వాళ్ల కంటె మూడేళ్ల తర్వాత మార్కెట్లోకి ప్రవేశించిన బాబా రామ్‌దేవ్ పతంజలి బ్రాండ్ రూ. 5000 కోట్ల టర్నోవరుకు చేరుకుంది. వాళ్లని చూసి వీళ్లకూ ఊపు వచ్చింది. ఈ మధ్యే ''ఓజస్విత'' అనే మాల్ట్ డ్రింక్ ఫుల్‌పేజీ యాడ్స్ యిచ్చారు. ఎఒఎల్ అమ్మే ఫుడ్ ప్రోడక్టులు సుమేరు ఆయుర్వేద అనే కంపెనీ తయారుచేస్తుంది. ఇది రవిశంకర్ మేనల్లుడు అరవింద్ వర్చస్వి నడుపుతారు. ఆయనదే సుమేరు హాలీడేస్ అని వుంది. ఎఒఎల్ హెడ్క్వార్టర్సులోనే దాని ఆఫీసు వుంది. కోర్సులకై వచ్చేవారికి వసతి, రానుపోను ప్రయాణాల ఏర్పాట్లు చూస్తుంది. ఎఒఎల్‌కు విదేశాల్లో వున్న 7 అనుబంధ సంస్థల ద్వారా 2007 నుంచి రూ. 300 కోట్లు విరాళం వచ్చిందని, రూ.200 కోట్ల స్థిరాస్తులు, రూ. 8 కోట్ల చరాస్తులు వున్నాయని ఒక పత్రిక రాసింది.
డబ్బు వున్నా లేకపోయినా మాట యిచ్చారు కాబట్టి జరిమానా కట్టాల్సింది కానీ ఎఒఎల్ లిటిగేషన్‌లోకి దిగింది. కావాలంటే రూ.4.75 కోట్లు డబ్బుగా కాకుండా బ్యాంకు గ్యారంటీగా యిస్తామని మెలిక పెట్టింది. గ్యారంటీ అనగానే షరతులుంటాయి. ట్రైబ్యునల్ దాన్ని తిరస్కరించింది. ఎఒఎల్ కోర్టుకి వెళ్లింది. కోర్టు ఎఒఎల్ వాదనను కొట్టివేయడంతో బాటు పస లేని పిటిషన్ వేసినందుకు రూ.5 వేలు జరిమానా వేసింది. గ్యారంటీలు కుదరవని, డబ్బు కట్టి తీరాలని ఖండితంగా చెప్పింది. ఉత్సవం జరిగిన స్థలాన్ని పరిశీలించి, అక్కడ ఎంత డామేజి జరిగిందో లెక్కలు కట్టి ట్రైబ్యునల్ ఎక్స్పర్ట్ కమిటీ జరిమానా పెంచితే అదీ కట్టాలని చెప్పింది. ఎఒఎల్ ఆ కమిటీ పక్షపాత బుద్ధితో వ్యవహరిస్తోందని ఆరోపించింది. చివరకు ఏమనుకుందో ఏమో కానీ రూ.4.75 కోట్లు కట్టింది. ఇది జరిమానా కాదు, నష్టపరిహారం అని నిర్వచనం యిచ్చింది. జీవించే కళ నేర్పుతాననే ఆర్ట్ ఆఫ్ లివింగ్ తన తర్వాతి కోర్సులో వాగ్దానభంగం చేసి, పేచీ పెట్టుకునే కళ కూడా నేర్పుతుందేమో తెలియదు.
– ఎమ్బీయస్ ప్రసాద్ (జులై 2016)