‘కబాలి’ సరే.. రజనీ సంగతేంటి.?

ఎట్టకేలకు 'కబాలి' సినిమా విడుదల ఖరారయ్యింది. ఈ నెల 22న 'కబాలి' సినిమా విడుదలవుతోంది. సెన్సార్‌ పూర్తి చేసుకున్న 'కబాలి' వచ్చేస్తోందన్న వార్త తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌కి పండగనే మోసుకొచ్చింది. ఇకనేం, థియేటర్లను…

ఎట్టకేలకు 'కబాలి' సినిమా విడుదల ఖరారయ్యింది. ఈ నెల 22న 'కబాలి' సినిమా విడుదలవుతోంది. సెన్సార్‌ పూర్తి చేసుకున్న 'కబాలి' వచ్చేస్తోందన్న వార్త తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌కి పండగనే మోసుకొచ్చింది. ఇకనేం, థియేటర్లను ముస్తాబు చేసెయ్యాలి.. అంటూ అభిమానుల్లో అప్పుడే సందడి షురూ అయ్యింది. అదే సమయంలో, అభిమానుల్లో 'నిట్టూర్పు' కూడా స్పష్టంగా కన్పిస్తోంది. 

కారణం అందరికీ తెల్సిందే. రజనీకాంత్‌ అనారోగ్యంతో బాధపడ్తుండడం. వైద్య చికిత్స కోసం (వైద్య పరీక్షల కోసమని అంటున్నారు) విదేశాలకు వెళ్ళి రజనీకాంత్‌, ఇటీవలి కాలంలో మీడియా ముందుకు రాలేదు. కనీసం మీడియాకి రజనీకాంత్‌ పేరుతో ఓ లేఖ కూడా రాలేదు. దాంతో, తమ అభిమాన హీరో ఆరోగ్యంపై ఆందోళన పెరిగిపోతోందని అభిమానులు వాపోతున్నారు. 

ఇదిలా వుంటే, 'కబాలి' విడుదల కాబోతోందనీ, విడుదలకు ముందే రజనీకాంత్‌ ఇండియాకి వస్తారనీ నిన్న మొన్నటిదాకా 'కబాలి' టీమ్‌ చెబుతూ వచ్చింది. అయితే, కొన్ని రోజుల నుంచీ ఆ విషయంలో 'కబాలి' టీమ్‌ ఎలాంటి స్పష్టతా ఇవ్వడంలేదు. తమ అభిమాన హీరో ఆరోగ్యం గురించి ఎలా వాకబు చెయ్యాలో తెలియని పరిస్థితి అభిమానులది. గతంలో రజనీకాంత్‌ అనారోగ్యంతో బాధపడినప్పుడు పదే పదే ఆయన కుటుంబం నుంచి 'ప్రెస్‌ రిలీజెస్‌' బయటకు వచ్చేవి, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. 

ఏదిఏమైనా, రజనీకాంత్‌ తాజా చిత్రం 'కబాలి' విడుదలకు సిద్ధమవుతుండడంతో తమిళ ట్రేడ్‌ పండితులు, బాక్సాఫీస్‌ రికార్డుల లెక్కల్ని తిరగేస్తున్నారు. ఓపెనింగ్స్‌లో మళ్ళీ రజనీ సరికొత్త రికార్డ్‌ రాయడం ఖాయమని చెబుతున్నారు. తమిళంతోపాటు తెలుగు, హిందీ సహా పలు భారతీయ భాషల్లోనూ, కొన్ని విదేశీ భాషల్లోనూ ఈ చిత్రాన్ని విడుదల చేయనున్న విషయం విదితమే.