చెట్లు పెంచండి.. పర్యావరణాన్ని కాపాడండి.. అనే నినాదంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెలంగాణ వ్యాప్తంగా చెట్లను పెంచే కార్యక్రమం మొదలు పెట్టింది. వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో.. ఆ మాటకొస్తే కోట్లాది మొక్కల్ని నాటి, వాటిని చెట్లుగా, మహా వృక్షాలుగా మలిచెయ్యాలన్నది తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల 'చంద్ర'శేఖర్రావుగారి ఆలోచన. అదిరిందయ్యా చంద్రం.. అన్పించడంలేదూ.!
పెద్ద సంఖ్యలో మొక్కల్ని అయితే తెలంగాణ వ్యాప్తంగా పంపిణీ చేస్తున్నారు. సెలబ్రిటీలు కూడా తెలంగాణ ప్రభుత్వంతో చేతులు కలిపారు. సినీ హీరోలు, హీరోయిన్లు.. రాజకీయ నాయకులు రంగంలోకి దిగేశారు. మొక్కలు నాటుతున్నారు, మొక్కలు పంచేస్తున్నారు.. అంతేనా, మొక్కల పెంపకంపై అవగాహన కల్పించేలా స్టేట్మెంట్లూ దంచేస్తున్నారు. ఇంకేం, తెలంగాణ అంతటా హరితహారం పక్కా.. అనుకుంటున్నారా.?
మొక్కలు నాటుతున్నారు సరే, పెంచేదెవరు.! ఇదీ ఇప్పుడు సర్వత్రా వ్యక్తమవుతున్న అనుమానం. నిజమే మరి, అభివృద్ధి పేరుతో మహా వృక్షాల్ని సింపుల్గా పీకి పారేస్తున్నాం. వాటిని రీ-లొకేట్ చేయడానికే ప్రభుత్వాలకి తీరిక వుండడంలేదు. ఏమన్నా అంటే అది ఖర్చుతో కూడుకున్న పని.. అంటూ చేతులు దులుపుకోవడం పాలకులకే చెల్లుతుంది. మొక్కల విషయంలో పాలకులందరిదీ ఒకటే తీరు. మొక్కలు పెంచమంటారు, చెట్లను నరికేస్తారు.
ఓ మొక్క మహా వృక్షమవ్వాలంటే పదేళ్ళు పాతికేళ్ళు వందేళ్ళు కూడా పట్టొచ్చు. కానీ, ఆ మహా వృక్షాన్ని పీకెయ్యడం చాలా సింపుల్. రాత్రి కన్పించిన చెట్టు, పొద్దున్నకి కన్పించదు. ఇలా ఎడా పెడా వృక్షాల్ని నరికేసి, మొక్కలు నాటేస్తామంటే ఎలా.? అయినా, మొక్కల్ని ఎక్కడ నాటాలి.? ఇంకెక్కడన్నా అయితే ఓకే, నగరాల్లో అది సాధ్యమయ్యే పని కాదు. చిత్రంగా హైద్రాబాద్లోనే మొక్కలు నాటడానికి స్థలమెక్కడిది.! కాంక్రీట్ జంగిల్లా మారిపోయిన హైద్రాబాద్లో మట్టికే దిక్కు లేదు.. మొక్కలకు చోటెక్కడ.!
ఇక, ఆ మధ్య ప్రధాని నరేంద్రమోడీ స్వచ్ఛ భారత్.. అంటూ పిలుపునిచ్చేసరికి, మహోద్యమంలా సెలబ్రిటీలు కదిలారు. చేతికి గ్లోవ్స్ వేసుకుని మరీ, చెత్తని ఏరి పారేశారు. తర్వాత అంతా కామప్. ఇప్పుడు దేశంలో ఎక్కడ, ఏ మూల చూసినా చెత్త సుస్పష్టంగా కన్పిస్తుంది. హైద్రాబాద్లో చెత్త దుస్థితి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అప్పుడు చెత్త.. ఇప్పుడు మొక్కలు.. అప్పుడూ సెలబ్రిటీల హంగామా.. ఇప్పుడూ సెలబ్రిటీల హడావిడీ. తేడా ఏమన్నా వుందా.? సెలబ్రిటీల్లోనూ, పాలకుల్లోనూ చిత్తశుద్ధిని ఆశించగలమా.?