ఎమ్బీయస్‌: ఎమర్జన్సీ ఎట్‌ 40 – 59

లలిత్‌ మిశ్రా హత్యను ఆనందమార్గీల నెత్తిన చుట్టడానికి చూస్తున్నా ఇందిరే అతనిపై బాంబు దాడి చేయించిందని చేయించిందని, కావాలని చికిత్స ఆలస్యం చేయించిందని ఆరోపణలున్నాయి. లలిత్‌ చనిపోయిన వార్త రాగానే సంజయ్‌, ధవన్‌ కలిసి…

లలిత్‌ మిశ్రా హత్యను ఆనందమార్గీల నెత్తిన చుట్టడానికి చూస్తున్నా ఇందిరే అతనిపై బాంబు దాడి చేయించిందని చేయించిందని, కావాలని చికిత్స ఆలస్యం చేయించిందని ఆరోపణలున్నాయి. లలిత్‌ చనిపోయిన వార్త రాగానే సంజయ్‌, ధవన్‌ కలిసి రైల్‌ భవన్‌లో అతని ఆఫీసును మూసేయించి, సీలు వేసేశారు. మారుతి కంపెనీకి సంబంధించి మిశ్రా కొన్ని డాక్యుమెంట్లు సంపాదించి, వాటి సాయంతో సంజయ్‌ను, ఇందిరను బ్లాక్‌మెయిల్‌ చేద్దామనుకున్నాడని, ఆ కాగితాల కోసమే అతని ఆఫీసుకు తాళం వేశారని పుకార్లు వచ్చాయి. వీటన్నిటిపైనా పార్లమెంటులో ఆందోళన చేయడానికి ప్రతిపక్షాలు కృతనిశ్చయంతో వున్నాయి. జులై-ఆగస్టులో జరగవలసిన పార్లమెంటు సమావేశాన్ని జరగనివ్వాలా, లేక వాయిదా వేయించాలా అని తటపటాయిస్తూ వుంటే పులి మీద పుట్రలా యీ కోర్టు తీర్పు కూడా వచ్చిపడింది. ఇక ప్రతిపక్షాలు చెలరేగిపోతాయి. తను పదవిలో వుంటే వారిని ఎలాగోలా అదుపు చేయవచ్చు, ఇప్పుడే రాజీనామా చేసి, వేరే ఎవరినైనా కూర్చోబెడితే తనంత సమర్థవంతంగా చేస్తారో లేదో, తనకు సాయపడుతున్నట్లు నటిస్తూ తన వెనక్కాల గొయ్యి తవ్వి పూడ్చిపెట్టి, వాళ్లే శాశ్వతంగా సీటుకి అతుక్కుపోతారేమో తెలియదు. ఈ సందేహాల ఆమె తన సీనియర్‌ కాబినెట్‌ సహచరులు జగ్జీవన్‌ రామ్‌, వైబి చవాన్‌, స్వరణ్‌ సింగ్‌లను పిలిచి సుప్రీం కోర్టు తీర్పు వచ్చేవరకు తను పదవిలో వుండాలా వద్దా, మీ సలహా ఏమిటి అని అడిగింది. 'మీరు యిప్పుడు గద్దె దిగిపోతే సర్వనాశనం' అని ముగ్గురూ చెప్పారు కానీ వేర్వేరు కారణాలతో చెప్పారు.

''సాధారణంగా యిలాటి కేసుల్లో సుప్రీం కోర్టు పూర్తి స్టే యివ్వదు, కొన్ని షరతులతో కూడిన స్టే యిస్తుంది. అది వచ్చేదాకా మీరు ఓపిక పడితే మంచిది. ఈ లోపుగా మనం తీర్పుపై తిరగబడితే బాగుండదు.'' అన్నాడు జగ్జీవన్‌. ఆయన నెహ్రూ మంత్రివర్గంలో కూడా పనిచేసిన నాయకుడు. హరిజనులకు పెద్దదిక్కుగా వ్యవహరిస్తూ, అపారమైన రాజకీయ, పరిపాలనా అనుభవం, చాకచక్యం కలిగినవాడు. ఉన్నత పదవులపై ఆశ ఎక్కువ. అవినీతిపరుడన్న చెడ్డపేరు కూడా వుంది. కేంద్రమంత్రిగా వుంటూ దశాబ్దకాలం పాటు ఇన్‌కమ్‌ టాక్సు కట్టలేదు. దానిపై పార్లమెంటులో చర్చ వస్తే ''మర్చిపోయా'' అనేశాడు సింపుల్‌గా. అతన్ని పదవిలోంచి తీసేయమని ప్రతిపక్షాలు ఎంత డిమాండ్‌ చేసినా ఇందిర రక్షించింది. దానికి గాను, ఇందిర-మొరార్జీ పోటీ పడినపుడు జగ్జీవన్‌ ఇందిరను సమర్థించాడు. అక్కడితో ఋణం తీరిపోయిందనుకున్నాడు. కానీ ఇందిర అలా అనుకోలేదు. ఎప్పటికీ తనకు విధేయుడిగానే వుండాలనుకుంది, అలా వుండడనీ ఆమెకు తెలుసు. యాక్టివ్‌ రాజకీయాల్లో వుంటే ఎప్పటికైనా తనకు ఎసరు పెడతాడన్న భయంతో 1969లో జాకీర్‌ హుస్సేన్‌ పోయినప్పుడు ''మిమ్మల్ని రాష్ట్రపతిగా చేస్తాను'' అంది. ''వద్దు, నాకిక్కడే హాయి'' అన్నాడు జగ్జీవన్‌. కాబినెట్‌లో వుంటే ఎప్పటికైనా ప్రధాని కావచ్చనే ఆశతో. ఇప్పుడు ఆ అవకాశం వచ్చి ఒళ్లో పడినట్లుందని అతని అంచనా. 'సుప్రీం కోర్టు తీర్పు ఆమెకు వ్యతిరేకంగా వస్తే ఆమె దిగక తప్పదు. సీనియర్‌ నాయకుడిగా హరిజన్‌ కార్డు ఉపయోగించి, తను ప్రధాని కావచ్చు. పైగా జెపి కూడా 'ఇందిర కంటె జగ్జీవన్‌ ప్రధానిగా వుండడం మేలు' అని ప్రకటనలు యిస్తున్నాడు. తీర్పు ఆమెకు అనుకూలంగా వచ్చినా తనకు నష్టం లేదు. యథాతథ స్థితి కొనసాగుతుంది. ఈ లోపుగా ఇందిర ఏదైనా తీవ్రచర్య తీసుకుంటే మాత్రం తనకు నష్టమే' అనుకున్నాడు.  అతని ఆలోచనాధోరణిని ఇందిర గ్రహించింది.

ఇక వైబి చవాన్‌ విషయానికి వస్తే అతను ఇందిర తర్వాత నెంబర్‌ టూ స్థానానికి మెంటల్‌గా ఎప్పుడో ఫిక్సయిపోయాడు. ఇప్పుడు ఆమె అర్జంటుగా దిగిపోయినా, తీర్పు ప్రతికూలంగా వచ్చి దిగాల్సివచ్చినా, తనను ప్రధానిని చేసేవారెవరూ లేరు. ప్రతిపక్షాలు తనమీద కూడా కత్తి కట్టివున్నాయి. జెపి ప్రకటన కారణంగా జగ్జీవన్‌ ప్రధాని కావచ్చు. ఇప్పుడు ఇందిర యిచ్చే గౌరవం అతనిస్తాడో లేదో తెలియదు. ''అందువలన మీరు రాజీనామా చేయనక్కరలేదు'' అన్నాడు.

ఇక స్వరణ్‌ సింగ్‌ వివాదరహితుడు, పెద్దమనిషి. 'నేను గద్దె దిగాల్సి వస్తే స్వరణ్‌ సింగ్‌ను నా స్థానంలో కూర్చోబెడతాను. తిరిగి వచ్చాక సీటు ఖాళీ చేయమంటే వెంటనే చేసేస్తాడు. తక్కినవాళ్లను నమ్మడానికి లేదు.' అని ఇందిర తన సన్నిహితులతో అన్న విషయం ఎవరోకానీ స్వరణ్‌కి చెప్పారు. దాంతో అతని మదిలో ఆశ మొలిచింది – కొన్ని నెలల పాటైనా ప్రధాని కావచ్చు కదాని. కానీ యిప్పుడు 'రాజీనామా చేస్తే మంచిది' అని ఇందిరకు సలహా యిస్తే తన మీద కూడా నమ్మకం పోతుంది. అందుకని ''రాజీనామా చేయకండి, ఒకవేళ మీరు సొంత నిర్ణయంతో చేద్దామని నిశ్చయించుకుంటే, దానిలో పొరబాటు ఏమీ లేదని మాత్రం చెప్పగలను.'' అన్నాడు. 

కమ్యూనిస్టు నేపథ్యం వున్న కేంద్ర మంత్రి చంద్రజిత్‌ యాదవ్‌ యింట్లో బరువా అధ్యక్షతన నమ్మకస్తులైన కాంగ్రెసు నాయకులతో సమావేశం జరిగింది. జూనియర్‌ మంత్రి ఐనా ప్రణబ్‌ ముఖర్జీని పిలిచారు. ఇందిర దిగిపోవలసిన అవసరం వస్తే ఆమె స్థానంలో ఎవరు వస్తే బాగుంటుంది అని చర్చించారు. జగ్జీవన్‌ రామ్‌ అని కొందరు, స్వరణ్‌ సింగ్‌ అని కొందరూ అన్నారు. స్వరణ్‌ అయితే మెతకవాడు కాబట్టి బెటరు అనుకున్నా జగ్జీవన్‌ కులం, సీనియారిటీని విస్మరిస్తే బాగుండదని కొందరు వాదించారు. రేపు సుప్రీం కోర్టులో ఇందిర గెలిచినా జగ్జీవన్‌ గద్దె దిగి ఆమెకు అప్పగిస్తాడా లేక పార్టీని చీలుస్తాడా అన్నది కూడా ఎవరూ చెప్పలేకపోయారు. సుప్రీం కోర్టు స్టే యిచ్చి అదనంగా సమయం ఎలాగూ యిస్తుందని, అంతిమ తీర్పు రావడానికి చాలా సమయం పడుతుందనీ, అందువలన ఇందిరకు ప్రస్తుతానికి ముప్పు రాదనీ మరి కొందరన్నారు. ఎటూ తేల్చలేక ఎట్టి పరిస్థితుల్లోనూ ఇందిరనే సమర్థిస్తే మంచిదనుకున్నారు. ఆమె నాయకత్వంలో విశ్వాసాన్ని ప్రకటిస్తూ, దేశ సుస్థిరతకు, ప్రగతికి ఆమె పదవిలో కొనసాగడం అత్యావశ్యకం అంటూ కాబినెట్‌ మంత్రులు, ముఖ్యమంత్రులు, రాష్ట్రమంత్రులు ప్రకటన చేస్తే మంచిదనుకున్నారు. ఆ ప్రకటన ఎలా వుండాలో హక్సర్‌ని డ్రాఫ్టు చేయమన్నారు. 

నిజానికి కాంగ్రెసు వాళ్లందరూ యీ గొడవ కంతా మూలకారణం మీరేనంటూ హక్సర్‌పై మంటగా వున్నారు. ఇందిరకు ఎన్నికల ఏజంటుగా పనిచేసిన యశ్‌పాల్‌ కపూర్‌ తన ప్రభుత్వోద్యోగానికి రాజీనామా పత్రాలను జనవరి 13న సమర్పించాడు. అవి సరిగ్గా ప్రాసెస్‌ కాక, హక్సర్‌ వాటిని ఆమోదించేసరికి జనవరి 25 వచ్చింది. అంటే అప్పటిదాకా యశ్‌పాల్‌ సర్వీసులో వున్నట్టే లెక్క. ఇందిర ఎన్నిక రద్దు కావడం కావడానికి ముఖ్యకారణాల్లో  ప్రభుత్వోద్యోగి చేత పనిచేయించుకోవడం ఒకటి. యశ్‌పాల్‌ రాజీనామా అందించగానే హక్సర్‌ ఆమోదించి వుంటే యీ సమస్య వచ్చేది కాదు కదాని వాళ్లనసాగారు. నిజానికి రాజీనామా యిచ్చేందుకు ఆరు రోజులు అంటే జనవరి  7 నుంచే యశ్‌పాల్‌ ఇందిర ఎన్నికల సభల్లో పనిచేశాడని కోర్టు కనుగొంది. అందువలన హక్సర్‌ను తిట్టడం అనవసరం అని వారికి తోచలేదు. ఏది ఏమైనా హక్సర్‌ డ్రాఫ్టింగ్‌లో దిట్ట. గతంలో యిలాటివి ఎన్నో డ్రాఫ్టు చేశాడు. ఈ ప్రకటన కాపీ పంపగానే అందరూ ఎగబడి సంతకాలు పెట్టేశారు. ఏ మాత్రం ఆలస్యమైనా ఇందిరకు అనుమానం వస్తుందేమోనని భయపడ్డారు. తమ పేర్లు పేపర్లలో వచ్చి తీరాలని ఎడిటర్లకు నొక్కిచెప్పారు. కానీ స్వరణ్‌ సింగ్‌ మాత్రం ఆలస్యం చేశాడు. దానికి కొద్ది నెలల తర్వాత మూల్యం చెల్లించాడు కూడా. 

ఇందిరకు అనుకోకుండా ఎన్నికల కమిషనర్‌ టి.స్వామినాథన్‌ నుంచి మద్దతు లభించింది. అతను గతంలో ఇందిర వద్ద కాబినెట్‌ సెక్రటరీగా పనిచేశాడు. రిటైరయ్యాక అతని పదవీకాలాన్ని ఇందిర పొడిగించింది. తర్వాత చీఫ్‌ ఎలక్షన్‌ కమీషనర్‌గా నియమించింది. అతను తనంతట తానే ప్రకటన చేస్తూ 'ప్రధానమంత్రితో సహా పదవులలో వున్న వారిపై అనర్హత ఏదైనా వుంటే దాన్ని తొలగించే అధికారం నాకుంది' అన్నాడు. అలాటి అధికారం ఎన్నికల కమిషనర్‌కు వుండడం మంచిది కాదని, ఆ రూలు మార్చాలని అతనికి ముందు ఆ పదవిలో వున్న సేన్‌వర్మ 1971లోనే సూచించాడు. కానీ స్వామినాథన్‌ అభిప్రాయం వేరేలా వుంది. సుప్రీం కోర్టు తీర్పు ఎలా వున్నా, యితనిచ్చిన భరోసాతో పదవిలో కొనసాగవచ్చని ఇందిర అనుకున్నా, కోర్టులో గట్టిగానే పోరాడాలని ఇందిర అనుకుంది. సిద్ధార్థ శంకర్‌ రాయ్‌ను, గోఖలేను అడిగింది. ''అలహాబాద్‌ కోర్టు పబ్లిసిటీ కోసం యిలాటి తీర్పు యిచ్చింది కానీ సుప్రీం కోర్టుకి ఆ ఖర్మ పట్టలేదు. ఇవి పూర్తిగా సాంకేతికమైన కారణాలు. వీటి కోసం నిన్ను తొలగించి దేశంలో అరాచకం సృష్టించే పని సుప్రీం కోర్టు చేయదు'' అని చెప్పారు. ఎందుకైనా మంచిదని నానీ ఫాల్కీవాలాను బొంబాయి నుంచి ఢిల్లీకి పిలిపించింది. ఇందిర చేపట్టిన బ్యాంకుల జాతీయకరణ, రాజభరణాల రద్దులకు వ్యతిరేకంగా ఫాల్కీవాలా సుప్రీం కోర్టులో వాదించాడు. అందువలన అతను తిరోగమనవాది అని ఇందిర గతంలో ఆరోపించింది. ఇప్పుడు మాత్రం అక్కరకు వచ్చాడు. అతను ''ఈ కేసు మనం గెలవగలం. కానీ మీరు పదవిలో కొనసాగడం వలన కలిగే ఔచిత్యభంగం మాటేమిటి?'' అని అడిగాడు. ఎవరేమనుకున్నా సరే, కేసు వేయక తప్పదు అని ఆమె నిర్ణయించుకుంది. ఎందుకంటే అప్పటికే కొందరు ఆమె దిగిపోతే బాగుంటుందనసాగారు.

వారిలో యంగ్‌ టర్కులు ముఖ్యులు. గతంలో ఆమె మొరార్జీతో పోటీ పడినప్పుడు మొరార్జీని అప్రతిష్ఠపాలు చేసి, ఇందిర గెలిచేట్లా చేసిన గ్రూపు అది. ఇందిర గెలిచిన తర్వాత ఆమె పరిపాలన వారికి నచ్చడం మానేసింది. వారు విమర్శించసాగారు. వారిలో చంద్రశేఖర్‌ ముఖ్యుడు (ఎమర్జన్సీ విధించగానే అతన్ని జైల్లో పడేయించింది). అతను కాంగ్రెసు పార్టీ వర్కింగ్‌ కమిటీకి ఎన్నిక కావడం ఆమెకు యిష్టం లేదు. అయినా అతనికి మద్దతు ఎక్కువగా వుండడంతో ఏమీ చేయలేకపోయింది. జెపి ఉద్యమం ఉధృతమయ్యాక, 'ఆయనతో మీరు చర్చలు జరిపితే మంచిది' అని సూచించినందుకు మోహన్‌ ధారియాను మంత్రిమండలి నుంచి తప్పించివేసింది. ఇప్పుడు మోహన్‌ ధారియా ఆమె రాజీనామా చేసి స్వరణ్‌ సింగునో, జగ్జీవన్‌నో కూర్చోబెట్టాలని బహిరంగంగా డిమాండ్‌ చేశాడు (ఎమర్జన్సీలో అతనికీ జైలువాసమే) తక్కిన యంగ్‌ టర్కులు కూడా మోహన్‌తో గొంతు కలుపుతున్నారు.  వాళ్లంతా జగ్జీవన్‌కు మద్దతిస్తున్నారని, అతనితో నిరంతరం చర్చలు జరుపుతున్నారని ఇంటెలిజెన్సు శాఖ ఇందిరకు నివేదిక యిచ్చింది. జగ్జీవన్‌ 'హైకోర్టు తీర్పు ఆషామాషీ కాదు' అని అంటూ తను రంగంలో దిగితే ఎంతమంది తనవైపు నిలుస్తారా అని లెక్కలు వేసుకుంటున్నాడు. కానీ చాలినంత బలం లేదని జంకుతున్నాడు. 

ఆ విషయం ఇందిరకు తెలిసింది. పరిస్థితులు అనుకూలించకపోతే తన స్థానంలో కమలాపతి త్రిపాఠీని కూర్చోబెట్టాలని, తీర్పు రాగానే అతన్ని దింపి తను తిరిగి వచ్చేయవచ్చని ఆమె యోచన చేసింది. అయితే త్రిపాఠీకి ఎందరు మద్దతిస్తారో కనుక్కోమంది. ఈ విషయం తన వద్ద ఎవరో ప్రస్తావించినపుడు జగ్జీవన్‌ ''మద్దతిస్తాను కానీ ఒక షరతు. అతను ఇందిరను మళ్లీ తిరిగి రానివ్వకూడదు. ఆమెపై రెండు, మూడు విచారణ కమిషన్‌లు వేస్తే సరిపోతుంది.'' అన్నాడు. 'మారుతి, నగర్‌వాలా కేసు, లలిత్‌ మిశ్రా హత్య.. యిలాటి ఏ కేసుపై విచారణ ప్రారంభించినా ఇందిర ప్రతిష్ఠ మసకబారుతుంది. ఆమె తిరిగి రావడం కష్టమై పోతుంది' అని జగ్జీవన్‌ ప్లాను. ఇవన్నీ వింటున్నకొద్దీ ఎలాగైనా సరే ఒక్క క్షణం కూడా తను గద్దె దిగకూడదని ఇందిర మరింత దృఢంగా అనుకుంది. (సశేషం)  (ఫోటో – స్వరణ్‌ సింగ్‌) 

-ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జులై 2016) 

[email protected]

Click Here For Archives