కృష్ణాపుష్కరాల సందర్భంగా విజయవాడలో రోడ్ల విస్తరణ చేపట్టారు. 'గాదెలో ధాన్యం గాదెలోనే వుండాలి, పిల్లల కడుపులు నిండాలి అంటే కుదురుతుందా? రోడ్ల మీద గుళ్లు అలాగే వుండాలి, అంతర్జాతీయ స్థాయి నగరం వెలవాలి అంటే పొసుగుతుందా? ఆమ్లెట్టు కావాలంటే గుడ్డు పగలాల్సిందే! పెద్ద రోడ్డు కావాలంటే గుడి లేచిపోవాల్సిందే' అంటూ చిన్నా, పెద్దా నలభై గుళ్లు కూల్చేశారు. గుడిసెల జోలికి వెళ్లడమంటే భయం కానీ గుడి తీయడం ఎంతసేపు! ఇంటికన్నా గుడి పదిలం అనే సామెతను తిరగరాయాలి. ఈ రోజుల్లో గుళ్లు పదిలం కాదు. అందునా బాబుగారి రాజ్యంలో! ఎందుకంటే ఈ మధ్యే ఆయన అన్నారు – పాపులు తమ పాపాలు కడిగేసుకుందామని గుళ్లకు వెళతారని! వాళ్లకా ఛాన్సు లేకుండా చేస్తున్నారన్నమాట. పాపాలు కడుక్కునే అవకాశం లేకుండా చేస్తే పాపాలే చేయరని, ఆ విధంగా సమాజం పరిశుభ్రంగా వుంటుందని ఆయన ఐడియా కాబోలు. అయితే రాష్ట్రంలో చాలా రద్దీ వున్న పెద్దపెద్ద గుళ్ల దగ్గర మొదలు పెట్టవచ్చు కదా, యీ వూళ్లోనే ఎందుకు మొదలెట్టారన్న అనుమానం రావచ్చు. దానికీ ఓ లాజిక్ వుంది. కితం ఏడాది గోదావరి పుష్కరస్నానం చేస్తే పాపాలు పోతాయని రెండు రాష్ట్రాలూ ప్రచారం చేశాయి. ఈ సారి కృష్ణాపుష్కర స్నానం గురించి కూడా మళ్లీ అదే ప్రచారం చేస్తారు. విజయవాడలో స్నానం చేశాక యిక గుడితో అవసరం ఏముందని అనుకుని వుండవచ్చు.
చంద్రబాబు స్థానంలో మరో సూర్యబాబు వచ్చినా, పాపప్రక్షాళనపై వారికి ఎలాటి అభిప్రాయమున్నా, రహదారుల్లో ప్రార్థనాస్థలాలు తొలగించవలసినదే. ఎందుకంటే గుడి ఉన్నంత మేర మాత్రమే రోడ్డు స్థలం పోతుందనుకోకూడదు. గుడి వెలవగానే ముందు కొబ్బరికాయల కొట్టు, పూలకొట్టు వెలుస్తాయి. అమ్మవారి గుడి అయితే కుంకం, పసుపు, జాకెట్టు గుడ్డల షాపూ వెలుస్తుంది. చెప్పులు దాచేవాడు చెక్కపెట్టెతో సహా అవతరిస్తాడు. సైకిళ్లు, స్కూటర్ల పార్కింగు ప్రారంభమవుతుంది. భక్తులే కాదు, ఆ రోడ్డు మీద పనివున్నవాళ్లు కూడా తమ వాహనాలను అక్కడే అక్రమంగా పార్క్ చేస్తారు – గుడి పేరు చెపితే ఏ పోలీసూ రాడని ధైర్యం. రాష్ట్రంలో పురాతన దేవాలయాలు ఎన్నో నిర్వహణ లేకుండా శిథిలమవుతూ వుంటాయి. వాటిని పట్టించుకోరు కానీ, యిలా రోడ్డు మీద గుళ్లను డెవలప్ చేయడానికి ఎందరో ఉరకలు వేసుకుంటూ ముందుకు వస్తారు. గుడికి ప్రాకారం ఏర్పడుతుంది, రోడ్డు ఎలాగూ ప్రభుత్వస్థలమే కాబట్టి ఎంత కబ్జా చేసినా అడిగేవాళ్లు లేరు. ఎవరైనా అధికారి వచ్చి అడిగితే, 'రోడ్ల మీద అక్రమంగా వెలసిన మసీదులను, దర్గాలను తొలగించి ఆనక మమ్మల్ని అడగండి' అంటారు, మసీదులు, దర్గాల జోలికి వెళితే వాళ్లు 'గుళ్లు తీసేసి అప్పుడు రండి' అంటారు. ఏ దర్గాకు, ఏ గుడికి ఏ నాయకుడు భక్తుడిగా వున్నాడో తెలియక పోలీసులు వూరుకుంటారు. ఏదైనా కాలనీ ప్లాను చేసినప్పుడు కొంత మేర పార్కు వుండి తీరాలని నగరాభివృద్ధి శాఖ పట్టుబడుతుంది. కాలనీ వెలసిన ఏడాది తర్వాత ఆ పార్కును ఖాళీగా వుంచరు. అక్కడో గుడి కట్టేస్తారు. పర్యావరణమా గాడిదగుడ్డా అంటారు. గుడంటూ పెట్టాక ఉత్సవాలకేం లోటు? ఏదో ఒకటి చేస్తూ శబ్దకాలుష్యం పెంచుతారు. నేను రాస్తున్నది ఏ ప్రార్థనాస్థలానికైనా వర్తిస్తుంది. విజయవాడలో అయితే కొన్ని కొండలనే క్రైస్తవులు ఆక్రమించారు. అక్రమంగానో, సక్రమంగానో నాకు తెలియదు.
గుళ్ల కూల్చివేతకు వ్యతిరేకంగా ధర్నాలు, బంద్‌లు చేస్తున్నవారెవరి దగ్గర యీ సమస్యకు పరిష్కారం లేదు. 'రోడ్డు విస్తరణ అంటూ అటూ, యిటూ రోడ్డు పెంచి, మధ్యలో కరంటు స్తంభాలను అలాగే వదిలేశారు, వాటిని తీయలేదు కానీ గుడిని తీసేశారేం?' అని అడుగుతున్నారు కొందరు. అదే తమాషా, నాకు సరిగ్గా తెలియదు కానీ కొందరు నాయకుల యిళ్లకు ప్రమాదం లేకుండా విస్తరణ చేపట్టి వుంటారు. సరే, ఆ విద్యుత్‌స్తంభాలను కూడా మార్చేసి, నాయకుల యిళ్లను కూడా పడగొట్టేశారనుకోండి. రోడ్డు మధ్య వున్న గుళ్లను ఏం చేయాలో మీరు చెప్పగలరా? 'అభివృద్ధికి సహకరిస్తాం, ఆయన అఖిలపక్ష సమావేశం ఏర్పరచి మా అందరి సలహాలు కోరితే యిస్తాం' అంటున్నారు.
ఇదో బడాయి! బాబు ఛస్తే అఖిలపక్షసమావేశం ఏర్పరచరని తెలిసి యిలాటి డిమాండు చేస్తారు. బాబు దృష్టిలో ఆయనొక్కరే అభివృద్ధి కాముకుడు, దీర్ఘదర్శి, ద్రష్ట, స్రష్ట, మరోటీ, యింకోటీ. 'ఇన్ని క్వాలిటీస్ పెట్టుకుని పోయిపోయి యింకోడి సలహా అడగడమేమిటి నా బొంద' అనుకుంటారాయన. అవతలివాళ్లని సలహాలు చెప్పనివ్వకుండా నోరు కుట్టేస్తేనే సవాలక్ష చెప్పారు – రాజధాని అక్కడ వద్దన్నారు, పచ్చని పొలాలు లాక్కోద్దన్నారు, సింగపూరెందుకు, జపానెందుకు, దుబాయి బుర్జ్ కట్టిన భారతీయ కంపెనీలు మన దగ్గరే వుండగా అన్నారు, స్థలం మనం యిచ్చి సింగపూరు వాళ్లకు మేజర్ వాటా ఏమిటన్నారు, స్విస్ ఛాలెంజ్ వద్దన్నారు, ఒప్పందాలు బయటపెట్టమన్నారు, అన్నీ అమరావతిలోనే కుక్కడం దేనికి, రాష్ట్రమంతా పంచమన్నారు, అప్పుచేసి పప్పుకూడెందుకు అన్నారు, పూజలమీద పూజలెందుకన్నారు, పాతవాటికే ప్రారంభోత్సవాలెందున్నారు… ఇవన్నీ ప్రత్యక్షంగా వినడానికా అఖిలపక్షం పెట్టడం? బాబు యింకోళ్లను సంప్రదించరుగాక సంప్రదించరు. అసలు ఎసెంబ్లీలోనే ప్రతిక్షకులను, ప్రతిపక్షులను చూడడం యిష్టం లేక గింజలు చల్లి తమవైపు లాక్కుని వస్తున్నారు. అలాటిది ప్రత్యేకంగా పిలిచి పీట వెయ్యడమా? నెవర్!
ఇప్పుడు గుళ్ల గురించి రగడ చెలరేగగానే ఓ కమిటీ వేసేశారు. దానిలో వున్నదెవరు? తన కాబినెట్‌లో మంత్రులే, జీహుజూర్ అనేవాళ్లే. కమిటీలో ఓ మంత్రిగారు మేం కూల్చేస్తేం ఏం? బాబుగారు యింతకంటె డబుల్ సైజులో మళ్లీ కడతారంటున్నారు. కట్టేదానికి కూల్చడం దేనికి? అయ్యవారేం చేస్తున్నారంటే చేసిన తప్పులు దిద్దుకుంటున్నారన్నాట్ట! వాస్తు దోషాల పేర చెప్పి కూల్చడం-కట్టడం, కట్టడం-కూల్చడం ఎక్కువై పోయింది. దానికి గుళ్లు కూడా తోడవుతాయా? నిజానికి యీ రోడ్డు మీది గుళ్లకు పరిష్కారం ఏమిటంటే ఒక ఏరియాలోని గుళ్లన్నీ సశాస్త్రీయంగా తొలగించి, వాటన్నిటిని కలిపి ఆ ఏరియాలోని ఓ ప్రభుత్వస్థలంలో ఒకే కాంప్లెక్సులో స్థాపించడం! 'గుళ్లు చోటు మారేయి తప్ప, తొలగించలేదు, అదే ఏరియాలోనే వుంటాయి కాబట్టి వాటికున్న క్షేత్రమహిమ ఎక్కడికీ పోదు' అని జనాల్ని వూరడించవచ్చు. రోడ్లూ విశాలమవుతాయి. కొత్తగా రోడ్డు మీద ఏ ప్రార్థనాలయం రానీయకూడదు. విగ్రహం కదిలిస్తే అరిష్టం అని ఎవరైనా వాదిస్తే, యాదగిరి నరసింహుడి కంటె పవర్‌ఫుల్లా అని అడగాలి. గుడి విస్తరణ పేరుతో మూల విరాట్టునే పక్కకు తరలించారు. ప్రతీదానికీ ప్రాయశ్చిత్త కర్మలుంటాయి. అయినా రోడ్డు మీద గుళ్లకు ధ్వజస్తంభం వుండదు, నిర్మాణాలు ఆగమశాస్త్రానుసారం వుండవు. కట్టే కాంప్లెక్సులో యిలాటివన్నీ పెట్టి దేవుళ్లకు మహిమ పెంచుతున్నాం అని నచ్చచెప్పవచ్చు. ఇప్పుడు ఆంధ్రప్రభుత్వం నుండి యిలాటి సబబైన సూచన వచ్చినా అవతలివాళ్లు వూరుకుంటారన్న నమ్మకం లేదు. 'ఆ ముక్క లెక్కెట్టుకోడానికి ముందు చెప్పాల' అన్నట్టు, గుడి కూల్చడానికి ముందు కన్సల్ట్ చేయాల్సింది అంటూ పట్టుబడతారు. ఇప్పుడు రంగంలోకి పీఠాధిపతులూ దిగారు.
ఆరెస్సెస్ నేపథ్యంతో వచ్చిన బిజెపి వాళ్లది అసలైన సంకటం. మరొకళ్లయితే హిందూమతాన్ని చులకనగా చూస్తున్నారని ఏకి పారేయవచ్చు. ఇప్పుడు ప్రభుత్వంలో పాలు పంచుకుంటూ యిలాటి చర్యలను సమర్థించుకోవడం మహా కష్టం. పుష్కరాలు రాబోతున్నాయి. జనాల్లో భక్తి పరవళ్లు తొక్కబోతోంది. ఇటువంటి చార్జ్‌డ్ ఎట్మాస్‌ఫియర్‌లో యింత దూకుడుగా, దురుసుగా ఎందుకు ప్రవర్తించాలో టిడిపి వారే చెప్పగలగాలి. గుజరాత్‌లో మోదీ 80 గుళ్లు తీసేయలేదా? అని వాదిస్తున్నారు. కరక్టు. ప్రతిఘటన లేకుండా మోదీ ఎంత చాకచక్యంగా తీయించేశాడో అది నేర్చుకోండి. ప్రతీదీ వివాదం చేసుకోవడం దేనికి? ఆంధ్ర ప్రభుత్వం ప్రస్తుతం ఎదుర్కుంటున్న యిబ్బంది – విశ్వాసరాహిత్యం (ట్రస్టు డెఫిషియన్సీ)! ప్రభుత్వం చెప్పేదానికి, చేసేదానికి పొంతన వుండటం లేదు. కేంద్రం నుంచి నిధులు రావటం లేదు కానీ లేకపోతేనా అని చెప్పుకుంటున్నారు. చూడబోతే వెనకబడిన జిల్లాలకై యిచ్చిన నిధులను దారి మళ్లించారని నీతి ఆయోగ్ కుండ బద్దలు కొట్టింది. జాతికి అంకితాలు, పునరంకితాలు, పునఃపునరంకితాలు అయిపోతున్న పట్టిసీమకు అనుమతులు లేవు, పోలవరం ప్రాజెక్టు 2018లో పూర్తి కాదని చిన్నపిల్లవాడు కూడా చెప్పగలడు. రాజధానికి డిపిఆర్ కూడా సిద్ధం కాలేదు. ఇలాటి పరిస్థితుల్లో రాజధాని చుట్టుపట్ల నిర్మాణాలకు కాంట్రాక్టు లిచ్చేశాం, వచ్చేస్తున్నాయి అని అరిచేతిలో స్వర్గం చూపిస్తూంటే ఎలా నమ్మగలరు?
ప్రజలను విశ్వాసంలోకి తీసుకుంటే తప్ప ప్రభుత్వంతో కలిసిరారు, దూరం నుంచి తమాషా చూస్తూ వుండిపోతారు. ఇలాటి పరిస్థితుల్లో గుడి కూల్చివేతల్లాటివి చేపట్టి ప్రజలను మరింత దూరం చేసుకోవడం తెలివైన పని కాదు. గుడి కూల్చివేతల అంశం ప్రతిపక్షాలతో కాకపోయినా, హిందూ సంస్థలవారితోనైనా సంప్రదించి వుంటే యింత రగడ జరిగేది కాదు. చివరగా – యివాళ గుడి అయింది, రేపు మరో హెరిటేజి భవనమౌతుంది. ఎప్పటికైనా శతాబ్దాల నాటి నగరాన్ని ఆధునీకరించడంలో యిలాటి అవకతవకలు, వివాదాలు, న్యాయపరమైన సమస్యలు తప్పవు. చిక్కులు లేకుండా అన్ని సదుపాయాలతో కొత్త నగరం కట్టాలంటే జనవాసాలు లేని చోటనే కట్టాలి. ఆ ముక్క బాబుగారికి అర్థం కాదు. అలా కడితే జనాలు రారనుకుంటారు. చండీగఢ్‌కి రాలేదా అంటే వినరు. ఆయన చూపులు, ఆలోచనలు విజయవాడ పరిధిని దాటి వెళ్లనంతకాలం యీ తరహా గొడవలు మరిన్ని రావడంలో ఆశ్చర్యం లేదు.
– ఎమ్బీయస్ ప్రసాద్ (జులై 2016)