తెలంగాణ ప్రభుత్వం హరితహారం స్కీము పెట్టి మొక్కలు పెంచమంటోంది. కొన్ని దశాబ్దాలుగా ప్రతీ ప్రభుత్వమూ యిలాటి ప్రచారం చేస్తూండడం చూస్తూనే వున్నాం. ముఖ్యమంత్రి మొక్కనాటుతున్న ఫోటోలతో హోర్డింగులు వెలుస్తాయి, ప్రతీ జిల్లాలో పార్టీ కార్యకర్తలు సామూహికంగా మొక్కలు నాటే కార్యక్రమం చేపడతారు. మీడియా కవరేజి వస్తుంది. రంగురంగుల ప్రకటనలు తయారుచేసే యాడ్ కంపెనీలు బాగుపడుతున్నాయి, పేపర్లకు, టీవీలకు ప్రభుత్వ ప్రకటనల ద్వారా ఆదాయం పెరుగుతోంది, గతంతో పోలిస్తే హోర్డింగులు మరిన్ని లేస్తాయి కానీ చెట్లు మాత్రం ఛస్తాయి. ఏదో ఒక పేరు చెప్పి కొట్టేస్తూనే వుంటారు. పర్యావరణం గురించి నిజంగా అంత స్పృహ వుంటే గత మన నగరాల్లో పాతికేళ్ల కంటె భూతాపం ఎందుకు పెరిగింది? చెట్లకు కూడా సెన్సస్ తీసి చూస్తే తెలుస్తుంది – ఎన్ని తగ్గాయో! ఈ కార్యక్రమంలో ఎంత చిత్తశుద్ధి వుందో యివాళ్టి ప్రచారంలో తెలియదు, రెండేళ్లు పోయాక కొత్తగా ఎన్ని మొక్కలు వచ్చాయి, పాతవాటిని ఎన్నిటిని కూల్చేశారు అనేది లెక్క వేస్తే తెలుస్తుంది. ప్రస్తుత కార్యక్రమాన్ని చేపట్టిన కెసియార్ వెరైటీ లేకుండా ఏదీ చేయరు కాబట్టి యీ కార్యక్రమానికి, గ్రహాలకు ముడి వేశారు.
ప్రతి పౌరుడు తన నక్షత్రం లేదా రాశి ఏదో తెలుసుకుని, దానికి అనువైన మొక్కలు డిపార్టుమెంటు నుంచి తీసుకుని పెంచాలిట. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం నక్షత్రాల ప్రకారం, రాశుల ప్రకారం మొక్కల జాబితా విడుదల చేశారు. తెరాస నాయకులు బహిరంగంగా ప్రచారం చేస్తున్నారు, టీవీల్లో చెప్పిస్తున్నారు. 'ఇదెక్కడి చోద్యం? ఈ స్కీము వలన ముస్లిములు, క్రైస్తవులు, నాస్తికులు, హేతువాదులు, నక్షత్రాలు తెలియనివారు వీళ్లందరికీ మినహాయింపు యిచ్చినట్లా? వారేమీ మొక్కలు పెంచనక్కరలేదా?' అని టీవీ చర్చల్లో నిలదీసినపుడు తెరాస నాయకులు 'నయానో, భయాన్నో జనాల చేత మొక్కలు పెంచేందుకు కెసియార్ కృషి చేస్తున్నారు, మెచ్చుకోండి' అని దబాయిస్తున్నారు. మామూలుగా చెప్తే వినరు కాబట్టి భక్తికి, అదృష్టం కలిసి రావడానికి ముడిపెడితే జనాలు వింటారనే భావంతో యిలా చెప్పి వుంటారని వాదన వినిపిస్తున్నారు. పర్యావరణానికి మంచిది, సంఘానికి మంచిది అంటే ఎవరూ పట్టించుకోరు కానీ దేవుడి పేరు చెప్తే భక్తితోనో, ఆశతోనో ఆ పని చేస్తారనే మాట వాస్తవమే. ఈ విషయాన్ని గుర్తించిన ఎన్టీయార్ తను ముఖ్యమంత్రిగా వుండగా ఒక మంచి సూచన చేశారు – తిరుపతిలో మొక్కలు విశేషంగా పెంచి, దైవదర్శనానికి వచ్చిన ప్రతివారికి ప్రసాదంతో బాటు, మొక్క కూడా చేతిలో పెడితే వాళ్లు యింటికి తీసుకుని వచ్చి దాన్ని నాటి, శ్రద్ధగా పెంచుతారని! ఇది ఏ మేరకు అమలైందో తెలియదు కానీ, తిరుపతి దేవుడు యిచ్చిన మొక్క అనగానే ఎవరూ పారేయరు. తెచ్చిన మూడువారాల తర్వాత ముక్కవాసన వేస్తున్న తిరుపతి లడ్డూని చేతిలో పెట్టినా కళ్ల కద్దుకుని తినేస్తాం తప్ప, వద్దనం. అలాగే మొక్కను కూడా ఎలాగోలా వాడిపోకుండా తంటాలు పడతార. కెసియార్ అలాటి ఆలోచన చేసి యాదగిరి, వేములవాడల భద్రాచలం, ఓరుగల్లు గుళ్ల ద్వారా, అలాగే మసీదుల ద్వారా, చర్చిల ద్వారా పంపిణీ ఏర్పాటు చేసి వుంటే ఏ చిక్కూ లేకపోయేది, లక్ష్యం నెరవేరేది. ఇప్పుడు నక్షత్రాలకు ముడిపెట్టడంతోనే చుక్కెదురవుతోంది.
ఎవరి నక్షత్రం ప్రకారం మొక్క నాటాలి అనేది ప్రధాన ప్రశ్న. ఇంటి యజమానిదా? తక్కినవారు ఏమై పోయినా ఫర్వాలేదా? అసలు యజమాని ఎవరనేది కూడా యీ రోజుల్లో ప్రశ్నార్థకమై పోయింది. ఒకప్పుడైతే మొగుడే యజమాని అనేవారు. ఇప్పుడు కొన్నిళ్లల్లో భార్యాభర్తలు సమానంగా సంపాదిస్తున్నారు. కొన్నిళ్లల్లో భార్యకు ఎక్కువ జీతం వస్తోంది, కొన్నిళ్లల్లో భార్యకు ఆస్తులు ఎక్కువ వుంటున్నాయి, కొన్ని సందర్భాల్లో పుట్టింటి కానుకగానో, స్వార్జితంగానో, యిన్కమ్ టాక్సు కారణాల చేతనో, యిల్లు భార్య పేరు మీద వుంటోంది. ఆస్తిపాస్తుల మాట ఎలా వున్నా, ప్రభుత్వసాయం కూడా యీ రోజుల్లో భార్య పేర యిస్తున్నారు. మొగుడి పేర యిస్తే తాగి తందనాలాడవచ్చనే జంకుతో, గ్యాసు, రేషనే కాదు, చౌక యిళ్లు కూడా భార్యల పేరే యిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఎవరి పేరుకు నప్పే మొక్క నాటాలన్నది వివాదానికి దారి తీస్తుంది. భర్త తల్లి అనారోగ్యంతో వుందనుకోండి. 'ఆవిడ ఆరోగ్యం మెరుగుపడడం తక్షణ లక్ష్యం కాబట్టి ఆవిడ నక్షత్రానికి సరిపడే మొక్క తెస్తా' అని భర్త అంటే 'ఆవిడకేనా, నాకూ బాగా లేదు, ఆవిడ మూలుగుతూంటుంది, నేను మూలగకుండా పళ్ల బిగువున సహిస్తున్నాను' అని భార్య పోట్లాట వేసుకోవచ్చు. గవర్నమెంటు ఒక్క మొక్కే ఉచితంగా యిస్తుంది మరి అంటే 'దానికేముంది, తక్కినవి డబ్బు పెట్టి కొందాం' అనవచ్చు. ఎందుకొచ్చిన గొడవ కుటుంబంలో ఎంతమంది వుంటే అన్ని నక్షత్రాల మొక్కలూ కొనేయవచ్చు అనవచ్చు కొందరు. మొక్కలు కొనగానే సరి పోదు, నీళ్లు పోయాలి, ఎరువులు చల్లాలి. మనుషులు తాగడానికే నీళ్లు దొరక్క అల్లాడుతూంటే మొక్కలకు కూడా కావాలంటే ప్రభుత్వం సప్లయి చేస్తుందా? ఊళ్లల్లో, యిండిపెండెంటు యిళ్లల్లో అయితే సాగుతుందేమో కానీ, నగరాల్లో, ఎపార్ట్‌మెంటు కాంప్లెక్సులలో యిది సాగే పనేనా? కాంప్లెక్సులో వాహనాల కోసం కట్టిన చోట షాపులు, షట్టర్లు, వాచ్‌మన్ యిళ్లు కట్టేస్తున్నారు. ప్లానులో బాల్కనీలు చూపించి, కట్టేటప్పుడు బెడ్రూమ్ని పొడిగించడమో, బాత్రూములు కట్టడమో చేస్తున్నారు. కిచెన్ గార్డన్ అన్నది స్లోగన్గానే మిగిలింది తప్ప అమలు చేసేవాళ్లు కనబడటం లేదు. ఇలాటి పరిస్థితుల్లో యింటికి నాలుగైదు మొక్కలు పెంచడం సాధ్యమయ్యే పనా?
నాలుగైదే అనడం సరికాదేమో, ఎందుకంటే ప్రభుత్వవారి జాబితా చూడండి. అశ్విని నక్షత్రం వారు ముష్టి చెట్టు పెంచాలిట, భరణివారు ఉసిరి, కృత్తిక వాళ్లు మేడి లేదా అత్తి. అశ్విని, భరణి, కృత్తికలో నాల్గో వంతు మేషరాశిలోకి వస్తాయి. మేషరాశి వాళ్లు పెంచాల్సిన చెట్టు ఎర్రచందనం (అది అటవీ శాఖ తప్ప మనం పెంచవచ్చా!?) అని యిచ్చారు మరి. అశ్విని నక్షత్రం ప్రకారం ముష్టి పెంచాలా? రాశి ప్రకారం ఎర్రచందనం పెంచాలా? క్లారిటీ లేదు. ఎవరైనా తెరాస నాయకుణ్ని అడిగితే రెండూ పెంచు తమ్మీ అనవచ్చు. ఇలా ఒక్కోళ్లకు రెండేసి మొక్కలు చొప్పున కుటుంబానికి ఓ పది లెక్కకు వస్తాయి. ఇన్ని పెంచాలి పాపం. నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులు, నకిలీ పురుగుమందులు.. అంటూ రైతులు వాపోతూ వుంటారు చూడండి, మనకు అవేమీ బుర్ర కెక్కవు, యిప్పుడు అనుభవంలోకి వస్తాయి. మొక్కలమ్మేవాళ్లు తక్కిన మొక్కలను సాధారణ రేట్లకు అమ్మినా ఈ జాబితాలో కనపడేవాటికి రేట్లు పెంచేయవచ్చు. వాహనాల నెంబర్ల విషయంలో చూడండి, అంకెలు కూడితే 9 వచ్చేవి, ఆరోహణాక్రమంలో వున్నవి అంటే వాటికి డిపార్టుమెంటే హెచ్చు రేట్లకు అమ్ముతుంది. అంకెల విషయంలో అయితే మనకు తెలిసిపోతుంది, కానీ మొక్కల విషయంలో ఏ మొక్క ఎలా వుంటుందో మనలో చాలామందికి తెలియవు. మామూలు మొక్కలు, చెట్లు అయితే ఫర్వాలేదు కానీ వీళ్లిచ్చిన జాబితాలోని పేర్లలో మొక్కల్లో చాలా భాగం పరిచితమైనవి కావు. ఎప్పుడూ కొనే ఆకుకూరల విషయంలోనే ఒక్కోప్పుడు గందరగోళ పడుతూ వుంటాం. ఇదేమిటయ్యా తోటకూర యిలా వుంది అంటే 'నాటు తోటకూర సార్' అంటాడు. ఇలా హెచ్చు రేటు తీసుకున్నా, ఒక దాని పేరు చెప్పి మరొకటి అమ్మేసినా మనకే తంటా. ఇల్లు పక్కా వాస్తు ప్రకారం కట్టించాం అని సంబరపడుతూండగానే యింటికి ఎవరో వాస్తు పండితుడు వచ్చి, 'ఎవడో కానీ మిమ్మల్ని మిస్‌గైడ్ చేశాడు, ఆ మూల మెట్లు రాకూడదు, పడగొట్టించండి' అని బెదరకొడతాడు. అలాగ యిప్పుడు వృక్షజ్యోతిష్కులు పుట్టుకుని వచ్చి 'అయ్యో యిది పులివెలగ మొక్క అని చెప్పి వాడు మీకు అంటకట్టేశాడు. ఇది పులివెలగ కాదండి, పిల్లివెలగ, అందుకే మీరనుకుంటున్నదేదీ జరగటం లేదు' అని అడలగొట్టగలరు.
ఇప్పటికే సంఖ్యాశాస్త్రం వుంది, నామశాస్త్రం వుంది, రాళ్ల శాస్త్రం వుంది. కార్లు అమ్మించేస్తున్నారు, పేర్ల స్పెల్లింగులు మార్పించేస్తున్నారు, వేళ్లకు రాళ్ల వుంగరాలు తొడిగిస్తున్నారు. ఇప్పుడు మొక్కలు కూడా వచ్చి లిస్టులో చేరాయి. ప్రభుత్వం రాశులు, నక్షత్రాల వరకు వచ్చింది. హరితజ్యోతిష్కులు వాటిని చరణాల వరకు చీల్చి మనల్ని వాళ్ల పాదాల మీద పడేయించుకుంటారు. ఒక్కో నక్షత్రానికి నాలుగేసి చరణాలు. ఆ విధంగా 108 వెరైటీ మొక్కలను మీకు అమ్మచూపవచ్చు. నక్షత్రం తెలియక అల్లాడేవారిని ఆటాడించవచ్చు. మీ అసలు నక్షత్రమేదో తెలుసుకోవడానికి అంజనం వేయాలనవచ్చు. ధనత్రయోదశి పేరు చెప్పి బంగారు షాపుల వాళ్లు విజృంభిస్తున్నట్లే, వేప, మద్ది ఆకులతో తయారుచేస్తున్నామంటూ అమ్ముకుంటున్న టూత్‌పేస్టుల వాళ్లు కొత్త ఎత్తులు ఎత్తవచ్చు. పెర్ఫ్యూమ్స్ను ఆడా, మగా అని చీల్చినట్లు, పళ్లు తోముకునేవాళ్లను కూడా రాశుల వారీగా విభజించవచ్చు. రాబోయే ఓ ఏడ్ – ఓ కుర్రాడు ఓ పేస్టుతో ఎంత తోమినా పళ్లు మెరవటం లేదు. ఏ షారూఖ్ ఖానో వచ్చి 'హేయ్, కన్యారాశి వాళ్లు తోముకునే పేస్టుతో తోమితే నీ పళ్లేమి మెరుస్తాయి బ్రో' అంటూ దాన్ని లాక్కుని అవతలికి విసిరేసి 'నువ్వు వృషభానివి. 'ఎడాకులపాయ' (అదేమిటో, ఎలా వుంటుందో నన్ను అడగవద్దు ప్లీజ్) చెట్టు ఆకులతో చేసిన ఫలానా టూత్పేస్టునే వాడు' అని యింకో పేస్టు ట్యూబ్ చేతిలో పెడతాడు. 'ఎద్దులాటి మొగాళ్లకోసం ఎడాకుల పాయ పేస్ట్' అనే కాప్షన్ వెనక్కాల నుంచి ఎవరో అరుస్తారు.
మన బాగోగులకు, మొక్కలకు లింకు పెట్టడం మొదలెడితే ఎక్కడ ఆగుతుందో తెలియదు. ఇంటావిడ మేనమామ వచ్చి 'మీ ఆయన వాళ్లమ్మ బాగు కోసం ఫలానా మొక్క పాతించాడు కదా, కానీ నీ నక్షత్ర ప్రకారం అది నీకు పడదు. నీకు నిద్ర పట్టకపోవడానికి కారణం అదే' అని చెప్పి వెళితే ఆ మొక్క పీకేదాకా ఆవిడ నిద్ర పోదు. ఒకవేళ అత్తాకోడళ్లు సఖ్యంగా వుండి ఆ యిల్లు శాంతినివాసంలా వెలిగిపోతుంటే, పక్కింటివాడికి కడుపుమంట కలగవచ్చు. ఓ రాయేసి ఒనిడా టీవీని పగలకొట్టినట్లు, 'వీళ్ల సౌభాగ్యానికి ఇదిగో యీ జిట్రేగి మొక్కే కారణం, దీని పనిపట్టాలి' అంటూ ఓరాత్రి వేళ గోడదూకి మొక్క పీకేయవచ్చు, లేదా పురుగులు పట్టించేయవచ్చు. ఇలాటివి జరిగితే మాత్రం వేసే మొక్కల కంటె పీకే మొక్కలు ఎక్కువై పోతాయి. వాస్తు భయాలు పెరిగాక కట్టేవి తక్కువ, కూల్చేవి ఎక్కువ అని అందరం గమనిస్తున్నాం కాబట్టి దీన్ని వేళాకోళంగా కొట్టి పారేయలేం.
– ఎమ్బీయస్ ప్రసాద్ (జులై 2016)