కుయ్‌.. కుయ్‌.. కుయ్‌.. ఆ సౌండింగెక్కడ.?

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతి నేడు. తెలుగునాట రాజకీయాల్లో తనదైన ముద్ర వేసి, వరుసగా రెండోసారి అధికార పీఠమెక్కిన రాజశేఖర్‌రెడ్డి, హెలికాప్టర్‌ ప్రమాదంలో దుర్మరణం పాలైన విషయం విదితమే. హెలికాప్టర్‌ రూపంలో ఆయన్ను…

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతి నేడు. తెలుగునాట రాజకీయాల్లో తనదైన ముద్ర వేసి, వరుసగా రెండోసారి అధికార పీఠమెక్కిన రాజశేఖర్‌రెడ్డి, హెలికాప్టర్‌ ప్రమాదంలో దుర్మరణం పాలైన విషయం విదితమే. హెలికాప్టర్‌ రూపంలో ఆయన్ను మృత్యువు వెంటాడి వుండకపోతే, తెలుగునాట రాజకీయాల ముఖ చిత్రం ఇంకోలా వుండేదన్నది నిర్వివాదాంశం. 

ఇక, రాజశేఖర్‌రెడ్డి ఎక్కడికి వెళ్ళినా, 'కుయ్‌.. కుయ్‌.. కుయ్‌..' అంటూ నినాదాలు చేసేవారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తన హయాంలో రాజశేఖర్‌రెడ్డి ప్రారంభించిన '108' సర్వీసుల గురించి ప్రస్తావిస్తూ ఆయన 'కుయ్‌ కుయ్‌ కుయ్‌..' అన్న మాట వాడేవారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డవారిని క్షణాల్లో ఆసుపత్రులకు తరలించేందుకు 108 సర్వీసుల్ని తెలుగు నాట అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారాయన. ఎన్నో ప్రాణాల్ని 108 సర్వీసులు కాపాడాయి. రోడ్డు ప్రమాద బాధితులకే కాదు, గర్భిణీలకు, ఇతరత్రా తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడ్తున్నవారికి 108 సంజీవనిగా మారింది. 

108 అంటే అప్పటికీ, ఇప్పటికీ రాజశేఖర్‌రెడ్డే గుర్తుకొస్తారు తెలుగు రాష్ట్రాల్లో అందరికీ. అంతలా ఆయన 108 సర్వీసుల్ని మారుమూల పల్లెలకీ తీసుకెళ్ళేలా చొరవ తీసుకున్నారు. దురదృష్టవశాత్తూ వైఎస్‌ మరణం తర్వాత 108 సర్వీసులు మొరాయించాయి. ఎప్పటికప్పుడు 108 సర్వీసుల చుట్టూ అనుమానపు మేఘాలు మ్ముకుంటున్నాయి. తప్పదన్నట్టు, తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు 108 సర్వీసుల్ని కొనసాగిస్తున్నాయి తప్ప, చిత్తశుద్ధితో మాత్రం ఆ అంబులెన్స్‌ సర్వీసుల్ని నిర్వహించడంలేదన్నది నిర్వివాదాంశం.

108 కారణంగా లబ్ది పొందిన సామన్యులు.. ఆ సర్వీసులు అప్పట్లో పనిచేసిన తీరునీ, ఇప్పుడు పనిచేస్తున్న తీరునీ బేరీజు వేసుకుని ఆవేదన వ్యక్తం చేస్తున్నారంటే, ఇప్పుడు 108 పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.