ఐసిస్ టెర్రరిజంతో మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ తల గోక్కుంటున్నారు. 'ఐసిస్‌కి నేను వ్యతిరేకం.. ఇస్లాం ఎక్కడా హింసను ప్రోత్సహించదు. ఇస్లాం మతం హింసను ఖండిస్తుంది. ఐసిస్‌ను తుదముట్టించాల్సిందే.. ప్రపంచానికి పెనుశాపంగా ఐసిస్ మారింది..' అంటూ పదే పదే ఐసిస్ గురించి మాట్లాడుతున్న ఒవైసీ మీద గతంలో ఐసిస్ సోషల్ మీడియా ద్వారా ఘాటుగా స్పందించిన సందర్భాలూ వున్నాయి.
ఇంతకీ, అసదుద్దీన్ ఒవైసీ ఎందుకు కెలుక్కుంటున్నట్లు.? 'మై నేమ్ ఈజ్ ఖాన్.. ఐ యామ్ నాట్ ఎ టెర్రరిస్ట్..' అంటాడు షారుక్‌ఖాన్ ఓ బాలీవుడ్ సినిమాలో. అప్పట్లో ఆ డైలాగ్ సూపర్ పాపులర్. ఓ ముస్లిం ఆవేదన అది. ముస్లింలంతా టెర్రరిస్టులేనన్న భావనను ఆ సినిమాలో ఆ హీరో ప్రశ్నిస్తాడు. అది సినిమా, అందులో కొంచెం 'ఎక్స్ట్రీమ్' వుంటుందనుకోండి.. అది వేరే విషయం. టెర్రరిస్టులంతా ముస్లింలు కాదు.. ఆ మాటకొస్తే తీవ్రవాదానికి అసలు మతమే లేదు.
కానీ, మజ్లిస్ అధినేత ఒవైసీ.. ఇటీవల హైద్రాబాద్‌లో పట్టుబడ్డ ఐసిస్ తీవ్రవాదులకు (తీవ్రవాద సానుభూతిపరులు అనాలేమో..) న్యాయసహాయం అందిస్తామని ప్రకటించడంతో వివాదం ముదిరి పాకాన పడింది. తీవ్రవాదులైనాసరే, వారికి న్యాయసహాయం అందించే బాధ్యతను భారత ప్రభుత్వం తీసుకుంటుంది. ముంబై టెర్రర్లో ఎంతోమందిని హతమార్చిన తీవ్రవాది కసబ్ తరఫున వాదించేందుకు ఎవరూ ముందుకు రాకపోతే, ప్రభుత్వమే న్యాయవాదిని ఏర్పాటు చేసింది. మన దేశంలో న్యాయవ్యవస్థ గొప్పతనమది. ప్రత్యేకంగా మజ్లిస్ పార్టీనో ఇంకో పార్టీనో తీవ్రవాదులకు న్యాయ సహాయం అందించడమేంటి.?
పాత బస్తీలో పట్టు నిలుపుకోవాలంటే, ముస్లింల మనసుల్ని గెలుచుకోవాలి. అమాయక ముస్లిం యువతలో అతి కొద్దిమంది మాత్రమే తీవ్రవాద సంస్థలవైపుకు మళ్ళుతుంటారు. అలా వారిని తీవ్రవాదులు ప్రేరేపిస్తున్నారు. పాకిస్తాన్ నుంచి తీవ్రవాద సంస్థలు హైద్రాబాద్‌లోని పాతబస్తీలోగల కొందరు యువతని టార్గెట్ చేసి, వారిని తమవైపుకు తిప్పుకుంటున్న విషయం విదితమే. అలాంటి వారి విషయంలో ప్రభుత్వం తరఫున అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. తీవ్రవాదం వైపు మళ్ళకుండా వారికి, దేశం మీద ఇష్టాన్ని పెంచి, తీవ్రవాదంపై అసహ్యాన్ని పెంచి, సమాజానికి ఉపయోగపడే పౌరులుగా తీర్చిదిద్దేందుకు పోలీస్ వ్యవస్థ ఎప్పుడూ సిద్ధంగానే వుంటుంది. కోటికి పైగా జనాభా వున్న హైద్రాబాద్‌లో, ఎంతమంది ముస్లింలు వుంటారు.? అందులో తీవ్రవాదం వైపు ఆసక్తి చూపుతున్నవారి సంఖ్య ఎంత.? ఈ ఈక్వేషన్స్ ఆలోచిస్తే, ఏ మతం అయినా ఇంకో మతం తీవ్రవాదం వైపు మళ్ళుతోందని అనడానికే ఇష్టపడదు.
భిన్నత్వంలో ఏకత్వం మన నినాదం. అన్ని మతాలకూ మన దేశంలో సమానమైన స్థానం దక్కుతోంది. దేశ ప్రజలంతా కులమతాలకతీతంగా కలిసిమెలిసి జీవిస్తున్నారు. దీన్ని చెడగొట్టడానికి తీవ్రవాద శక్తులు ప్రయత్నిస్తోంటే, దాన్ని ఖండించాల్సింది పోయి, ఆ విష భావజాలాన్ని నరనరానా జీర్ణించుకుపోయినవారికి న్యాయసహాయం అందించడం నూటికి నూరుపాళ్ళూ నాన్సెన్సే. న్యాయసహాయం చేస్తామంటూ నోరు జారేశాక, దాన్ని వెనక్కి తీసుకోవడానికి వీల్లేదు. అలా వెనక్కి తీసుకుంటే ఓటు బ్యాంకు గల్లంతయిపోతుంది. అదీ ఇప్పుడు మజ్లిస్ అధినేత అసదుదీన్ ఒవైసీ టెన్షన్. దాన్నుంచి బయటపడేందుకు పదే పదే ఐసిస్ మీద నోరు పారేసుకుంటున్నారు.