రోజులు మారాయి సినిమా ఆ చిత్రానికి కథ మాటలు అందించిన డైరక్టర్ మారుతిని కార్నర్ లోకి నెట్టింది. వెంకటేష్ తో భారీ సినిమా చేస్తున్న దర్శకుడు మారుతి, ఆ సినిమా విడుదల దగ్గరలోకి వచ్చాక, రోజులు మారాయి విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కాస్త ఇబ్బందులే కొని తెచ్చిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
నిజానికి రోజులు మారాయి సినిమాకు మారుతి ప్రెజెంట్స్ అని వద్దు అని, బాబు బంగారం నిర్మాతలు పదేపదే మారుతిపై వత్తిడి తెచ్చినట్లు తెలిసింది. కానీ మారుతి వినలేదని వినికిడి. రోజులు మారాయి క్లీన్ గా వుంటుందని, కావాలంటే చూడమని, వారికి చూపించినట్లు కూడా బోగట్టా. అయినా కూడా బాబు బంగారం నిర్మాతలు, మారుతి సమర్పణ తీసేసి విడుదల చేసుకోమని కోరారని వినికిడి.
అయినా కూడా ఆఖరికి మీడియాలో రోజులు మారాయి మారుతి సినిమాగానే ఫోకస్ అయింది. అలాగే విడుదలయింది..అలాగే టార్గెట్ అయింది. ఇప్పుడు ఫలితం చూసి తల పట్టుకుంటున్నారంతా. బాబు బంగారం ఓపెనింగ్స్ మీద దీని ప్రభావం పడుతుందేమో? అని ఆలోచిస్తున్నారు. పైగా విక్టరీ వెంకటేష్ తో మారుతి చేస్తున్న బాబు బంగారం, వెంకీ స్టయిల్ ఫ్యామిలీ సినిమా కాదట. పక్కా మాస్ మసాలా సినిమా అని వినికిడి. అయితే అలా ఫోకస్ చేయకుండా, ఫ్యామిలీ సినిమా అనే కలర్ ఇస్తున్నట్లు తెలుస్తోంది.