పవనిజం వర్సెస్‌ బన్నీ: ఇదేం ర్యాగింగ్‌.!

పవన్‌కళ్యాణ్‌ అభిమానుల్లోనూ కొందరు 'అతి' అభిమానులున్నారు. పవనిజం పేరుతో హంగామా చేస్తుంటారు. అసలు పవనిజం వేరు, ఆ ముసుగులో చేసే 'అతి' వేరు.. అంటూ పవన్‌ అభిమానులు చెబుతుంటారనుకోండి.. అది వేరే విషయం. ఆ…

పవన్‌కళ్యాణ్‌ అభిమానుల్లోనూ కొందరు 'అతి' అభిమానులున్నారు. పవనిజం పేరుతో హంగామా చేస్తుంటారు. అసలు పవనిజం వేరు, ఆ ముసుగులో చేసే 'అతి' వేరు.. అంటూ పవన్‌ అభిమానులు చెబుతుంటారనుకోండి.. అది వేరే విషయం. ఆ 'అతి'గ్ళాళ్ళు అల్లు అర్జున్‌ని బాగా ఇబ్బంది పెట్టేస్తున్నారు. బన్నీనే కాదు, మొత్తంగా మెగా ఫ్యామిలీని కూడా కంగారు పెట్టేస్తున్నారు. అన్ని ఫంక్షన్లలోనూ పవన్‌కళ్యాణ్‌ నినాదాలు చేయడంతో, 'మెగా చిరాకు' పీక్స్‌కి వెళ్ళిపోయింది. దాంతో మెగా ఫ్యామిలీ తరఫున వకాల్తా పుచ్చుకున్న బన్నీ, పవన్‌ అభిమానులకి పెద్ద క్లాసే తీసుకున్నాడు. 

హమ్మయ్య.. ఇక ఇక్కడితో అంతా సద్దుమణిగిపోతుందని బన్నీ అనుకున్నాడో లేదోగానీ, మెగా ఫ్యామిలీ చాలామంది హీరోలు ఊపిరి పీల్చుకున్నారనే ప్రచారం జరిగింది. కానీ, వివాదం మళ్ళీ మొదలైంది. తాజాగా 'సైమా' అవార్డుల ఫంక్షన్‌లో బన్నీనని పవన్‌ అభిమానులు కెలికేశారు. వారిని ఉద్దేశించి 'గమ్మునుండవోయ్‌..' అనేశాడు అల్లు అర్జున్‌. దాంతో రచ్చ మళ్ళీ మొదటికొచ్చేసింది. 

'గమ్మునుండవోయ్‌..' అంటూ బన్నీ చేసిన కామెంట్‌ చుట్టూ సోషల్‌ మీడియా వేదికగా అభిమానుల రచ్చ పీక్స్‌కి చేరుకుంటోంది. ఇంకోసారి అల్లు అర్జున్‌ ఈ 'గమ్మునుండవోయ్‌'పై వివరణ ఇచ్చుకోవాల్సి రావొచ్చేమో. నాగబాబు క్లాస్‌ పీకినప్పుడేమో అభిమానులు లైట్‌ తీసుకున్నారు. అల్లు అర్జున్‌ క్లాస్‌ పీకాక, అభిమానులు మళ్ళీ ర్యాగింగ్‌ మొదలు పెట్టేశారు. అసలు పవన్‌కళ్యాణ్‌ అభిమానులకీ, అల్లు అర్జున్‌కి ఎందుకు చెడినట్లు.? పెద్ద పుడింగా చెప్పొచ్చావ్‌.. అని అల్లు అర్జున్‌ని అభిమానులెందుకు సీరియస్‌గా తీసుకున్నట్లు.? ఈ వివాదం ముందు ముందు ఎక్కడిదాకా వెళుతుంది.? ఏమో మరి వేచి చూడాల్సిందే. 

అన్నట్టు, తన అభిమానులు వెర్సస్‌ అల్లు అర్జున్‌ ఎపిసోడ్‌పై పవన్‌ ఇప్పటిదాకా ఎందుకు స్పందించడంలేదో ఏమో.!