ఎమ్బీయస్‌: బైబిల్‌ కథలు – 48

నెబుచెడ్నజార్‌ మహా సామ్రాజ్యాన్ని పాలించాడు. భజనపరుల మాట విని తన గొప్పతనం చాటుకోవడానికి 90 అడుగుల పొడవు, 9 అడుగుల వెడల్పుతో తన బంగారు విగ్రహం భారీగా చేయించాడు. పౌరులందరూ దాని ముందు తల…

నెబుచెడ్నజార్‌ మహా సామ్రాజ్యాన్ని పాలించాడు. భజనపరుల మాట విని తన గొప్పతనం చాటుకోవడానికి 90 అడుగుల పొడవు, 9 అడుగుల వెడల్పుతో తన బంగారు విగ్రహం భారీగా చేయించాడు. పౌరులందరూ దాని ముందు తల వంచి ఆరాధించాలని, అలా చేయనివాణ్ని అగ్నిగుండంలో వేసి కాల్చివేయాలనీ ఆదేశించాడు. బాబిలోనియాలోనే అధికారులుగా వున్న ముగ్గురు యూదులు అలా చేయటం లేదని అతనికి ఫిర్యాదులు వచ్చాయి. వారిని తన వద్దకు రప్పించి ఎందుకని రాజు అడిగాడు. 'మా దేవుడి ముందు తప్ప వేరెవరి ముందూ తల వంచము.' అన్నారు వాళ్లు. 'అగ్నిగుండపు శిక్ష గురించి తెలియదా?' అని గద్దిస్తే 'ఆ సంగతి మా దేవుడే చూసుకుంటాడు. ఆయన రక్షించకపోయినా మేం కాలి దగ్ధమై పోతాం తప్ప మిమ్మల్ని కానీ, మీ దేవుళ్లను కానీ ఆరాధించము.' అని ఖండితంగా చెప్పారు వాళ్లు. రాజు కోపంతో అగ్నిగుండాన్ని ఎప్పటికంటె ఎక్కువగా రగిలించి వాళ్లను కాల్చివేయమన్నాడు. వాళ్లను గుండం దాకా తీసుకెళ్లిన సైనికులు ఆ జ్వాలలకు మాడి చచ్చారు తప్ప వీళ్లకేమీ కాలేదు. ఆ వింత చూడడానికి రాజు స్వయంగా వచ్చాడు. అతని కంటికి గుండంలో నాలుగో మనిషి కూడా కనబడ్డాడు. అతను దివ్యశరీరంతో దేవదూతలా వున్నాడు. అప్పుడతనికి అర్థమైంది – యూదు దేవుడు దేవదూతను పంపి తన భక్తులను రక్షించాడని. ఇకపై ఆ దేవుణ్ని ఎవరూ తూలనాడకూడదని ఆదేశం జారీ చేసి, ఆ ముగ్గురికి యింకా పెద్ద పదవులు కట్టబెట్టాడు.

ఒకనాడు నెబుచెడ్నజార్‌కు నిద్రలో ఒక కల వచ్చింది. భూలోకపు మధ్యలో పెద్ద చెట్టు కనబడింది. అది పెరుగుతూపెరుగుతూ పోయి ఆకాశాన్ని అంటింది. లోకులందరూ దాన్ని నివ్వెరపోయి చూస్తూండగానే ఒక దేవదూత స్వరం నుంచి దిగి వచ్చి 'ఆ చెట్టు పడగొట్టి దాని కొమ్మలు నరకండి, ఆకులు దులిపివేయండి, పళ్లను పారవేయండి, దానిని ఆశ్రయించుకుని వున్న పక్షులను, జంతువులను తరిమివేయండి. దాని కాండాన్ని మాత్రం భూమిలో వుంచండి. దాని చుట్టూ యినుము, కంచు తొడుగు తొడగండి.'' అన్నాడు. అంతేకాదు, రాజును చూపిస్తూ ''ఇదిగో యీ నరుడు మంచులో తడుస్తాడు, ఏడేళ్ల పాటు పశుప్రాయుడై గడ్డి మేస్తూ మృగాల మధ్య వుంటాడు. ఇదంతా దేవుని రాజ్యం, అతను ఎవరిని అనుగ్రహిస్తే వారికే పట్టం కడతాడని తెలుసుకోండి.'' అంటూ ప్రకటించాడు. మెలకువ రాగానే మర్నాడు రాజు జ్యోతిష్కులందర్నీ పిలిపించి అర్థాన్ని చెప్పమన్నాడు. వాళ్లు చెప్పలేకపోతే డేనియల్‌ను పిలిపించాడు. అతను అంతా విని దాని అర్థాన్ని చెప్పాడు – ''రాజా, ఆ చెట్టు మీరే, మీరు బ్రహ్మాండంగా ఎదుగుతున్నారు. కానీ దానికీ పరిమితి వుంది. ఒక స్థాయి దాటాక దేవుడు మీ ఎదుగుదలను ఆపివేస్తాడు. మిమ్మల్ని రాజ్యభ్రష్టుణ్ని చేసి అడవుల్లోకి తరిమివేస్తాడు. అక్కడ ఏడేళ్లపాటు మతి భ్రమించి తిరుగుతారు. అప్పుడు మీకు దేవుడి గొప్పదనం గురించి జ్ఞానోదయం కలగుతుంది. దేవుడే ప్రపంచాన్నంతటినీ పాలిస్తాడని మీరు గ్రహించాక రాజ్యం తిరిగి దక్కుతుంది. కాండాన్ని మాత్రం వదిలేయమని అనడంలో అర్థమిదే. రాజ్యం అలాగే వుంటుంది, కానీ రాజులు మారతారు.'' అని.

ఇవన్నీ నిజంగా జరిగాయి. ఏడాది పోయిన తర్వాత రాజు ఓ రోజు సాయంత్రం రాజభవనం మిద్దె మీద పచార్లు చేస్తూ ''ఆహా నా రాజ్యం ఎంత పెద్దది, ఎంత దృఢంగా నేను నిర్మించాను'' అని అతిశయించాడు. వెంటనే ఆకాశవాణి వినిపించింది – ''రాజా, నిన్ను నీ రాజ్యం నుంచి తొలగించాను. నీ పౌరులే నిన్ను తరిమివేస్తారు. ఏడేళ్లపాటు అరణ్యవాసం చేస్తావు.'' అన్నాడు. అలాగే జరిగింది. అడవులలో వుండగా అతనికి ఆవాసం దొరకక అతని దేహం మంచులో తడిసింది, జుట్టు, గోళ్లు విపరీతంగా పెరిగాయి. ఏడేళ్లు మృగంలా జీవించాక అతనికి మళ్లీ వివేకం కలిగింది. ప్రభువు దయ లేకపోతే తను ఏమీ చేసి వుండేవాడు కాదని గ్రహింపు వచ్చింది. అది జరిగాక అతనికి మళ్లీ రాజ్యం, వైభవం దక్కాయి. ప్రజలే అతన్ని ఆహ్వానించారు. అతను లేనప్పుడు అతని కుమారుడు బెల్షజారును సింహాసనంపై కూర్చోబెట్టారు. రాజు తిరిగి వచ్చాక యిద్దరూ కొద్దికాలం సంయుక్తంగా పాలించారు.

నెబుచెడ్నజారు మరణించి, బెల్షజారు (Belshazzar) పూర్తిగా రాజయ్యాక అతను ఓ రోజు పెద్ద విందు ఏర్పాటు చేశాడు. అందరూ మధువు సేవిస్తూ వుండగా రాజుకి తన వైభవం మరింతగా చాటుకోవాలనిపించింది. పూర్వం తన తండ్రి జెరూసలెం గుడి నుంచి కొల్లగొట్టి తెచ్చిన వెండి, బంగారు పాత్రలు ఖజానా నుంచి తెప్పించి, వాటిలో మద్యాన్ని నింపి తను, రాజప్రముఖులు, వారి భార్యలు, ఉంపుడుగత్తెలు అందరికీ యిప్పించాడు. ఇలా యూదు దేవుణ్ని అవమానించానని తృప్తి పొందాడు. వెంటనే వాళ్లందరికి ఆకాశంలో ఒక చెయ్యి కనబడింది. అది కిందకు దిగి వచ్చి రాజమహలులో గోడమీద ఏదో రాసింది. గాలిలో వున్న ఓ చెయ్యి అలా రాయడంతో అందరూ గడగడ వణికారు. రాసినదేమిటో తెలియక మరింత కంగారు పడ్డారు. రాజు జ్ఞానులను రప్పించి, యీ రాతలకు అర్థమేమిటో చెప్పినవాణ్ని నేను రాజ్యంలో మూడవ పెద్ద అధికారిని చేస్తాను అని ప్రకటించాడు. ఎవరూ చెప్పలేకపోయారు. దాంతో అతను మరింత కలవరపడ్డాడు. 

అప్పుడు రాజమాత వచ్చి డేనియల్‌ను పిలిపించమని సలహా యిచ్చింది. డేనియల్‌ వచ్చి ''మీ బహుమతులు, పదవులు మీరే వుంచుకోండి. ఈ రాతల అర్థం చెప్తాను వినండి. ''మొదటగా తెలుసుకోదగినది – మీ తండ్రి గర్విష్ఠి కావడం చేత దేవుడు ఆయనను ఏడేళ్లపాటు రాజ్యభ్రష్టుణ్ని చేశాడు. హీనమైన జీవితాన్ని గడిపేట్లు చేశాడు. ఇది తెలిసి కూడా మీరు వినయం అలవర్చుకోలేదు. దేవుడి పాత్రలను అపవిత్రం చేశారు. మిమ్మల్ని హెచ్చరించడానికే దేవుడు యీ మాటలు రాశాడు. మొదటి మాట 'మెనే' దాని అర్థం అంకె. దేవుడు మీ పరిపాలనా దినాలను లెక్కపెట్టి, వాటిని పరిసమాప్తం చేశాడు. రెండో మాట 'టెకెల్‌' దాని అర్థం తూకం. దేవుడు మిమ్మల్ని తూచి చూస్తే చాలా తేలికగా, ఉప్ఫున వూదితే ఎగిరిపోయే దూదిపింజలా వున్నారు. మూడో మాట 'పార్సీన్‌' దాని అర్థం విభజన. దేవుడు మీ రాజ్యాన్ని ముక్కలు చేసి మాదీయులకు(Medes), పారశీయులకు (Persians) యిచ్చివేయడానికి నిశ్చయించాడు.'' అని చెప్పాడు. ఆ రాత్రే బాబిలోనియా ప్రజలు రాజుని వధించారు. మాదీయుల రాజైన డేరియస్‌ (Darius) రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు. (సశేషం) (ఫోటో – డేనియల్‌ బెల్షజారుకి గోడమీద రాతలకు అర్థమేమిటో చెప్పడం)

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జూన్‌ 2016) 

[email protected]

Click Here For Archives