తెలుగులో '1 నేనొక్కడినే', 'దోచెయ్' సినిమాల్లో నటించిన బాలీవుడ్ భామ కృతి సనన్, ఈ మధ్యన కిక్ బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తోందట. అడపా దడపా బాలీవుడ్ సినిమాల్లో కన్పిస్తోన్న ఈ బ్యూటీకి, కిక్ బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఓ సినిమాలో ఛాన్స్ రావడంతోనే ఆమె కిక్ బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తోందంటూ బాలీవుడ్లో గుసగుసలు విన్పిస్తున్నాయి.
కృతిసనన్‌కి మొదటి నుంచీ ఫిజిక్ మీద కేర్ చాలా ఎక్కువే. అందాల భామలకి ఇది తప్పదనుకోండి. అయితే మార్షల్ ఆర్ట్స్ మీద మక్కువతో, వాటి ద్వారానే ఫిజిక్‌ని కంట్రోల్ చేసుకుంటుందట కృతి సనన్. ఈ క్రమంలోనే ఆమె సరదాగా కిక్ బాక్సింగ్ నేర్చుకుంటోందని కొందరు అంటోంటే, కాదు కాదు.. సౌత్‌లో ఓ సినిమాలో కిక్ బాక్సర్‌గా ఆమెకు ఛాన్స్ వచ్చిందనీ, అందుకే ఆమె కిక్ బాక్సింగ్‌తో కుస్తీలు పడ్తోందని ఇంకొందరు అంటున్నారు.
ఇక, ఈ విషయమై కృతి సనన్ని ప్రశ్నిస్తే, డాన్స్ – మార్షల్ ఆర్ట్స్‌తో ఫిజిక్‌ని ఎప్పుడూ ఫిట్‌గా వుంచుకుంటానని చెప్పింది. అంతే తప్ప, ఫలానా సినిమాలో కిక్ బాక్సర్‌గా కన్పిస్తాననే విషయం మాత్రం ఒప్పుకోవడంలేదు. బాలీవుడ్లో మొన్నీమధ్యనే ప్రియాంకా చోప్రా బాక్సర్‌గా అవతారమెత్తింది. అలాంటి ఆఫర్ కృతి సనన్‌కి వచ్చిందంటూ విన్పిస్తోన్న గాసిప్స్‌లో నిజమెంతో తెలియాల్సి వుంది.