మేడిన్‌ ఇండియా: ఆకాశంలో నిప్పులు కురిపిస్తూ.!

స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన యుద్ధ విమానం తేజస్‌.. అధికారికంగా నేడు విధుల్లో చేరుతోంది. దేశం గర్వించదగ్గ క్షణమిది. మేకిన్‌ ఇండియా.. మేడిన్‌ ఇండియా.. పేరేదైనాసరే, స్వదేశీ వజ్రాయుధంగా తేజస్‌ని భావించొచ్చు. ప్రపంచంలోనే అత్యుత్తమైన…

స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన యుద్ధ విమానం తేజస్‌.. అధికారికంగా నేడు విధుల్లో చేరుతోంది. దేశం గర్వించదగ్గ క్షణమిది. మేకిన్‌ ఇండియా.. మేడిన్‌ ఇండియా.. పేరేదైనాసరే, స్వదేశీ వజ్రాయుధంగా తేజస్‌ని భావించొచ్చు. ప్రపంచంలోనే అత్యుత్తమైన యుద్ధ విమానమేమీ కాదిది. కానీ, భారతదేశ రక్షణ కోసం తనవంతు పాత్ర పోషించగల సత్తా అయితే 'తేజస్‌'కి వుందన్నది నిర్వివాదాంశం. 

స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన తేజస్‌కి వున్న అతి పెద్ద అడ్వాంటేజ్‌ ఏంటంటే, ఎలా కావాలంటే అలా దీన్ని మలచుకునే అవకాశం వుండడం. భవిష్యత్తులో తేజస్‌ నుంచి మరిన్ని అద్భుతాల్ని ఆశించవచ్చు. ఏ ప్రయాణమైనా మొదటి అడుగుతోనే ప్రారంభమవుతుంది. భారతదేశానికి సంబంధించినంతవరకు తొలి స్వదేశీ యుద్ధ విమానం ఇదే. ఇక్కడి నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రయాణం, ముందు ముందు ప్రపంచానికి సవాల్‌ విసిరే స్థాయికి చేరుకుంటుందన్నదాంట్లో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు. అంతరిక్షం రంగంలో భారత్‌ సాధించిన విజయాలే ఇందుకు నిదర్శనం. 

అగ్రరాజ్యం అమెరికా సైతం ఇస్రో విజయాల్ని చూసి ఆశ్చర్యపోతోంది. సమీప భవిష్యత్తులో భారత రక్షణ రంగాన్ని చూసి కూడా అమెరికా ఆశ్చర్యపోయినా వింతేమీ వుండకపోవచ్చు. ఓ పక్క పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో భారీ నుంచి అతి భారీ యుద్ధ నౌకల్ని భారత్‌ ఎప్పటినుంచో తయారు చేస్తూనే వుంది. విమాన వాహక యుద్ధ నౌక కూడా సిద్ధమయిపోతోంది. వైమానిక దళం విషయంలోనే కాస్త వెనకబడి వుంది. తేజస్‌తో ఆ లోటు కూడా తీరిపోయినట్లే భావించాలేమో. 

ఎయిర్‌ఫోర్స్‌ అవసరాల్ని తీర్చడమే కాదు, నేవీకి ఉపయోగపడేలా కూడా తేజస్‌ని తీర్చిదిద్దడంతో ఇక, వీటి ఉత్పత్తిని దేశ అవసరాలకు తగ్గట్టుగా పెంచడమే భారత రక్షణ రంగం ముందున్న తక్షణ కర్తవ్యం వేల కోట్లు, లక్షల కోట్లు వెచ్చించి మరీ విదేశాల నుంచి ఖరీదైన, అత్యాధునికమైన యుద్ధ విమానాల్ని కొనుగోలు చేయడం, కొన్ని ఒప్పందాలతో విదేశాలతో కలిసి స్వదేశంలోనే ఆ యుద్ధ విమానాల్ని తయారుచేయడం మాత్రమే కాదు, వీటికి తోడు స్వదేశీ యుద్ధ విమానం తేజస్‌ని వినియోగంలోకి తెచ్చి, వీటిని మరింత ఆధునీకరించడం.. ఇవన్నీ భారత వైమానిక దళాన్ని ప్రపంచంలోనే అతి గొప్ప శక్తిగా సమీప భవిష్యత్తులో మలచనుందన్నది నిర్వివాదాంశం.