మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా కోసం రెడీ అవుతున్న దరిమిలా, ఆయనకోసమే సినీ 'మా' అవార్డ్స్ వేడుకను నిర్వహించినట్లుంది. ముందు అంతా దీన్ని 'అవార్డ్స్ ఈవెంట్' అనే అనుకున్నారు. 'టెంపర్' సినిమాలో నటనకు జూనియర్ ఎన్టీఆర్ 'ఉత్తమ నటుడు' అవార్డుని అందుకుంటే, రేసులో 'బాహుబలి' సహా పలు చిత్రాలు పలు కేటగిరీల్లో అవార్డుల్ని సొంతం చేసుకున్నాయి.
ఈవెంట్ అయిపోయింది, అది కాస్తా బుల్లితెరపై టెలికాస్ట్ అయ్యింది. ప్రోగ్రామ్ అదిరిందని బుల్లితెర వీక్షకులూ అనుకున్నారు. పలువురు హీరోయిన్ల పెర్ఫామెన్స్లు, హీరోల సందడి.. వెరసి, సినీ 'మా' అవార్డ్స్ ప్రోగ్రామ్ మెగా సక్సెస్ అయ్యిందన్నది నిర్వివాదాంశం. అయితే, ఇప్పుడు ఈ ఈవెంట్ చుట్టూ అనేక రూమర్స్ తెరపైకి వస్తున్నాయి. ప్రధానంగా జూనియర్ ఎన్టీఆర్ ఈ ఈవెంట్‌కి హాజరై తప్పు చేశాననే భావనలో వున్నాడన్న గాసిప్ విన్పిస్తోంది.
ఆద్యంతం ఈవెంట్ చూసినవారికి అక్కడ 'మెగా' భజన తప్ప ఇంకేమీ లేదనే విషయం స్పష్టమవుతోంది. 'మా'టీవీలో నాగార్జున సహా అల్లు అరవింద్, చిరంజీవి పార్టనర్స్. అది ఒకప్పుడు. ప్రస్తుతం 'స్టార్ గ్రూప్' చేతుల్లోకి వెళ్ళింది. అయినా, పాత సంబంధాలు అలాగే వున్నాయని సాక్షాత్తూ చిరంజీవి సెలవిచ్చారు సినీ 'మా' అవార్డ్స్ వేదికపైనుంచి. దాంతో, చిరంజీవి ఈ ఈవెంట్‌ని తనకోసం వినియోగించుకున్నారనే ఆరోపణలు ఇప్పటికే బలపడ్డాయి.
ఇక, ఎన్టీఆర్ మాత్రమే కాదు, ఈ కార్యక్రమానికి హాజరైన పలువురు సినీ ప్రముఖులు, మెగాస్టార్ భజన కోసమే ఈ ఈవెంట్‌ని నిర్వహించారని ఆఫ్ ది రికార్డ్‌గా వ్యాఖ్యానిస్తున్నారట. నంది అవార్డులు సహా, ఫిలింఫేర్ అవార్డులపైనా కుప్పలు తెప్పలుగా ఆరోపణలున్నాయి. సమర్థులైనవారికి కాకుండా, ఖర్చుపెట్టగలిగేవారికే అవార్డులు.. అన్న వాదన బలంగా విన్పిస్తోంది తెలుగు సినీ పరిశ్రమలో.. అవార్డు ఫంక్షన్లకు సంబంధించి.
ఆ లెక్కన, సినీ 'మా' అవార్డ్స్ కార్యక్రమం కేవలం చిరంజీవి ప్రమోషన్ కోసమే జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. 'భజన' విషయంలో మెగా ఫ్యామిలీ కాస్త జాగ్రత్తపడి వుంటే, ఈ స్థాయిలో విమర్శలు వచ్చేవి కావేమో. మెగాస్టార్ ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితులైన సినీ ప్రముఖులు.. ఇలా వీళ్ళతోనే ’వీవీఐపీ‘ గ్యాలరీ నిండిపోయిందంటే, దీన్ని మెగాస్టార్ ఈవెంట్ అని అనడం తప్పెలా అవుతుంది?