ఇటీవలి ఎన్నికలలో వైగో పూర్తిగా జీరో అయిపోయాడు కానీ డిఎంకెలోంచి బయటకు వచ్చాక 1994లో అతను అందర్నీ అడలగొట్టాడు. ఏప్రిల్‌లో మద్రాసులో ర్యాలీలు, సభలు నిర్వహిస్తే బ్రహ్మాండమైన స్పందన వచ్చింది. కరుణానిధి తన వారసులనే ప్రోత్సహిస్తున్నాడు తప్ప తక్కిన డిఎంకె కార్యకర్తలకు అధికారం అప్పగించటం లేదని గ్రహించిన డిఎంకె యువత అతనితో నడిచారు. కరుణానిధి, జయలలిత యిద్దరూ అవినీతి కూపంలో కూరుకుని పోగా వైగో తన పాతికేళ్ల రాజకీయజీవితంలో ఎన్నడూ అవినీతికి పాల్పడలేదన్న యిమేజి వుంది. డిఎంకెని చీల్చడానికి వైగో చేసిన ప్రయత్నానికి కోర్టు గండి కొట్టింది. డిఎంకె, పేరు, గుర్తు, జండా వాడుకోవడానికి వీల్లేదంది. సభ జరిగినపుడు రుణానిధి అనుయాయులు, వైగో అనుయాయులు కలహించుకున్నారు. వైగో అనుయాయి ఒకతను హత్య కావింపబడ్డాడు. తమిళ టైగర్లకు సానుభూతిపరుడనే మచ్చ మాత్రమే అతనికి వుంది. కానీ తమిళనాడులో అది పెద్ద వ్యతిరేకాంశం కాదు.
జయలలితలో ప్రతీకారేచ్ఛ ఏ స్థాయిలో వుందో ఆమె మొదటి టెర్మ్‌లోనే జనాలకు తెలిసిపోయింది. రాజకీయ ప్రత్యర్థులపై కసి తీర్చుకోవడం తమిళనాట నడుస్తూ వస్తోంది కానీ ఈమె తన బాటకు అడ్డు వచ్చిన వారందరిపై కక్ష తీర్చుకుంది. మద్రాసు హైకోర్టులో ఎఆర్ లక్ష్మణన్ అనే జడ్జి 1990 నుంచి పనిచేస్తున్నారు. ఆయన జయలలిత ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను కొన్ని కొట్టివేశాడు. తమిళనాడు అసెంబ్లీ స్పీరు వెట్రికొండన్ అనే డిఎంకె నాయకుడి అరెస్టుకై ఆదేశాలిస్తే వెట్రికొండన్ కోర్టు నాశ్రయించాడు. లక్ష్మణన్ అరెస్టు వారెంటుపై స్టే యిచ్చాడు. 25 వేల కోఆపరేటివ్ సొసైటీలలో ఎన్నికలు కొత్తగా నిర్వహించి, వాటిని కైవసం చేసుకుందామని 1992లో ప్రభుత్వం ప్రయత్నిస్తే లక్ష్మణన్ స్టే యిచ్చాడు. ప్రభుత్వం ఫార్మా కంపెనీలకు రెక్టిఫైడ్ స్పిరిట్ అమ్మడం ఆపేసింది. దాంతో వాళ్లంతా హైకోర్టులో రిట్ వేశారు. 'రిట్‌పై అంతిమ తీర్పు యిచ్చేదాకా మీరు స్పిరిటు సరఫరా ఆపకండి' అని ప్రభుత్వాన్ని లక్ష్మణన్ ఆదేశించాడు. ప్రభుత్వం డివిజన్ బెంచ్‌కు అప్పీలు చేసుకుంటే వాళ్లు లక్ష్మణన్ తీర్పునే సమర్థించారు.
డిఎంకె లీడరు టి ఆర్ బాలుకు చెందిన కెమికల్ కంపెనీకి కూడా స్పిరిటు సరఫరా ఆపేస్తే వాళ్లు 1992లో హైకోర్టుకి వెళ్లారు. సప్లయి చేయమని లక్ష్మణన్ తీర్పు యిస్తే సర్కారు సుప్రీం కోర్టుకి వెళ్లింది, అక్కడా ఓడిపోయింది. చివరకు కంపెనీకి క్షమాపణ చెప్పవలసి వచ్చింది. ఆ కేసు సందర్భంగా లక్ష్మణన్ ప్రభుత్వం తరఫున వాదించిన ఎడ్వకేట్ జనరల్ కె.సుబ్రహ్మణియన్‌ను 'ఇలాటి కేసుల్లో ప్రభుత్వానికి సరైన సలహా యిచ్చి వుండాల్సింది కదా' అని మందలించాడు. సుబ్రహ్మణియన్‌కి బాధ వేసి సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేశాడు. సుప్రీం కోర్టు వాళ్లు లక్ష్మణన్ వ్యాఖ్యలను రికార్డుల్లోంచి తొలగించమని తీర్పు యిచ్చారు. దాంతో సుబ్రహ్మణియన్ విజయోత్సవ ర్యాలీ నిర్వహించి, కోర్టు ఆవరణలో పోస్టర్లు అతికింపించాడు. అంతేకాదు, కొత్త చీఫ్ జస్టిస్ వచ్చినపుడు యిచ్చిన ఉపన్యాసంలో లక్ష్మణన్‌ను ఘాటుగా విమర్శించాడు. ఇది హై కోర్టు జడ్జిలను మండించింది. సుబ్రహ్మణియన్‌ను నిలదీశారు. అతను క్షమాపణ చెప్పుకున్నాడు. అతనిచ్చిన ఉపన్యాసంలోని అభ్యంతరకర భాగాలను కోర్టు రికార్డుల్లోంచి తొలగించారు. ఇంతటితో కథ ఆగలేదు. జడ్జిలను విమర్శిస్తూ మద్రాసు నగరమంతా పోస్టర్లు వెలిశాయి. వీటిపై చీఫ్ జస్టిస్ కెఎ స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోస్టర్లు అంటించిన దెవరో ఎన్నాళ్లయినా ఎందుకు కనిపెట్టలేదని పోలీసులను నిలదీశారు.
న్యాయవ్యవస్థ, ముఖ్యంగా లక్ష్మణన్ తనకు మాటిమాటికి అడ్డు వస్తున్నారని జయలలితకు కోపం వచ్చింది. అంతే లక్ష్మణన్ అల్లుడు, రియల్ ఎస్టేటు వ్యాపారి ఐన ఎఎల్ కుమార్‌ను మార్చిలో అరెస్టు చేయించింది. పెట్టిన కేసులేమిటంటే అతని వద్ద మద్యం, గంజాయి దొరికాయని! ఈ కుమార్‌పై మద్యం బాటిళ్లు కలిగి వున్నందుకు 1989లో కరుణానిధి హయాంలో కూడా కేసు పెట్టారు. ప్రొహిబిషన్ చట్టం కింద కంటె నార్కోటిక్ డ్రగ్స్ చట్టం కింద పెట్టిన కేసు తీవ్రమైనది. ఈ కబురు తెలియగానే లక్ష్మణన్ మానసికంగా ఆందోళనకు గురయ్యారు. ఆయన అప్పుడు రాష్ట్రప్రభుత్వం బొగ్గు దిగుమతి చేసుకునే అంశంపై కేసు విచారిస్తున్నాడు. దిగుమతులు ఆపివేయమని మధ్యంతర ఉత్తర్వులు యిచ్చి వున్నాడు. ఇప్పుడు ఆ కేసు నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించాడు. జయలలితకు కావలసినది అదే! కానీ యిది లాయర్ల ఆగ్రహానికి కారణమైంది. న్యాయమూర్తులను బెదిరించి తన దారికి తెచ్చుకుంటోందని వాళ్లు రెండు రోజుల పాటు సమ్మె చేసి కోర్టు వ్యవహారాలను స్తంభింపచేశారు. ప్రతిపక్షాలన్నీ న్యాయమూర్తుల, న్యాయవాదుల పక్షాన మాట్లాడసాగాయి. తన మాట వినని వాళ్లను హింసించడానికి జయలలిత ఎంత దూరం వెళ్లగలదో యీ సంఘటన నిరూపించింది.
న్యాయవాదులు గవర్నరు చెన్నారెడ్డి వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నారు. గవర్నరుగా వచ్చిన ఏడాది అయిన సందర్భంగా జూన్ నెలలో చెన్నారెడ్డి మీడియాకు యింటర్వ్యూలు యిస్తూ జయలలిత ప్రభుత్వాని చెరిగేశారు. అంతకన్న చేసేదేమీ లేకపోయింది. ఎందుకంటే అడ్డు వచ్చినవాళ్లను దండించడమనేది ఎడిఎంకె విధానమై పోయింది. స్పిక్ అనే కెమికల్స్ కంపెనీలో ప్రభుత్వసంస్థ కార్పోరేషన్ వాటాను అమ్మేసేటప్పుడు అతి తక్కువ రేటుకే పెట్టుబడి ఉపసంహరిద్దామని జయలలిత తీసుకున్న నిర్ణయాన్ని ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఎండీగా వున్న ఐయేయస్ అధికారిణి చంద్రలేఖ వ్యతిరేకించారు. ఆమెపై ఆసిడ్ దాడి జరిగింది. ఇది ఎడిఎంకె వారు చేయించినది కాదు, ఆమెతో విడిపోయిన భర్త చేయించాడనే కథనం కూడా వచ్చినా, ఆమె జయలలిత మీదనే ఆరోపణలు చేసింది. దాడి చేసినవారిని 1992 నవంబరులో అరెస్టు చేసి రెండేళ్లయినా చార్జిషీటు చేయలేదు.
ఏ రాష్ట్రంలోనైనా సరే రిజర్వేషన్లు 50%కి మించి వుండకూడదన్న సుప్రీం కోర్టు ఆదేశాన్ని ఉల్లంఘించి తమిళనాడు 69% రిజర్వు చేయడం ఎమ్జీయార్ హయాంలో జరిగింది. దాన్ని మళ్లీ తగ్గించే సాహసం కరుణానిధి కూడా చేయలేదు. దీన్ని ఛాలెంజ్ చేస్తూ కెఎం విజయన్ అనే లాయరు 1993 ఆగస్టులో సుప్రీం కోర్టుకి వెళ్లి స్టే తెచ్చుకున్నాడు. అది అమలయితే ప్రస్తుత ప్రభుత్వానికి చాలా యిబ్బందికరమైన పరిస్థితి ఎదురవుతుంది. అందుకని ఢిల్లీకి వెళ్లబోతూండగా అతనిపై యింటిపై పడి తీవ్రంగా గాయపరిచారు. కుడిచేతికి రెండు ఎముకలు విరిగాయి. ఎడమకాలు ముక్కలు ముక్కలైంది. మూణ్నెళ్ల పాటు మంచమెక్కాల్సి వచ్చింది. సహజంగానే ప్రజల్లో అలజడి రేగింది. సంఘటన జరిగిన కొన్ని రోజులకు పోలీసులు 'నలుగురు తమంతట తామే వచ్చి లొంగిపోయారు కానీ వాళ్ల పేర్లు చెప్పము అన్నారు. వారిపై కేసులు ఎంత బలహీనంగా పెట్టారంటే బెయిల్ అడగ్గానే హైకోర్టు యిచ్చేయవలసి వచ్చింది. సుప్రీం కోర్టు కలగచేసుకుని కేసును సిబిఐకు అప్పగించమంది.
ఇదే సందర్భంగా అణ్నా యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ డా. ఎం. ఆనందకృష్ణన్‌పై కూడా దాడి జరిగింది. ఆయన చేసిన పాపమేమిటంటే – 'సుప్రీం కోర్టు స్టే యిచ్చింది కాబట్టి దాని ఆదేశం ప్రకారం యీ ఏడాది అణ్నా యూనివర్శిటీలో 50% మాత్రమే బిసిలకు రిజర్వ్ చేసి తక్కిన 19% ఎవరికీ యివ్వకుండా వుంచుతాం. అంతిమ తీర్పు వచ్చాక ఎవరికి యివ్వాలంటే వాళ్లకు యిస్తాం' అని ప్రకటించడం. కోర్టు ఆదేశానుసారం నడుచుకోవడమేమిటి నాన్సెన్స్ అని ఆయన ఆఫీసుపై పడి ఫర్నిచరు విరక్కొట్టారు. ఆయననూ కొట్టబోతే పారిపోయి ఓ గదిలోకి వెళ్లి తలుపు వేసుకుని దాక్కున్నాడు. పోలీసులు ఆయనపై దాడి చేసిన గూండాలను పట్టుకోలేదు, ఎవరి మీదా కేసు బుక్ చేయలేదు. (సశేషం) (ఫోటో – ఎఆర్ లక్ష్మణన్ )
– ఎమ్బీయస్ ప్రసాద్ (జూన్ 2016)