ఎమ్బీయస్‌: యూరోప్‌ గాథలు – 33

సీజరు విల్లులో వారసుడిగా ఆక్టేవియన్‌ పేరున్నా మార్క్‌ ఆంటోనీ రాజకీయ శూన్యతను తనకు అనువుగా మలచుకుందామని చూశాడు. సీజరు అనుయాయులను చేరదీసి తనను నాయకుడిగా ప్రకటించుకున్నాడు. సీజరు విల్లు ప్రకారం తనకు రావలసిన అతని…

సీజరు విల్లులో వారసుడిగా ఆక్టేవియన్‌ పేరున్నా మార్క్‌ ఆంటోనీ రాజకీయ శూన్యతను తనకు అనువుగా మలచుకుందామని చూశాడు. సీజరు అనుయాయులను చేరదీసి తనను నాయకుడిగా ప్రకటించుకున్నాడు. సీజరు విల్లు ప్రకారం తనకు రావలసిన అతని ఆస్తి కంటె ఎక్కువగా స్వాధీనం చేసుకున్నాడు. సెనేటర్లను తృప్తి పరచడానికి నియంత పదవిని రద్దు చేశాడు. సీజరుతో కలిసి పనిచేసిన సైన్యాధికారులకు ప్రభుత్వ భూమిని పంచిపెట్టి వారిని మంచి చేసుకున్నాడు. సీజరు స్థానంలో లెపిడస్‌ను పాంటిఫిక్స్‌ మాగ్జిమస్‌గా ఎన్నికయ్యేట్లు చూసి అతని కొడుకుతో తన కూతురికి పెళ్లి నిశ్చయం చేశాడు. ఎప్పుడూ తన చుట్టూ 6 వేల మంది సీజరు అనుయాయులు వుండేట్లు చూసుకుని రోమ్‌ పాలకుడిగా ఎదుగుదామని చూశాడు.

సీజరు పోయిన రెండు నెలలకు ఆక్టేవియన్‌ రోముకి వచ్చి సీజరు వారసుడిగా తన స్థానాన్ని పొందడానికి ప్రయత్నించాడు. ఆంటోనీలో అప్పటికే అహంకారం బలిసింది. సీజరు ఆస్తిలో కొంత భాగం పబ్లిక్‌ ట్రస్టులు ఏర్పరచడానికి వినియోగించాలని వున్నా దాన్ని దిగమింగి కూర్చున్నాడు. ఆక్టేవియన్‌ అతన్ని అడిగి చూసి, లాభం లేదని, అప్పులు చేసి ఆ డబ్బుతో ట్రస్టులు ఏర్పాటు చేసి రోమన్‌ ప్రజల, సీజరు అనుయాయుల మన్ననలు పొందాడు. సీజరు అనుయాయులు ఆంటోనీని అసహ్యించుకోసాగారు. గతంలో ఆంటోనీతో రాజీపడిన లిబరేటర్లు కూడా అతన్ని అనుమానంగా చూస్తున్నారు. ఆక్టేవియస్‌ దాన్ని ఉపయోగించుకుని, లిబరేటర్లలో ప్రముఖుడైన సిసెరోను రెచ్చగొట్టాడు. అతను క్రీ.పూ. 44 సెప్టెంబరులో సెనేట్‌లో వరుస ఉపన్యాసాలతో ఆంటోనీని ఘాటుగా విమర్శించాడు. అతను రిపబ్లిక్‌కు చేటు కలిగిస్తున్నాడని ఆరోపించాడు.  

సీజరు అసలైన వారసుడు తనే అని, ఆంటోనీ కాడని చూపించుకోవడానికి ఆక్టేవియన్‌ సకలయత్నాలు చేశాడు. దాని కోసం సీజరు అభిమానులు, అనుయాయులకు నచ్చే పనులు చేయసాగాడు. గతంలో ఆంటోనీ లౌక్యం ప్రదర్శించి సీజరు హంతకులకు క్షమాభిక్ష ప్రసాదింపచేసే తీర్మానాన్ని ప్రతిపాదించాడని తెలుసు కాబట్టి సెనేట్‌లో తను కాన్సల్‌ కాగానే సీజరు హంతకులను దేశద్రోహులుగా ప్రకటింపచేసి ఆంటోనీ కంటె తనే సీజరు భక్తుణ్నని చూపించుకున్నాడు. ఈ తీర్మానం చూసి సిసెరో భగ్గుమన్నాడు. దేశం బయట వుంటున్న బ్రూటస్‌కు ఉత్తరం రాస్తూ  ఆక్టేవియన్‌కు, ఆంటోనీకి మధ్య పడటం లేదని, యిద్దర్నీ విడివిడిగా ఎదిరిస్తే మంచిదని అన్నాడు. నవంబరు వచ్చేసరికి గతంలో సీజరుకు, ప్రస్తుతం ఆంటోనీకి అండగా నిలబడిన దళాలు ఆక్టేవియస్‌ వైపుకు మళ్లాయి. ఆక్టేవియన్‌ కారణంగా తన పరపతి తగ్గుతోందని గమనించిన ఆంటోనీ తన కాన్సల్‌ పదవి పూర్తి అవుతోంది కాబట్టి గాల్‌కు గవర్నరుగా నియమించమని సెనేట్‌ను కోరాడు. దాన్ని బ్రూటస్‌కు యిచ్చాం కాబట్టి నీకు మాసిడోనియా యిస్తామన్నారు సెనేటర్లు. ఆంటోనీ అది ఒప్పుకోకుండా తన సైన్యంతో గాల్‌ను ముట్టడించాడు. ఆక్టేవియన్‌ నాయకత్వంలోని సెనేట్‌ అతని చర్యను నిరసించి, అతనికి దేశబహిష్కార శిక్ష వేసింది. క్రీ.పూ.43 జనవరి 1 న ఆంటోనీని, అతని వెంట వున్న ఐదు దళాలను ఓడించడానికి ఆక్టేవియన్‌ను పంపింది. ఏప్రిల్‌ కల్లా ఆంటోనీ ఓడిపోయాడు. ఆ యుద్ధంలో ఆక్టేవియన్‌తో బాటు వున్న యిద్దరు కాన్సల్సు చనిపోయి, ఆక్టేవియన్‌ ఒక్కటే కాన్సల్‌గా మిగిలాడు. అతని వద్ద 8 దళాలున్నాయి. 

ఆంటోనీ శక్తి వుడిగింది కాబట్టి యిక ఆక్టేవియన్‌ అధికారాన్ని కూడా కుదిస్తే యిక తమకు ఎదురుండదని సెనేటర్లు భావించారు. సీజరుకు శత్రువుగా వుండిన పాంపే కొడుకు సెక్‌స్టస్‌కు రిపబ్లిక్‌ యొక్క సైనికదళాధిపతిగా నియమించి ఆక్టేవియన్‌ను సైన్యబలాన్ని తగ్గించారు. సీజరును హత్య చేసిన బ్రూటసు, కేషియస్‌లకు మాసెడోనియా, సిరియాలకు గవర్నర్లగా వేశారు. అయితే ఆక్టేవియన్‌ అజమాయిషీలో వున్న ఎనిమిది దళాలు సెక్‌స్టన్‌ మాట వినడానికి మొరాయించాయి. అందువలన ఆక్టేవియన్‌ బలం తగ్గలేదు. ఇక అవతల ఆంటోనీ కూడా గాల్‌, స్పెయిన్‌లలో కొంత భాగానికి గవర్నరుగా నియమితుడైన లెపిడస్‌ సహాయంతో బలాన్ని పుంజుకున్నాడు. అతన్ని పంపించి సెనేట్‌తో బేరాలాడించాడు. లెపిడస్‌ సీజరు భక్తుడే అయినా అతనికి సెనేట్‌తో, సెక్స్‌టస్‌తో మంచి సంబంధాలున్నాయి. లెపిడస్‌, ఆంటోనీ సైన్యదళాలు కలిస్తే మొత్తం 17 దళాలున్నాయి. అందువలన సెనేట్‌ అతని మాట మన్నించవలసి వచ్చింది. 

ఇదంతా చూసి మే నాటికి ఆక్టేవియన్‌ ఆంటోనీకి కబురు పెట్టాడు – మనిద్దరం కలహించడం చేతనే సెనేట్‌ మనల్ని ఆడిస్తోంది. మనం చేతులు కలిపితే సెనేట్‌ను లొంగదీయవచ్చు, నువ్వు సరేనంటే నీపై దేశబహిష్కార శిక్ష ఎత్తేయాలని సెనేట్‌ను బహిరంగంగా కోరతాను అని. ఆంటోనీ రాజీకి సమ్మతించాడు. క్రీ.పూ. 43 జులైలో ఆక్టేవియన్‌ తనను కాన్సల్‌గా నియమించాలని, ఆంటోనీపై బహిష్కారం ఎత్తివేయాలని సెనేట్‌ను కోరాడు. సెనేట్‌ తిరస్కరించింది. వెంటనే తన 8 దళాలతో రోమ్‌పై దండెత్తి నగరాన్ని తన అదుపులోకి తీసుకున్నాడు. తనను తానే కాన్సల్‌గా ప్రకటించుకుని, తన సైనికులకు బహుమతులిచ్చి, సీజరు హంతకులకు, సెక్స్‌టస్‌కు శిక్షలు ప్రకటించాడు. ఆ తర్వాత లెపిడస్‌ మధ్యవర్తిత్వంతో ఆంటోనీని కలుసుకోవడానికి నవంబరులో గాల్‌ వెళ్లాడు. రెండు రోజుల చర్చల తర్వాత లిపిడస్‌, ఆంటోనీలతో కలిసి ఒక త్రయం (ట్రయమ్‌విరేట్‌)గా ఏర్పడ్డాడు. (దీన్ని ద్వితీయత్రయం అన్నారు. సీజర్‌, పాంపే, క్రాసస్‌లతో ఏర్పడిన ప్రథమత్రయం లాగే యిదీ కొంతకాలానికి విచ్ఛిన్నమైంది) ఐదేళ్లపాటు నియంతలుగా పాలించడానికి వారి మధ్య ఒప్పందం కుదిరింది. ముగ్గురి మధ్య సమతూకం సాధించడానికి రోమన్‌ సైన్యాన్ని, ప్రాంతాలను తమ మధ్య పంచేసుకున్నారు. ఆంటోనీకి గాల్‌, లెపిడస్‌కు స్పెయిన్‌, ఆక్టేవియన్‌కు ఆఫ్రికా దక్కాయి. ఇటలీని మాత్రం పంచుకోలేదు. తూర్పు మధ్యధరా ప్రాంతం బ్రూటస్‌, కేషియస్‌ చేతిలో మధ్యధరా దీవులు సెక్స్‌టస్‌ చేతిలో వున్నాయి. ఒప్పందంలో భాగంగా ఆక్టేవియన్‌ ఆంటోనీ సవతి కూతురు క్లోడియాను పెళ్లాడాడు.

ఇప్పుడు యీ త్రయం ముందున్న తక్షణ కర్తవ్యం – బ్రూటస్‌, కేషియస్‌, సెక్స్‌టన్‌లను ఓడించడం. అంతకంటె ముందు రోములో వున్న సీజరు హంతకులను నాశనం చేయడం. గతంలో నియంత సల్లా వుపయోగించిన చట్టాన్ని వుపయోగించి వాళ్లు తమ రాజకీయశత్రువులను దునుమాడారు. ఆ చట్టప్రకారం ప్రభుత్వం నేరస్తులుగా ప్రకటించిన వారికి పౌరసత్వ హక్కులు పోతాయి. అతని ఆచూకీ చెప్పి పట్టిచ్చినవారికి, స్వయంగా చంపినవారికి అతని ఆస్తిలో కొంత వాటా యిస్తారు. తక్కిన ఆస్తి ప్రభుత్వానికి పోతుంది. అతని మరణానంతరం అతని భార్య వేరెవరినీ పెళ్లాడడానికి వీల్లేదు. ఇలాటి చట్టాన్ని ఆసరా చేసుకుని వీళ్లు సెనేటర్లలో మూడో వంతు మందిని, 2 వేల మంది రోమన్‌ నైట్స్‌ను చంపేశారు. సిసెరోను ఉరి తీశారు. ఆస్తులు స్వాధీనం చేసుకోవడంతో ఖజానా గలగలలాడింది. ఆ డబ్బుతో వీళ్లు యుద్ధానికి సన్నద్ధమయ్యారు.  (ఫోటో – ఆక్టేవియన్‌ సీజరు) 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (మే 2016)

[email protected]

Click Here For Archives