హీరోగా రీ-ఎంట్రీ ఇస్తున్న సినిమా కోసం చిరంజీవి చాలానే కష్టపడుతున్నారు. ఆ కష్టమేంటో, సినీ 'మా' అవార్డ్స్ ఫంక్షన్‌ని చూస్తే అర్థమవుతుంది. మొత్తంగా ప్రోగ్రామ్‌ని మెగాస్టార్ చిరంజీవి సన్నిహితులే డిజైన్ చేశారా.? అన్పించక మానదు.. ఆద్యంతం ఆ ప్రోగ్రామ్‌ని పరిశీలించినవారికి. కేవలం చిరంజీవి రీ-ఎంట్రీకి టీజర్‌లా ఈ ప్రోగ్రామ్ రూపొందిందని అనడం అతిశయోక్తి కాదేమో.
సినీ 'మా' అవార్డ్స్ కార్యక్రమంలా మొదలై, మెగాస్టార్ కోసం రూపొందిన ప్రోగ్రామ్‌గా ముగిసిందిది. దాదాపు గంటకు పైగానే ప్రోగ్రామ్ చిరంజీవి చుట్టూ తిరిగింది. ఇంతలా 'స్పేస్' చిరంజీవికి ఈ ప్రోగ్రామ్‌లో దక్కడం పెద్ద విశేషమేమీ కాదు. ఎందుకంటే, 'మాటీవీ'లో చిరంజీవి, అల్లు అరవింద్ కూడా భాగస్వాములే. ఇప్పుడంటే 'మా' యాజమాన్యం మారినా, ఇప్పటికీ ఆ సంస్థతో తమ బంధం తెగిపోలేదని చిరంజీవి స్వయంగా సినీ మా అవార్డ్స్ వేదికపైనుంచి వ్యాఖ్యానించారు.
ఇక, చిరంజీవి రకరకాల గెటప్పుల్లో డాన్స్ చేస్తారనే ప్రచారం ముందుగా జరిగింది. ముఠా మేస్త్రి, స్వయం కృషి, శంకర్‌దాదా జిందాబాద్.. ఇలా పలు సినిమాల్లోని గెటప్పులతో చిరంజీవి డాన్స్ చేయడం ఖాయమన్నారు. కానీ, జస్ట్ అలా ఆ గెటప్స్‌లో కన్పించి, డైలాగులు పేల్చారంతే. స్టేజ్ పెర్ఫామెన్స్‌తో మాత్రం చిరంజీవి తనలోని మునుపటి జోష్‌ని ప్రదర్శించారన్నది కాదనలేని వాస్తవం.
షరామామూలుగానే చిరంజీవిపై తమ అభిమానాన్ని చాటుకునేందుకు దేవిశ్రీప్రసాద్, శ్రీకాంత్, సునీల్, నవదీప్ లాంటి యంగ్‌స్టర్స్ ఒకరితో ఒకరు పోటీ పడ్డారు. ఓవరాల్‌గా, సినీ 'మా' అవార్డ్స్ ఫంక్షన్ లక్ష్యమైతే నెరవేరింది. అదే, చిరంజీవి రీ-ఎంట్రీకి గ్రాండ్ పబ్లిసిటీ ఇవ్వడం.. మెగాభిమూనుల్లో జోష్ నింపడం. ఎలా చూసినా, ఈ ఫంక్షన్‌ని చిరంజీవి మేగ్జిమమ్ వాడేసుకున్నారన్నది నిర్వివాదాంశం.