సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయమిది. వైద్య రంగం మీద వందల కోట్లు, వేల కోట్లు ఖర్చుపెట్టేస్తున్నాం. కానీ, సామాన్యుడికి సరైన వైద్యం అందడంలేదు. పైగా, రోజురోజుకీ కొత్త కొత్త రోగాలు వెలుగు చూస్తున్నాయి. ఇవి అత్యంత ఖరీదైన రోగాలు. అంటే, దీనర్ధం ఆరోగ్యం రానురాను సామాన్యుడికి దూరమైపోతుందనే కదా.!
కారుణ్య మరణాలకు అనుమతిచ్చేలా కొత్త చట్టాన్ని తీసుకురావాలని కేంద్రం ఆలోచిస్తోంది. విధిలేని పరిస్థితుల్లో తమ కుటుంబంలోని వ్యక్తిని కోల్పోవడానికి ఆ కుటుంబానికి ఈ చట్టం అనుమతిస్తుందన్నమాట. ఎక్కడున్నాం మనం.? అన్న ఆలోచన, ఆవేదన చాలామందిలో కలిగాయి. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఇది సమంజసమే.. అన్నవారూ లేకపోలేదు.
తాజాగా చిత్తూరు జిల్లాలో ఎనిమిది నెలల చిన్నారి అరుదైన కాలేయవ్యాధితో బాధపడ్తోంది. ఆ కుటుంబం, తమ చిన్నారికి వైద్య చికిత్స చేసేంత ఆర్థిక స్థోమత కలిగి లేదు. చేసేది లేక, మెర్సీ కిల్లింగ్‌కి అనుమతివ్వాలని బాధిత కుటుంబం కోర్టునాశ్రయించింది. కొన్నాళ్ళు అలాగే వదిలేస్తే, ఆ చిన్నారి చనిపోయేదే. కానీ, ఇది తమ కుటుంబ సమస్య మాత్రమే కాదనీ, సామాజిక సమస్య అని భావించిన ఆ కుటుంబం కోర్టును ఆశ్రయించింది. విషయం బయటకు పొక్కాక సమాజం చలించిపోయింది. ప్రభుత్వం కాస్త కనికరించింది.
మంత్రి కామినేని శ్రీనివాస్, బాధితురాలికి వైద్య చికిత్స అందిస్తామని ప్రకటించారు. ఆ కుటుంబం ప్రభుత్వాన్ని సంప్రదించాలని కోరారు. చిత్రమైన సందర్భమే ఇది. ప్రభుత్వం తన బాధ్యతను పూర్తిగా విస్మరించిందన్న విషయం కామినేని మాటల్లో స్పష్టమవుతోంది. కోర్టుకెక్కాక, మీడియా ద్వారా విషయం వెలుగు చూశాక, ప్రభుత్వమే ఆ చిన్నారి బాధ్యత తీసుకోవాలి. ప్రభుత్వ యంత్రాంగం ఆ కుటుంబాన్ని సంప్రదించాల్సి వుంది. కానీ, ఇక్కడ ఆ కుటుంబమే ప్రభుత్వాన్ని సంప్రదించాలట.
ఏమైపోతున్నాయి ప్రభుత్వాసుపత్రులు.? ఏమైపోతున్నాయి ప్రజా వైద్యం కోసం ఖర్చు చేస్తున్న వేల కోట్ల నిధులు.? ఇప్పటికైనా ప్రజారోగ్యంపై ప్రభుత్వాలు మొద్దునిద్ర వీడాలి. కార్పొరేట్ ఆసుపత్రులకు రెడ్ కార్పెట్ వేయాలన్న వెర్రికి చెక్ పెట్టాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమనే కాదు, దేశవ్యాప్తంగా.. ఈ మెర్సీ కిల్లింగ్ ఎపిసోడ్ పాలకులకు కనువిప్పు కావాల్సిందే.