పశ్చిమగోదావరి జిల్లా పట్టిసీమ వద్ద గోదావరి నుంచి నీటిని లిఫ్ట్ చేసి, ఆ నీటిని కృష్ణా నదిలో కలపడానికోసమంటూ 'తాత్కాలిక' ప్రాజెక్ట్‌కి శ్రీకారం చుట్టారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు. అసలు గోదావరిలోనే నీళ్ళు లేనప్పుడు, అక్కడినుంచి కృష్ణా నదిలోకి 'ఎత్తిపోయడం' ఎలా కుదురుతుంది.? అంటే, దానికి చంద్రబాబు వద్ద లాజిక్ ఒకటుంది. గోదావరికి కృష్ణా నదికి ఒకేసారి వరదలు రావు. సో, గోదావరికి వరద వచ్చినప్పుడు ఆ నీటిని ఎత్తి కృష్ణా నదిలోకి పంపుతారట.
ఏంటో, ఈ లెక్కలు.. చంద్రబాబుకే అర్థమవ్వాలి. పోనీ, అదే నిజం అనుకుందాం. మరి, పోలవరం ప్రాజెక్టు మాటేమిటి.? ఈ ప్రశ్నకీ చంద్రబాబు ఓ సమాధానం చెబుతారు. పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టులో అంతర్భాగమేనని. విభజన చట్టంతో పోలవరం జాతీయ ప్రాజెక్టు అయ్యింది. ఆ లెక్క, పోలవరం ప్రాజెక్టులో పట్టిసీమ అంతర్భాగమా? కాదా? అన్నది కేంద్రమే డిసైడ్ చెయ్యాలి. కేంద్రమేమో, పట్టిసీమ లెక్కలేంటో అర్థం కాలేదని చెబుతుంది.
ఈ గందరగోళం ఇలా వుండగానే, తెలంగాణ రాష్ట్రం పట్టిసీమ విషయంలో కొత్త కొర్రీలు షురూ చేసింది. ఆ ప్రాజెక్ట్ నీటిలో వాటా కావాలని అడుగుతోంది. గోదావరి నుంచి కృష్ణాలో నీళ్ళు కలిపాక, ఆ నీళ్ళు కృష్ణా నీళ్ళు అవుతాయి గనుక, అందులో తమకూ వాటా వుంటుంది గనుక, ఆ లెక్కలు తేల్చాలని మంత్రి హరీష్‌రావు సెలవిచ్చారు. సరే, ఆ వాదనలో పస ఎంత.? అన్నది వేరే విషయం.
పట్టిసీమ జాతికి అంకితమయ్యింది.. పోలవరం ప్రాజెక్టు అటకెక్కింది. అంటే, ఇక్కడ కొసరు ప్రాజెక్టు ఏమో శరవేగంగా పూర్తవుతోంది. అసలు ప్రాజెక్టేమో అడ్రస్ కోల్పోయిందన్నమాట. మరి, రాయలసీమకు నీళ్ళు ఎలా వెళతాయి.? ఈ ప్రశ్నకు మాత్రం చంద్రబాబు దగ్గర సమాధానం వుండదు. ఆయన చేతిలో లెక్కలు మాత్రమే వుంటాయి. అన్ని టీఎంసీల నీళ్ళు.. ఇన్ని టీఎంసీల నీళ్ళు.. అంటూ రాయలసీమకు వెళ్ళి అక్కడ హడావిడి చేస్తున్న చంద్రబాబు, ఇదిగో ఈ నీళ్ళు రాయలసీమకు ఇచ్చామని ఇప్పటిదాకా చెప్పారా? లేదే.!
ఓ పక్క రాయలసీమ భగ్గుమంటోంది.. ఇంకోపక్క తెలంగాణ పట్టిసీమ పేరుతో ఆంధ్రప్రదేశ్ మెడకు ఉచ్చు బిగించేస్తోంది.. మరోపక్క కేంద్రం, పట్టి సీమను సాకుగా చూపి, పోలవరం ప్రాజెక్టుకి ఎగనామం పెట్టేసింది. వీటి ఎఫెక్ట్ చంద్రబాబుకి ఇప్పుడే తెలియకపోవచ్చు. కానీ, ముందు ముందు పట్టిసీమ చంద్రబాబు మెడకు చాలా చాలా గట్టిగా చుట్టుకుంటుందన్నది నిర్వివాదాంశం. ఆ దెబ్బకు చంద్రబాబు ఊపిరి ఆడదుగాక ఆడదు.
పట్టిసీమ ప్రాజెక్ట్ పేరుతో చంద్రబాబు కాంట్రాక్టర్లకు లబ్ది చేకూర్చారనీ, తెరవెనుక కోట్లాది రూపాయల్ని కొల్లగొట్టేశారనీ విమర్శలు విన్పిస్తున్న వేళ, పట్టిసీమతో ఎలాంటి ప్రయోజనం లేకపోవడం, నదుల అనుసంధానం ఘనత తనదేనని చెప్పుకుంటూ, తెలంగాణ ముందు నీటి పంపకాల విషయంలో బొక్క బోర్లా పడటం.. ఇవన్నీ, రాజకీయంగా చంద్రబాబుని దారుణంగా దెబ్బకొట్టనున్నాయి.
ఇప్పుడు చంద్రబాబు ముందున్న ఆప్షన్ ఒకటే. పోలవరం ప్రాజెక్టులో పట్టిసీమ అంతర్భాగమని ప్రకటించడం – పట్టిసీమ ద్వారా రాయలసీమకు నీళ్ళు ఇవ్వడం. కానీ, ఈ రెండూ అసాధ్యం. మరి, చంద్రబాబు పరిస్థితేంటి.?