ముందూ వెనుకా చూసుకోకుండా ప్రజాబలం ఉన్నదని, సొంతంగా గెలవగల సత్తా ఉన్నదని అనిపించిన ప్రతి నాయకుడిని ఇతర పార్టీల నుంచి తమ పార్టీలోకి ఫిరాయింపజేసి చేర్చుకుంటే, సొంత పార్టీలో ముసలం పుట్టడం తప్ప మరొక పర్యవసానం ఉండదు. ఈ సంగతి తెలంగాణలోని భారత రాష్ట్ర సమితికి అవగాహన అయినట్లుగా మరొకరికి అర్థమవదు.
ఎందుకంటే 2018 అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన తర్వాత గులాబీ దళంలో ఒక ఆశ పుట్టింది. ఆ ఎన్నికల్లో తమ పార్టీ హవాకు ఎదురొడ్డి గెలిచిన వారందరూ ప్రజాబలం ఉన్న వారేననే అభిప్రాయం ఏర్పడింది. కాంగ్రెసులోని అలాంటి ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి ఏకంగా 12 మందిని తమ జట్టులో కలిపేసుకుంది. అయితే ఆయా నియోజకవర్గాలలో పాత గులాబీలకు – కొత్త గులాబీలకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వైరం కొనసాగుతూ ఉందనే సంగతి అందరికీ తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లా కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పదవికి గండం వచ్చింది. గత ఎన్నికల్లో కొత్తగూడెం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన వెంకటేశ్వరరావు ఆ తర్వాత భారాసలో చేరారు. అయితే ఆయన తప్పుడు వివరాలతో నామినేషన్ సందర్భంగా తన మీద ఉన్న క్రిమినల్ కేసులు, ఆస్తుల వివరాలను తెలియజెప్పకుండా దాచారని ఆరోపిస్తూ ఆ ఎన్నికల్లో ఓడిపోయిన తెరాస అభ్యర్థి జలగం వెంకట్రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యవహారంపై సుదీర్ఘమైన విచారణ చేపట్టిన హైకోర్టు వనమా ఎన్నిక చెల్లదంటూ తాజాగా 84 పేజీల తీర్పును వెలువరించింది.
కొత్తగూడెం లో ఉన్న ఒక ఇంటి స్థలాన్ని ఆస్తి వివరాల్లో చూపించలేదని, అది ఆయన భార్య పేరిట ఉన్నదని, విక్రయాలు జరిగిన డాక్యుమెంట్ల పరంగా కూడా ఆమె భార్య అని తేలుతున్నదని దావాలో పేర్కొన్నారు. ఈ ఆరోపణల ద్వారా వనమా వెంకటేశ్వరరావుకు ఇద్దరు భార్యలు ఉన్నట్లుగా కూడా వివరాలు బయటకు వచ్చాయి. క్రిమినల్ కేసుల విషయం కూడా పేర్కొనలేదనడం బయటకు వచ్చింది.
అయితే ఈ కేసు విచారణ సందర్భంగా, సాక్షిగా పిలిచినా కూడా వనమా స్వయంగా కోర్టుకు హాజరు కాలేదు. ఆ ఆరోపణలను న్యాయవాది మాత్రమే ఖండించారు. దీంతో ఆరోపణలన్నీ వాస్తవాలని భావించాల్సి ఉంటుందంటూ హైకోర్టు ఎమ్మెల్యేగా ఆయన ఎన్నిక చెల్లదంటూ తీర్పు వెలువరించింది. ఆయనకు ఐదు లక్షల జరిమానా విధించింది. 2018 నుంచి కేసు వేసిన జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా గుర్తించాలని కూడా తీర్పులో పేర్కొంది.
ఎన్నికలు కేవలం కొన్ని నెలల దూరంలో ఉండగా ఇప్పుడు వనమా వెంకటేశ్వరరావుకు ఈ తీర్పు పెద్ద షాక్ కాకపోవచ్చు. పైగా సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో అనర్హత అనేది ఎప్పుడు అమలులోకి వస్తుందో.. ఆ గండం తప్పించుకుని ఆయన ఏకంగా మళ్లీ ఎన్నికలనే ఎదుర్కొంటారో తేల్చి చెప్పడం కష్టం.
కాకపోతే భారత రాష్ట్ర సమితి పార్టీలో పాత గులాబీలకు, వలస వచ్చిన కొత్త గులాబీలకు మధ్య ఒకరి వెనుక ఒకరు గోతులు తవ్వుకునే ప్రబలమైన శత్రుత్వం ఉన్నదనే సంగతి అర్థం అవుతోంది!