తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేస్తామని ప్రతిజ్ఞలు చేస్తూ, డాంబికంగా పలుకుతున్న భారతీయ జనతా పార్టీ, ఖమ్మంలో కనీసం బహిరంగ సభ నిర్వహించడానికి కూడా భయపడుతోందా? భారత రాష్ట్ర సమితి, కాంగ్రెస్ పార్టీలు భారీ భారీ సభలను నిర్వహించిన చోటనే తాము కూడా సభా నిర్వహణకు పూనుకుంటే.. తమ బలహీనత బయటపడిపోతుందని వారు జంకుతున్నారా? అనే అభిప్రాయం ఇప్పుడు పలువురిలో ఏర్పడుతోంది.
ఎందుకంటే ఖమ్మంలో నిర్వహించదలచుకున్న అమిత్ షా సభను పార్టీ రద్దు చేసుకుంది! భారీ వర్షాలను ఇందుకు సాకుగా చూపిస్తున్నారు. అయితే ఈనెల 29వ తేదీన అమిత్ షా తెలంగాణ పర్యటన మాత్రం యధాతధంగా జరుగుతుంది. రెండు మూడు పార్టీ కార్యక్రమాలలో ఆయన పాల్గొంటారు. వివిధ రంగాలకు చెందిన మేధావులతో సమావేశం అవుతారు.
భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ సభను కెసిఆర్ వ్యూహాత్మకంగా ఖమ్మంలో అత్యంత భారీ స్థాయిలో నిర్వహించారు. ఆ తర్వాత మోడీ 9 ఏళ్ల పాలన గురించి ప్రచారం చేసుకోవడానికి దేశవ్యాప్తంగా తలపెట్టిన అనేక సభలలో ఒకదానిని ఖమ్మంలో బిజెపి వారు ప్లాన్ చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ సభకు హాజరుకావాలనేది ప్రణాళిక. అప్పటి పార్టీ సారధి బండి సంజయ్ జన సమీకరణ పరంగా కూడా పూర్తిస్థాయి ఏర్పాట్లు చేశారు. కానీ గుజరాత్ లో వరదలు ముంచుకురావడంతో సభ కాస్తా వాయిదా పడింది.
ఆ తరువాత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీలో చేరుతున్న సందర్భంగా కాంగ్రెస్ ఖమ్మంలో భారీ బహిరంగ సభను నిర్వహించింది. ఈ సభకు విపరీతంగా జన సమీకరణ చేశారు. మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపు సభగా కూడా దీనిని నిర్వహించారు. రాహుల్ గాంధీ హాజరయ్యారు.
ఈ రెండు సభల తర్వాత- తాము ఆ స్థాయిలో సభ నిర్వహించడం సాధ్యం కాదని, అంతటి జన సమీకరణ చేయడం కుదరదని బిజెపి భయపడినట్లుగా తేటతెల్లం అవుతోంది. అందుకే తెలంగాణలో భారీ వర్షాల సాకుతో అమిత్ షా సభను రద్దు చేసుకున్నారని పలువురు భావిస్తున్నారు. గుజరాత్ వరదల సమయంలో తెలంగాణ ప్రశాంతంగానే ఉన్నప్పటికీ అమిత్ షా కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు.
ఇప్పుడు తెలంగాణలో వర్షాలు పడుతున్న నేపథ్యంలో మరోసారి వాయిదా వేసుకుంటే మాత్రం పోయేదేముంది. 29న ఇతర కార్యక్రమాలలో మాత్రమే ఎందుకు పాల్గొనాలి అనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. ‘వాయిదా అనే పదం లేకుండా ఏకంగా సభను రద్దు చేసుకోవడం అనేది కమల నాయకుల పిరికితనానికి నిదర్శనం’ అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ఈ విమర్శలను ఎలా తిప్పి కొడుతుందో చూడాలి.