మరికొన్ని గంటల్లో బ్రో సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించబోతున్నాడు సాయిధరమ్ తేజ్. ఈ సినిమా తర్వాత అతడు మరో సినిమా సెట్స్ పైకి వెళ్తాడని అంతా అనుకుంటారు. అది సహజం కూడా.
కానీ బ్రో సినిమా తర్వాత ఓ షార్ట్ ఫిలిం రిలీజ్ చేస్తున్నాడు సాయిధరమ్ తేజ్. తన నుంచి నెక్ట్స్ వచ్చేది అదేనని స్పష్టం చేశాడు. ఆ షార్ట్ ఫిలిం పేరు సత్య.
“సత్య అనే టైటిల్ తో షార్ట్ ఫిలిం తీశాం. నేను, నా బెస్ట్ ఫ్రెండ్స్ నవీన్, స్వాతి కలిసి తీశాం. బ్రో తర్వాత నా నుంచి వచ్చేది అదే. ఈ షార్ట్ ఫిలింకు దర్శకుడు, ఎడిటర్ రెండూ నవీనే. ఈ కాన్సెప్ట్ నాకు చాలా నచ్చింది. సైనికుల భార్యల పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ షార్ట్ ఫిలిం ఉంటుంది. మాతృభూమి కోసం వాళ్లు ఎంత త్యాగం చేస్తున్నారనేది ఇందులో చూపించాం.”
ఈ షార్ట్ ఫిలిం నిడివి 23 నిమిషాలు మాత్రమే. ఆగస్ట్ 15న ఈ షార్ట్ ఫిలింను ఎనౌన్స్ చేస్తారు. అదే రోజున లఘు చిత్రం థీమ్ ను వివరిస్తూ ఓ సాంగ్ ను విడుదల చేయబోతున్నారు. ఆ తర్వాత ఓ మంచి డేట్ చూసి రిలీజ్ చేస్తారు. సైనికులపై తీసిన సినిమా కావడంతో, తెలుగుతో పాటు మరిన్ని భాషల్లో విడుదల చేయాలని అనుకుంటున్నాడు సాయితేజ్.
బ్రో సినిమా తర్వాత గ్యాప్ తీసుకుంటాడనే ఊహాగానాలకు చెక్ పెడుతూ ఈ విషయాన్ని వెల్లడించాడు సాయితేజ్. ఆల్రెడీ సంపత్ నంది సినిమాకు ఓకే చెప్పాడు. ఓవైపు ఆ సినిమాకు కాల్షీట్లు కేటాయిస్తూనే, మరోవైపు ఫిజికల్ గా ఫిట్ అయ్యేందుకు ఎక్సర్ సైజులతో పాటు, స్పీచ్ థెరపీ లాంటివి ట్రై చేస్తానని అంటున్నాడు.