బురద చల్లుడుమాని నిజం తెలుసుకో పవన్!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయి లో మరింత బాధ్యతగా అమలు చేయడానికి, లబ్ధిదారులకు కించిత్తు ఇబ్బంది లేకుండా వారికి ఇంటి వద్దనే ప్రభుత్వ పథ కాలు అందచేయడానికి.. సమున్నత లక్ష్యంతో తీసుకువచ్చిన వాలంటీర్…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయి లో మరింత బాధ్యతగా అమలు చేయడానికి, లబ్ధిదారులకు కించిత్తు ఇబ్బంది లేకుండా వారికి ఇంటి వద్దనే ప్రభుత్వ పథ కాలు అందచేయడానికి.. సమున్నత లక్ష్యంతో తీసుకువచ్చిన వాలంటీర్ వ్యవస్థ గురించి జనసేనాని పవన్ కళ్యాణ్ ఎంత చులకనగా, ఎంత నీచంగా మాట్లాడారో అందరికీ తెలుసు.

వాలంటీర్ వ్యవస్థ మహిళల అక్రమ రవాణాకు పాల్పడుతున్నారంటూ పవన్ కళ్యాణ్ అతి నీచమైన ఆరోపణలు చేశారు. గ్రామాల్లో ఉండే ఒంటరి మహిళలు, అమ్మాయిల వ్యక్తిగత వివరాలను సేకరించి వారిని వ్యభిచార గృహాలకు తరలిస్తున్నారని నిందలు వేశారు. అయితే వాస్తవాలు ఏమిటో గణాంకాల సహితంగా కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

రాజ్యసభలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి అజయ్  మిశ్రా ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలుగు రాష్ట్రాల్లో ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో అమ్మాయిలు, మహిళలు అదృశ్యం అవుతున్న సంగతిని కేంద్రం ప్రకటించింది.

రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి గత మూడేళ్లలో 72 వేల 767 మంది అదృశ్యం అయినట్టు పార్లమెంటుకు నివేదించింది. వీరిలో సుమారు 16 వేల మంది అమ్మాయిలు ఉండగా 56 వేల పైచిలుకు మహిళలు ఉన్నారని తెలిపింది. ఈ కేసులు ప్రతి సంవత్సరం పెరుగుతున్నాయని కూడా వెల్లడించింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలు, బాలికలు అదృశ్యం అవుతుండడానికి వాలంటీర్లే కారణం అనేది పవన్ కళ్యాణ్ చేసిన నీచమైన ఆరోపణ. అయితే కేంద్ర హోమ్ శాఖ ప్రకటించిన వివరాలను గమనించినప్పుడు ఆంధ్రప్రదేశ్ కంటే జనాభా పరంగా అతి తక్కువ ఉండే తెలంగాణలో ఏపీ కంటే ఎక్కువ మంది అదృశ్యం అవుతున్న సంగతి చాలా స్పష్టంగా తెలియజేసింది.

గత మూడేళ్లలో ఆంధ్రప్రదేశ్లో మొత్తం 30 వేల మంది అదృశ్యం అయ్యారు. అదే తెలంగాణ విషయానికి వస్తే 43 వేల మంది అదృశ్యం అయినట్లుగా కేంద్రం ప్రకటించిన గణాంకాలు మనకు తెలియజేస్తాయి.

ఏపీలో మహిళలు అదృశ్యం కావడానికి వాలంటీర్లే కారకులని.. ఒక మంచి వ్యవస్థ మీద చెత్త ఆరోపణలు చేస్తున్న పవన్ కళ్యాణ్.. అంతకంటే ఎక్కువగా తెలంగాణలో జరుగుతున్న అదృశ్యాలకు ఎలాంటి సంజాయిషీ ఇస్తారు? ఎలాంటి వివరణ ఇవ్వగలరు? తెలంగాణలో ఏ కారణంగా ఎక్కువ మంది బాలికలు, మహిళలు అదృశ్యం అవుతున్నారని చెప్పగలరు? అనేది ప్రజలకు కలుగుతున్న సందేహం!

అమ్మాయిలు, మహిళలు అదృశ్యం అయ్యారంటే.. అలా అని కేసు నమోదు అయిన ప్రతి సందర్భంలోనూ వాళ్ళు వ్యభిచార గృహాలకు తరలిపోయినట్లుగా రంగు పులమడం చాలా చవక బారు పని. ప్రేమ వ్యవహారాల కారణంగానే నూటికి 99 శాతం మంది అమ్మాయిలు ఇంటి నుంచి వెళ్ళిపోతుంటారు. తమ ప్రేమను పెద్దలు అంగీకరించరని అనిపించినప్పుడు పారిపోయి పెళ్లి చేసుకోవడం చాలా సహజంగా జరిగే వ్యవహారం. ఇలాంటి ప్రతి సందర్భంలోనూ ఒక కేసు నమోదు అవుతూనే ఉంటుంది.

మహిళల అదృశ్యం విషయంలో కూడా అనేక సామాజిక కారణాలు ఉన్నాయి. భర్తల వేధింపులు భరించలేని వారు ఇతర వైవాహికేతర సంబంధాలు ఉన్నవారు ఆ కారణంగా రహస్యంగా పారిపోవడం, వారి సంబంధీకులు పోలీసు కేసు నమోదు చేసి ఊరుకోవడం అనేది తరచుగా జరిగే పని! అయితే వీటన్నింటినీ కూడా వ్యభిచార గృహాలకు తరలిపోయే వ్యవహారాలుగా ప్రకటిస్తున్న పవన్ కళ్యాణ్.. మసిపూసి మారేడు కాయ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి నీచమైన ఎత్తుగడలను మానుకోకుంటే ప్రజలు ఆయనను అసహ్యించుకుంటారు.

కేంద్రం ప్రకటించిన వివరాల నేపథ్యంలో తాను చెప్పిన మాటలు అక్షర సత్యాలని పవన్ కళ్యాణ్ చంకలు గుద్దుకుంటే అది ఆత్మవంచన. తెలంగాణలో ఇంతకంటే ఎక్కువమంది అదృశ్యం అవుతున్నప్పుడు అక్కడ ఏ వాలంటీర్ వ్యవస్థ ఉన్నదని ఎలా ఈ సంఘటనలు జరుగుతున్నాయని ఆయన వివరణ చెబుతారు? కాబట్టి తన ఆరోపణల్లో పసలేదని, ఇలాంటి చవకబారు ఆరోపణలను తాను కొనసాగిస్తే ప్రజలు తనను విశ్వసించకుండా అసహ్యించుకుంటారని పవన్ తెలుసుకోవాలి.