పార్లమెంటులో ప్రతిపక్ష పార్టీలు మోడీ సర్కారు మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టాయి. ఈ తీర్మానాన్ని స్పీకరు ఓం బిర్లా అనుమతించారు కూడా. అన్ని పార్టీలతో చర్చించిన తరువాత.. చర్చకు సమయం కూడా ప్రకటిస్తానని స్పీకరు ఓం బిర్లా అన్నారు. అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టాలంటూ కాంగ్రెస్, భారాస పార్టీలు నోటీసులు అందించాయి. ఈ అవిశ్వాసం నేపథ్యంలో చిత్రమైన సందేహాలు కలుగుతున్నాయి.
సింగిల్ లార్జెస్ట్ పార్టీగా భారతీయ జనతా పార్టీనే పూర్తి మెజారిటీ కలిగి ఉండగా.. ఎన్డీయే కూటమి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టడం వలన ఏమైనా ప్రయోజనం ఉంటుందా? అనేది ప్రధానంగా వినిపిస్తున్న సందేహం. ఎందుకంటే.. ఎన్నికలకు ఇంకా ఏడాది దూరం కూడా లేదు. ఆరునెలల తర్వాత ఏ క్ష్ణణమైనా ఎన్నికలు ముంచుకురావొచ్చు. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు అవిశ్వాసం పెట్టడం అవసరమా? అనే అనిపిస్తుంది.
అయితే ప్రధాని నరేంద్రమోడీతో కేవలం ఆయన నోరు తెరిచి మాట్లాడేలా చేయడానికి ప్రతిపక్షాలు బ్రహ్మాస్త్రాన్ని బయటకు తీయాల్సి వచ్చింది. మణిపూర్ లో చెలరేగుతున్న హింస, అల్లర్లపై ప్రధాని పార్లమెంటులో మాట్లాడాలంటూ విపక్షాలు సమావేశాలు మొదలైన తొలిరోజు నుంచి డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. తమ పార్టీ ప్రభుత్వమే ఏలుబడి సాగిస్తున్న మణిపూర్ లో అల్లర్ల గురించి, హింస గురించి, అదుపు తప్పుతున్న శాంతి భద్రతలు, పెచ్చరిల్లుతున్న అశాంతి గురించి, ఆ సర్కారు చేతగానితనం గురించి మాట్లాడడానికి నరేంద్రమోడీకి నోరు వస్తున్నట్టుగా లేదు. ఇతర పార్టీల ప్రభుత్వాల పాలన ఉన్న రాష్ట్రాల గురించి.. తీవ్రమైన నిందలు వేసే అలవాటున్న నరేంద్రమోడీ మణిపూర్ గురించి నోరు మెదపడం లేదు.
పార్లమెంటులో ఆయన మాట్లాడాలని డిమాండ్ చేసీ చేసీ.. విపక్ష పార్టీలు పూర్తిగా అలసిపోయాయి. ప్రధాని నోరుమెదపకపోతుండడంతో ఇక వేరే గత్యంతరం లేదన్నట్టుగా అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాయి.
అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రభుత్వం మీద నిలకడగా నిందలు వేయడం కుదురుతుంది అనేది వారి కోరిక. ప్రతిపక్ష పార్టీలన్నీ ప్రభుత్వ అసమర్థత గురించి మాట్లాడిన తర్వాత సభా నాయకుడిగా మోడీ కూడా స్పందించి తీరాల్సిందేనని, మణిపూర్ పై సంజాయిషీ చెప్పాల్సిందేనని వారు ఎదురుచూస్తున్నారు.
అయితే అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా మోడీ మాట్లాడతారేమో గానీ.. అందులో కూడా మణిపూర్ అల్లర్ల గురించి ఎలాంటి వివరణ లేకుండా, డొంకతిరుగుడు మాటలు చెబితే ఏం చేస్తారు? సూటిగా జవాబివ్వకుండా ప్రభుత్వాన్ని అస్థిర పరచడానికి ఓర్వలేని విపక్షాలు చేసిన ప్రయత్నం ఇది అని ఎదురునిందలు వేసి మిన్నకుంటే ఏం చేయగలరు? అలాంటి పరిణామాలకు కూడా విపక్షాలు సిద్ధమై ఉంటే మంచిది.